హృదయాన్ని ద్రవింపజేసే ఎరుకల కథలు

Heart-melting fairy talesముఖ్యంగా తెలుగు సాహిత్యంలో ఎరుకల జీవితాన్ని నేపథ్యంగా చేసుకొని వెలువడిన రచనలు చాలా తక్కువ. ఇదే విషయాన్ని ముందుమాటలో డా. ఎ.కె. ప్రభాకర్‌ స్పష్టం చేశారు. ”ఎరుకుల కుటుంబాల్లో సాంస్కతిక జీవన వైవిధ్యాన్ని స్త్రీ పురుష సంబంధాలను ఆవిష్కరించిన అరుణ ”ఎల్లి”, ”నీలి” నవలలు, ఆర్థికంగా ఎదిగి తద్వారా సామా జికంగా సైతం upward mobility సాధించడానికి ఒక కుటుంబం చేసిన జీవన సమరాన్ని చిత్రించిన శిరంశెట్టి కాంతారావు ”వాళ్లు గెలవాలి” నవల, సెటిల్మెంట్‌ నుంచి చెర నుంచి నేరస్థ ముద్ర నుంచి బయటపడి గౌరవప్రదమైన జీవితం కోసం తపించే అభద్ర జీవుల బతుకు ఆరాటాన్ని అక్షరీకరించిన సలీం ”లోహముద్ర” ఇలా తెలుగులో పరిమితమైన ఎరుకుల సాహిత్యం వెలువడింది.
ఈ క్రమంలో ఎరుకల అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన కథలు ”ఏకలవ్య కాలనీ ఎరుకల జీవన గాథలు” ను చెప్పుకోవచ్చు. రచయిత తన కండ్ల ముందు నిరంతరం జరిగిన సంఘటనలను, సన్నివేశాలను ఎప్పటి కప్పుడు నిక్షిప్తం చేసుకుంటూ రాసిన కథలు ఇవి. నేటికీ ఒక స్థిరమైన నివాసం, ఉపాధి, సామాజిక భద్రత వంటి వాటి కోసం పాలకులతో పోరాటం చేస్తున్నవారు ఎరుకల వారు. వారి ఎస్టీ కాలనీ కాస్తా ఏకలవ్య కాలనీగా మారడంలో ఉన్న కష్టాలు అక్కడ శాశ్వత నివాసాలు ఏర్పరచడంలో వారు ఎదుర్కొన్న సమస్యలు ఈ కథల నిండా కనిపిస్తాయి. వీరు ప్రధానంగా ఊరూరు తిరుగుతూ గాడిదల మీద ఉప్పు అమ్మేవాళ్ళు, పచ్చబొట్లు పొడిచే వాళ్ళు, వెదురు దబ్బలతో బుట్టలు అల్లేవాళ్ళు, సోది చెప్పే వాళ్ళు, పందులు పెంచే వాళ్ళు రకరకాల జీవనోపాధులు చేసుకునే జీవితాలు ఈ కథల నిండా కనిపిస్తాయి.
తల్లిదండ్రులు బిడ్డలపై చూపించే అవ్యాజమైన ప్రేమకు ప్రతీకగా ‘ఎర్రమన్ను, ముగ్గు పిండి’ కథ నిలుస్తుంది. ఈ కథలో పిల్లలు తల్లిదండ్రులను తక్కువ చేసి చూడడం, తమ కులం బయట ప్రపంచానికి తెలిసిపోతుందేమోనని తల్లి దండ్రులను తమ ఇంటికి రావద్దని చెబుతారు. నిజానికి నేటి సమాజంలో కూడా ఇలాంటి వాళ్ళు నిరంతరం కనిపిస్తూనే ఉన్నారు. తమ కులం, మతం, ప్రాంతం చెప్పుకోవడానికి చిన్నతనంగా భావించేవాళ్ళు ఎక్కడకక్కడ ఉండనే ఉన్నారు. అలాంటి వారి మానసిక స్థితిని రచయిత కండ్లకు కట్టినట్లుగా చిత్రించారు. ‘మగపిల్లల్ని సాకే బదులు గమ్మున నాలుగు పందుల్ని పెంచి ఉంటే బాగుండేది’ ఈ ఒక్క వాక్యం కథ సారాన్నంతా లోకానికి తెలియజేస్తుంది.
