– బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
గ్యారెంటీల పేరుతో గద్దెనెక్కిన కాంగ్రెస్ రాష్ట్రాన్ని దివాళా తీయించిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా విమర్శించారు. ఓ విద్యుత్తు సంస్థకు చెల్లించాల్సిన రూ.150 కోట్లను రికవరీ చేసేందుకు ఢిల్లీలోని హిమాచల్ భవన్ జప్తునకు హైకోర్టు ఆదేశాలు ఇవ్వడాన్ని ప్రస్తావిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ”గద్దెనెక్కడం కోసం అడ్డగోలుగా గ్యారెంటీలు ఇవ్వడం కాంగ్రెస్ పార్టీకి పరిపాటిగా మారింది.
చేతికందినన్ని అప్పులు చేయడం, ఆఖరికి ఉన్న ఆస్తులు జప్తు చేయించుకునే పరిస్థితికి రావడం దారుణం. ఇది ఏ జూదగాని ఇంటి కథ కాదు. సాక్షాత్తు హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వ తీరు. అదే రీతిలో రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన సాగుతోంది. తెలంగాణలో ఆరు గ్యారెంటీలను అమలు చేయడానికి ఏమేం విక్రయిస్తారో రాహుల్ గాంధీ చెప్పాలి” అని కేటీఆర్ ప్రశ్నించారు.