నూతన కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది..

The state government will support the new families.– ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
నేతన్న కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఉండగా ఉంటుందని, వారి సమస్యలను పరిష్కస్తుందని ప్రభుత్వ విప్, ఆలేరు శాసనసభ్యులు బీర్ల అయిలయ్య అన్నారు. కలెక్టరేటులో చేనేత కార్మికులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ  చేనేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా వుంటుందని, వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని తెలిపారు. 1905 లో విదేశీ వస్త్రం వద్దు స్వదేశీ వస్త్రం ముద్దు అని ఉద్యమం చేపట్టడం జరిగిందని, 2015 ఆగష్టు 7 నుండి జాతీయ చేనేత దినోత్సవం జరుపుకుంటున్నామని తెలిపారు. అగ్గిపెట్టెలో పట్టే చీరలు నేసిన నేతన్నలు పస్తులుండకూడదని అన్నారు. బతుకమ్మ చీరల బకాయిలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం 150 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. నేతన్నలకు సబ్సిడీలతో పాటు అన్ని విధాలుగా ఇన్సూరెన్స్ కోసం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని, బయట రాష్ట్రాల మాదిరిగా నేతన్నలకు లబ్దిచేకూర్చేలా చేస్తామని, జిఎస్.టి. తగ్గించేలా కృషి చేస్తామని, నేతన్నల సమస్యలను, డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తెచ్చి వారి ఆర్ధిక సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ బట్టను మనిషికి ఇచ్చింది నేతన్నేనని, అలాంటి నేతన్నల బాగు కోసం రైతు భరోసా లాగా నేతన్న భరోసాకు కృషి చేస్తామని తెలిపారు. నేతన్నల ఆర్ధిక స్థితిగతులు పెరిగేలా అందరూ ఆలోచించాలని, నేతపైనే వారి కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని, నేత పురాతనమైనదని, అనాది ఈ ఆచార సాంప్రదాయాలను నిలబెట్టుకుంటూ రాబోయే తరాలకు వారి కళను అందిస్తున్నారని అన్నారు. ప్రపంచ ప్రసిద్దిగాంచిన పోచంపల్లి కళను మనం కాపాడాల్సి వుందని అన్నారు. రాష్ట్రపతి పోచంపల్లి సందర్శనకు వచ్చినప్పుడు ఏర్పాటు చేసిన చేనేత కళల స్టాల్స్ అద్భుతంగా వున్నాయని, ఆ చీరలపై వారి కష్టం కన్పించిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసాతో 60 లక్షల మంది రైతులకు 31 వేల కోట్లతో మేలు చేసిందని, రాష్ట్రం మొత్తం మీద 2 లక్షల నేతన్నల కుటుంబాలు ఉంటాయని, వీరికి కూడా నేతన్న భరోసాకు కృషి చేస్తామని తెలిపారు. తయారీ చేసిన వస్త్రాలను 30 శాతం ప్రభుత్వమే కొనుగోలు చేసేలా చూస్తామని, పోచంపల్లికి హ్యాండ్లూమ్ టెక్నాలజీ తెస్తామని, నేతన్నల సమస్కలను పరిష్కరించి మేలు చేస్తామని తెలిపారు.
జిల్లా కలెక్టరు హనుమంత్ కే జెండగే మాట్లాడుతూ చేనేత వృత్తి కాదు ఒక సంస్కృతి అని, స్వదేశీ ఉద్యమంతో ఊపందుకున్న చేనేత కళా సంస్కృతిని ఒక తరం నుండి ఇంకొక తరానికి అందిస్తూ కాపాడుతున్నారని అన్నారు. తెలంగాణలో చారిత్రకత కలిగిన ఈ జిల్లాలో పోచంపల్లి డిజైన్ ప్రసిద్ది పొందిందని అన్నారు. ఇంత ప్రసిద్ది పొందిన కళ కాబట్టి పోచంపల్లి చేనేత కుటుంబాలను కలవడానికి గత డిసెంబరులో రాష్ట్రపతి వచ్చారని తెలిపారు. మన దగ్గర నెపుణ్యంతో పాటు కలర్ తయారీ కూడా అద్భుతంగా ఉందని అన్నారు. జిల్లాలో 6672 చేనేత మగ్గాలకు, 2240 మరమగ్గాలకు జియో ట్యాగ్ చేయబడ్డాయని తెలిపారు. నేతన్నకు చేయూత క్రింద 11,888 చేనేత కార్మికులు నమోదు చేసుకోవడం జరిగిందని, వీరికి రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ల క్రింద 44 కోట్ల 63 లక్షలు వారి పొదుపు ఖాతాలలో జమ కావడం జరిగిందని, 1070 మరమగ్గాల కార్మికులకు మ్యాచింగ్ గ్రాంట్ క్రింద ఒక కోటి 61 లక్షలు వారి ఖాతాలలో జమ కావడం జరిగిందని తెలిపారు. నేతన్న బీమా పథకంలో 10,686 మంది కార్మికులను చేర్చడం జరిగిందని, వివిధ కారణాలతో మరణించిన 50 మందికి 5 లక్షల చొప్పున 2 కోట్ల 50 లక్షలు వారికి కుటుంబాలకు అందించడం జరిగిందని తెలిపారు. ప్రధానమంత్రి చేనేత ముద్ర లోన్ యోజన క్రింద బ్యాంకుల ద్వారా అర్హత కలిగిన 228 చేనేత కార్మికులకు ఒక కోటి 14 లక్షలు ఋణాలు మంజూరు చేయడం జరిగిందని, జాతీయ చేనేత అభివృద్ధి పథకం క్రింద జిల్లాలో 7 చేనేత క్లస్టర్స్ మంజూరు అయ్యాయని, ఈ క్లస్టర్స్ ద్వారా మొత్తం 1755 మంది లబ్దిదారుల కొరకు 9 కోట్ల 72 లక్షలు మంజూరై 3 కోట్ల 48 లక్షలు విడుదల కాబడి చేనేత కార్మికులకు మగ్గాలు, పరికరాలు అందించబడ్డాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో చేనేత సొసైటీల ప్రతినిధులు గర్దాసు బాలయ్య, పిల్లలమర్రి శ్రీనివాసులు, దుడుక ఉప్పలయ్య చేనేత రంగం పరిస్థితులపై మాట్లాడారు. కార్యక్రమంలో చేనేత రంగంలో విశేష కృషి చేసిన నేతన్నలకు సన్మానం చేశారు.  నేతన్నకు చేయూత, నేతన్న బీమా చెక్కులను అందించారు. తొలుత జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా చేనేత కళను కాపాడుతామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ పోలీస్ కమీషనర్ రాజేష్ చంద్ర, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టరు కె గంగాధర్, జిల్లా చేనేత జౌళి శాఖ అసిస్టెంట్ డైరెక్టరు కామిల్ అహ్మద్, చేనేత శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.