ప్రకతితో మనిషి జీవన ప్రభావాన్ని చిత్రించడంలో బాలాజి కలం ప్రత్యేక మైంది. చిత్తూరు జిల్లాలో కౌండిన్య అభయారణ్యం ప్రాంతంలో ఏనుగుల దాడుల గురించి ఇప్పటికే, చాలా కథలు రాసిన పలమనేరు బాలాజి ఏనుగుల నేపథ్యంలోని ఒక ఎరుకల స్త్రీ రైతు పడే బాధ గురించి రాసిన కథ ప్రత్యేకమైనది. ‘ఏనుగుల రాజ్యంలో…’ కథలో కట్టెలమా కథ చివర్లో చెప్పే మాటలు ఎరుకల జీవితాల్లోని దైన్యాన్ని, ధైర్యాన్ని చెబు తాయి. ఊర్లో ఉండకూడదు అంటారు. పొలాల్లోకి దిగకూడదు అంటారు. చనిపోతే ఊర్లో పూడ్చ డానికీ కుదరదు అంటారు. అలాంట ప్పుడు ఎరుకల వాళ్లు ఎక్కడ బతకాలి, ఎక్కడ చావాలి? అని ఆమె ప్రశ్నిస్తుంది. ‘ఈ భూమ్మీద బతికేదానికీ మా కులం అడ్డమే. సస్తే భూమి లోపల మన్నులో మన్నుగా కలిపేదానికీ మా కులం అడ్డ మేనా? అలా బతక్కుండా ఇలా సావకుండా ఎరిక లోల్లం ఇంక ఏం కావల్లంటారు సామీ? ఏం చేయమంటారు దొరా?’ అని వారి దయనీయ స్థితి కథ ఎరుక పరుస్తుంది.
పెత్తందారి కులాల ఆర్థిక లైంగిక దౌర్జ న్యానికి ఎదురు నిలిచిన పాత్ర నీలమ్మ. ”వెదుర్లు” కథలో నీలమ్మ తన పొలానికి సాగునీరు అరువు తెచ్చుకొని నాయుడు ఊడిగం నుంచి తప్పించుకొని వడ్డీకి దుడ్లు తెచ్చి పొలంలో సేద్యం చేసుకుంటూ గౌరవంగా బతకాలనుకుంటుంది. తమ పొలంలో టమోటా పంట చేతికి అందే సమయంలో ఏనుగులు వచ్చి తోక్కేస్తాయి. ‘ఇదంతా మా ఖర్మ. ఆ దేవుడికే మా మీద దయలేదు. వడ్డీకి దుడ్లు తెచ్చి సేద్యంచేస్తాండా. బిడ్డల్ని సాగినట్లు సాకినాం. ఈ దినంతో మాకూ భూమి తల్లికీ రుణం తగ్గి పోయింది. కన్నగసాట్లు పడి పంట చేసినాం. మా కడుపులో బాధ ఎవరికని చెప్పుకునేది తల్లో. మా బాధలెప్పుడు తీరుతాయి తండ్రో..’ అంటూ నీలమ్మ శోకాలు పెడుతుంది. అక్కడ యుద్ధం జరిగినట్లు ఉంది. మత కళేబరాల్లా పడి ఉన్నాయి మొక్కలు. సైనికుల దండయాత్ర జరిగినట్టు పొలమంతా నానా బీభత్సంగా కనిపిస్తుంది. టమోటా మొక్కలు చితికిపోయి, నలిగిపోయి ఉన్నాయి. ఎకరా పొలంలో ఎక్కడా ఒక్క మొక్క బతకలేదు. ఒక్క టమోటా కూడా మిగల్లేదు. ఇదంతా గమనించిన నీలమ్మ చుట్టుపక్కల పొలాలన్నీ బాగానే ఉన్నాయి కానీ, ఒక్క తమ పొలం లోనే ఎందుకు ఇలా అయ్యింది అని ఆలోచిస్తుంది. ఇది ఏనుగుల దాడి కాదు దానికి కారణం నాయుడు అని ఇట్టే పసిగడు తుంది. నాయుడికి ఎదురుతిరిగి నీలమ్మ వ్యవసాయం చేసినందుకు పర్యవ సానంగా పంటనంతటినీ కోల్పోతుంది.
