తాతా మనవళ్ళ కథ

The story of grandfather and grandson‘మళ్ళీ రావా, ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ, మసూద’ వంటి హ్యాట్రిక్‌ హిట్ల తరువాత స్వధర్మ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ నుంచి ‘బ్రహ్మా ఆనందం’ అనే చిత్రం ఈనెల 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో బ్రహ్మానందం, ఆయన తనయుడు రాజా గౌతమ్‌ ప్రధాన పాత్రలు పోషించారు. ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సావిత్రి, ఉమేష్‌ కుమార్‌ సమర్పణలో రూపొందించిన ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు ఆర్‌విఎస్‌ నిఖిల్‌ తెరకెక్కించారు. రిలీజ్‌ నేపథ్యంలో నిర్మాత రాహుల్‌ యాదవ్‌ నక్కా శనివారం మీడియాతో పలు విశేషాలను షేర్‌ చేసుకున్నారు.
– తాత, మనవళ్ల కథ ఇది. ఇందులో తాత తాను చేసిన తప్పుల్ని రియలైజ్‌ అవుతాడు. మనవడు కూడా తన తప్పుల్ని తెలుసుకుంటాడు. ఇది ఓ అందమైన కథ. వినోదాత్మకంగానూ ఉంటుంది. అలాగే మంచి సందేశం ఉంది. మా తాతయ్య కూడా నన్ను సక్సెస్‌ఫుల్‌గా చూడాలని అనుకున్నారు. కానీ ‘మళ్లీ రావా’ టైంలోనే ఆయన స్వర్గస్తులయ్యారు. మా తాతయ్యకి నివాళిలా ఉంటుందని ఈ సినిమా చేశాను. దర్శకుడు అఖిల్‌ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు.
– ‘బ్రహ్మా ఆనందం’ అనే టైటిల్‌తోనే దర్శకుడు అప్రోచ్‌ అయ్యారు. బ్రహ్మానందం నటించకపోతే ఈ సినిమా తీయలేం. అదే విషయాన్ని ఆయనకు కూడా చెప్పాం. కథ విన్న తరువాత బ్రహ్మానందంకి కూడా చాలా నచ్చింది. ఇంత వరకు ఆయన్ని చూడనటువంటి పాత్రలో చూస్తారు.
– హీరో పాత్ర కోసం చాలా మందిని ట్రై చేశాం. వెన్నెల కిషోర్‌ పేరుని బ్రహ్మానందం రికమండ్‌ చేశారు. ఆయనకు కూడా స్క్రిప్ట్‌ పంపాం. ఆయన స్క్రిప్ట్‌ చదివి, హీరో బ్రహ్మా క్యారెక్టర్‌ కాకుండా ఫ్రెండ్‌ క్యారెక్టర్‌ గిరి అయితే తనకి బాగుంటుంది చెప్పి, చేశారు. ఆ తరువాత రాజా గౌతమ్‌ పేరు చర్చల్లోకి వచ్చింది. కానీ ఆయన చేస్తే బాగుంటుందా?అని నాలో అనుమానం కలిగింది. కానీ రాజాని కలిసిన తరువాత అభిప్రాయం మారింది.
– ఈ మూవీకి అందరూ బ్రహ్మానందం కోసం వస్తారు. కానీ ఇంటికి వెళ్లేటప్పుడు మాత్రం రాజా గౌతమ్‌ను తీసుకెళ్తారు. ఆయన పెర్ఫామెన్స్‌, యాక్టింగ్‌ గురించి మాట్లాడుకుంటారు. ప్రశంసలు కురిపిస్తారు. ఇది మాత్రం ఖాయం. తనతోనే మళ్లీ ‘వైబ్‌’ అనే ఓ సినిమాను చేస్తున్నాను. ఈ చిత్రాన్ని ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ దర్శకుడు తెరెకెక్కిస్తున్నారు.