పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ కథ

The story of a powerful police officerబ్లాక్‌బస్టర్‌ ‘మగధీర’తో సహా పలు దక్షిణ భారత చిత్రాలలో విభిన్న పాత్రలు, ఆకర్షణీయమైన నటనతో ఆకట్టుకున్న దేవ్‌గిల్‌ హీరోగా ‘అహో! విక్రమార్క’ చిత్రంలో నటించారు. రాజమౌళి వద్ద కో డైరెక్టర్‌గా పని చేసిన పేట త్రికోటి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. దేవ్‌ గిల్‌ ప్రొడక్షన్స్‌ మీద నిర్మించిన ఈ చిత్రం ఈనెల 30న విడుదల కానుంది.
ఈ నేపథ్యంలో దర్శకుడు త్రికోటి మీడియాతో పలు విశేషాలను షేర్‌ చేసుకున్నారు.
– నేను మగధీరకు కో డైరెక్టర్‌గా పని చేశాను. ఆ టైంలోనే దేవ్‌గిల్‌తో పరిచయం ఏర్పడింది. హీరోగా ఓ సినిమా చేయాలని దేవ్‌గిల్‌ ఎప్పుడూ అంటూ ఉండేవారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ కోసం పని చేస్తున్న టైంలో దేవ్‌గిల్‌ ఈ సినిమా ప్రపోజల్‌ తీసుకొచ్చారు.
– దేవ్‌గిల్‌కు విలన్‌ ఇమేజ్‌ ఉంది. అలాంటి ఇమేజ్‌ ఉన్న వ్యక్తిని హీరోగా తెరపైకి తీసుకురావాలంటే ఎలాంటి జోనర్‌ చేయాలని చాలా అనుకున్నాం. చివరకు ఓ పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రతో కథను నడిపిస్తే బాగుంటుందని ఈ సినిమా చేశాం. విజయేంద్ర ప్రసాద్‌ వద్ద పని చేసిన వర్మ ఈ కథను అద్భుతంగా రాశారు. దేవ్‌గిల్‌ కొన్ని ఇన్‌పుట్స్‌ కూడా ఇచ్చారు. ఓ విలన్‌ హీరోగా మారితే ఎలా ఉంటుంది అనేది కథ. ఇందులో మదర్‌ సెంటిమెంట్‌ కూడా ఉంటుంది. యాక్షన్‌ ఎపిసోడ్స్‌ అద్భుతంగా వచ్చాయి. రియల్‌ సతీష్‌ ఫైట్స్‌ బాగా కంపోజ్‌ చేశారు. సంగీత దర్శకుడు రవి బస్రూర్‌ అదిరిపోయే ఆర్‌ఆర్‌ ఇచ్చారు.
– హీరోయిన్‌ చిత్రాశుక్లా లెక్చరర్‌ పాత్రలో కనిపిస్తారు. ఈమె పాత్ర సినిమాలో చాలా కీలకంగా ఉంటుంది. నేను చేసిన ‘దిక్కులు చూడకు రామయ్య’ బాగా ఆడింది. ‘జువ్వా’ అంతగా ఆకట్టుకోలేదు. ఇది నాకు మూడో సినిమా. దీంతో ఎలాంటి ఫలితం వస్తుందో చూడాలి.