”కబాబ్‌ కపాలి” కథలో వంట మాస్టర్‌ కపాలి అస్తిత్వానికి, ఆత్మ గౌరవానికి ప్రతీకగా కనిపిస్తాడు. నేటి సమాజంలో కులం పేరు చెప్పుకోవడా నికి సిగ్గుపడే వారికి కపాలి ఒక ఆత్మగౌరవం కలిగిన వ్యక్తిగా కనిపి స్తాడు. తన కులం పేరు చెప్పుకోవడా నికి ఏమాత్రం సంకోచించకుండా తాను ఎరుకల వాడినని ధైర్యంగా ప్రకటి స్తాడు. కపాలి తాతది బాతులు వ్యాపారం. తండ్రిది పందుల వ్యాపారం. కబాలి ఆ రెండు వత్తులు చెయ్యకుండా వంట మాస్టర్‌గా మంచి గుర్తింపు పొందుతాడు. ఏ కార్యక్రమం జరిగినా కపాలి వంట ఉండవలసిందే అన్నంతగా పేరు సంపాదిస్తాడు. ‘నేనూ ఖాయంగా నిజమే చెప్తా. ఎరికిలోడనే చెప్తా. చెప్తే ఏమి పోతాది అన్నా’ అని ఆత్మగౌరవానికి ప్రతీకగా కపాలి ఈ కథలో కనిపిస్తాడు.
”గురి” కథలో మంజుల, మునిరాజు భార్య భర్తలు. వీరికి రెండు ఎకరాల పొలం ఉంది. తమ పొలం చుట్టూ బోర్లు ఎక్కువై గుండుబావిలో నీళ్లు అడుగంటి పోతాయి. చెరుకు తోట మొత్తం కండ్ల ముందరే ఎండిపోయింది. ఈ విధంగా జరగడంతో మునిరాజు ఎప్పుడూ అలవాటు లేని తాగుడుకు బానిసగా మారిపోతాడు. గుండుబావి ఎండిపోయాక సేద్యం కుంటుపడుతుంది. ఒకప్పుడు రెండు ఎకరాల పొలం లో బంగారం పండినచోట ఇప్పుడు పిచ్చి మొక్కలు పెరుగు తున్నాయి. బావిలో నీళ్లు అడిగింటి పోయేదాకా ఎరుకల మునిరాజు అంటే ఎస్టీ కాలనీలో పెద్ద మనిషి. ఇప్పుడు బావిలో నీళ్ళు లేకపోవడంతో చేతిలో పనిలేక సేద్యం లేక దిక్కుతోచని పరిస్థితికి చేరింది. జీవ నోపాధి కోల్పోయి దిక్కుతోచని స్థితి మునిరాజుది. కానీ మంజుల ధైర్యంగా కోళ్లను పెంచసాగింది.
ఇంకా ఈ వ్యాసంలో ప్రస్తావించని కథలెన్నో ఏకలవ్య కాలనీ కథా సంపుటిలో ఉన్నాయి. ఆసక్తిగా చదివించే ఈ పుస్తకం అన్ని ప్రధాన కేంద్రాల్లో లభ్యమవుతుంది. గిరిజన కులాలకు చెందిన వారి నుంచి వచ్చిన సాహిత్యం చాలా తక్కువ. అయితే ఎరుకల కులానికి చెందిన రచయిత నుండి వచ్చిన తొలి కథా సంపుటిగా ఏకలవ్య కాలనీ తెలుగు సాహిత్య చరిత్రలో ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంటుంది.
ఒక తరం మరొక తరాన్ని తయారు చేసుకునే క్రమం గురించి, పదిమంది కలిసి కాలనీని అభివద్ధి చేసుకునే క్రమం గురించి, వ్యక్తి సామాజిక కార్యకర్తగా మారే సందర్భం గురించి, ఇప్పటికీ ఎదుర్కొంటున్న వివక్షతల నుండి బయట పడే మానసిక యుద్ధాల గురించి, సాటి మనుషుల గురిం చిన మనుషుల బాధ్యతల గురించి, ఆత్మగౌరవ పోరాటం గురించి ఈ కథలు సున్నితంగా ఎన్నో విషయాలను చెబుతాయి. అసమానత, వివక్షతల పట్ల రచయిత వ్యక్తపరిచిన ధర్మగ్రహం, హెచ్చరికలు ఎరుకల తెగలో ఇంకా రావాల్సిన అస్తిత్వ చైతన్యం ఆవశ్యకతను చెబుతాయి.
ఇరగ రెడ్డిశేఖర్‌ 8142591227