చారల పిల్లి పుస్తకంలో వేంపలచ్లె షరీఫ్ రాసినవి కథలుగా బయటికి కనిపిస్తున్నా వాటిలో అంతర్లీనంగా ఒక వాస్తవికత, దానితో అనుసంధానించి ఒక అనుభవం, దాన్నుంచి సమాజానికి ఒక సందేశం, ఓ హెచ్చరిక, ఓ సూచన దాగి ఉన్నాయి. అవన్నీ అవగాహన చేసుకున్నప్పుడే ఆయన కథల తాలూకు పూర్తి ప్రయోజనం నెరవేరినట్టు. పుస్తకంలో అన్ని కథలూ బావున్నా ప్రధానంగా ”సైకిలు చక్రాలు’, ‘చారలపిల్లి’, ”పత్తి గింజలు” అనే మూడు కథల గురించి మాట్లాడుతాను. వీటి గురించే ఎందుకు ప్రస్తావించాలనుకుంటున్నాను అంటే ఈ మూడు కథలను ఒక అంతస్సూత్రం బంధిస్తూ కనిపిస్తుంది కాబట్టి. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో ఏదో ఒక కారణంగా యుద్ధవాతావరణం నెలకొని ఉంది. అది ప్రచ్చన్న యుద్ధం కావచ్చు, ప్రత్యక్ష యుద్ధం కావచ్చు. మనదేశంలో కూడా కంటికి కనిపించని యుద్ధం (రెండు మతాల మధ్య) జరుగుతోంది. దేశంలో హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఇలా ఎన్నో మతాల వారున్నా ముఖ్యంగా హిందూ – ముస్లిముల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొని ఉంది. కారణాలు ఏవైనా కానీ పరాకాష్టకు చేరుతున్న ఈ ఘర్షణ వాతావరణానికి పునాదులు ఎలా పడతాయి? అవి తిరగకూడని మలుపులు (ఉగ్రవాదం వంటి) ఎలా తిరుగుతున్నాయి? వాటికి అసలు పరిష్కారం సాధ్యమా? వంటి విషయాలు ఈ కథల్లో అంతస్సూత్రంగా కనిపిస్తాయి. నేరుగా మీదేసుకుని చెప్పకుండా రచయిత కథను చెబుతూ మనకు అనేక విషయాలు బోధపరుస్తాడు. ఇక్కడ ఇతను చూపిన నైపుణ్యం ఇప్పటి కథకుల్లో అరుదైందిగా భావించాలి. ‘పత్తిగింజలు’ కథలో (ఘర్షణ వాతావరణానికి పునాదులు), చారలపిల్లిలో(తిరగకూడని మలుపులు), ‘సైకిలు చక్రాలు లో ఈ సమస్యలకి పరిష్కారాలు కనిపిస్తాయి. మతోన్మాదం ఇప్పుడు దేశాన్ని పట్టిపీడిస్తోంది. అది ఏ మతానికి చెందినదైనా కావొచ్చు. దీని వల్ల ఎన్నో దారుణ మారణకాండలు జరుగుతున్నాయి. సమాజంలో వ్యక్తుల మధ్య వైషమ్యాలు లేకపోయినా, కొన్ని స్వార్ధశక్తులు తమ ప్రయోజనాలకోసం సాగించే క్రీడలో సమాజం బలి అవుతోంది. దిక్కుతోచని స్తితిలో ఆక్రోశిస్తోంది. కురుక్షేత్ర సంగ్రామ యుద్ధంలో కర్తవ్య విమూఢుడైన అర్జునుడిలా ఆక్రోసిస్తున్న సమాజానికి, ఈ మూడు కథలు షరీఫ్ చేసిన గీతోపదేశాలు. ఈ కథలను పూర్తిగా చెబితే పాఠకులకు అందే అనుభూతి తగ్గిపోతుంది. అందుకే కథల కన్నా వాటిల్లోని సారం మీదే మాట్లాడాను. సమాజానికి ఈ కథల అవసరం ఉంది. వీటిని అర్ధం చేసుకుని ముందుకు సాగితే, ఏ కుటిల శక్తులు మనుష్యుల మధ్య అంతరాలు సృష్టించలేవు. రచయిత నర్మగర్భంగా చెప్పిన ఈ అంశాలు ప్రజల మధ్యకు తీసుకు వెళ్లేందుకు విజ్ఞులు, మేధావులు కృషిచేస్తే బావుంటుంది. ఈ రచన విస్తృతంగా ప్రజలను చేరాలి.
– కె. లక్ష్మి,
78935 19128
ప్రజలకు చేరాల్సిన కథలు ‘చారల పిల్లి’
10:03 pm