దేవుడినే ఆడించే మనిషి కథ

The story of a man playing God‘ఇంత వరకు ఎవ్వరూ టచ్‌ చేయని పాయింట్‌తో రగ్డ్‌గా, ఇంటెన్స్‌ డ్రామాతో ‘జాతర’ తెరకెక్కింది. చిత్తూరు జిల్లా బ్యాక్‌డ్రాప్‌లో జరిగే జాతర నేపథ్యంలో సాగే సినిమా ఇది’ అని హీరో, దర్శకుడు సతీష్‌బాబు రాటకొండ చెప్పారు. ఆయన హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహించిన సినిమా ‘జాతర’. దీయా రాజ్‌ హీరోయిన్‌. గల్లా మంజునాథ్‌ సమర్పణలో మూవీటెక్‌ ఎల్‌ఎల్‌సితో కలిసి రాధాకష్ణ ప్రొడక్షన్‌ కంపెనీ పతాకంపై రాధాకష్ణారెడ్డి, శివశంకర్‌ రెడ్డి నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 8న థియేటర్స్‌లోకి రాబోతోంది. ఈ నేపథ్యంలో హీరో, దర్శకుడు సతీష్‌ బాబు రాటకొండ సోమవారం మీడియాతో మాట్లాడుతూ, ‘చిత్తూరు జిల్లా మదనపల్లె పరిసర గ్రామాల్లో ఓ అమ్మవారి గుడి ఉంది.. చుట్టుపక్కల 18 ఊళ్ల ప్రజలు ఈ గుడికి వచ్చి అమ్మవారిని కొలుస్తారు. ఆ అమ్మవారి గురించి తీసిన చిత్రమే ఇది. దేవుడు మనుషులను బొమ్మలుగా చేసి జగన్నాటకం ఆడిస్తాడని మన పురాణాల్లో చెబుతుంటారు. ఇందుకు భిన్నంగా ఒక మనిషి దేవుడిని పితలాటకం ఆడిస్తుంటాడు. ఆ పితలాటకం నుంచి అమ్మవారిని హీరో ఎలా రక్షిస్తాడు అనేది ఈ చిత్ర మూల కథాంశం. మనిషి రాక్షసుడై అమ్మవారిని చెరపడితే మరో నరుడు హరుడై ఆ రాక్షసుడిని ఎలా సంహరించాడు అనేది మా చిత్రంలో చూపిస్తున్నాం. వాస్తవ ఘటనలకు ఫిక్షన్‌ యాడ్‌ చేసి రూపొందించాను. హీరో క్యారెక్టర్‌ మూడు కోణాల్లో ఉంటుంది. అలాగే ఈ సినిమాలో ఓ మంచి ప్రేమ కథ కూడా ఉంది. మనం జంధ్యాల సినిమాల్లో విన్నట్లు విలేజ్‌లో వినిపించే సహజమైన సౌండ్స్‌ తరహాలో ఈ చిత్రంలో సౌండ్‌ డిజైనింగ్‌ చేయించాం. ప్రొడ్యూసర్స్‌ రాధాకష్ణారెడ్డి, శివశంకర్‌ రెడ్డి ఎక్కడా రాజీపడకుండా నిర్మించారు. యూఎస్‌, యూకేలో ఫిలింస్‌కు వర్క్‌ చేసే మూవీ టెక్‌ అనే కంపెనీ ప్రొడక్షన్‌లో ఎంతో సపోర్ట్‌ చేసింది’ అని చెప్పారు.