విజయ్ సేతుపతి, వెట్రిమారన్ కలయికలో రూపొందిన ‘విడుదల -1’ చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్‌గా ఇదే కాంబినేషన్‌లో రూపొం దిన చిత్రం ‘విడుదల-2’. ఈనెల 20న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. నిర్మాత, శ్రీ వేదాక్షర మూవీస్ అధినేత చింతపల్లి రామారావు ఈ చిత్ర తెలుగు హక్కులను దక్కించుకున్నారు. ఈ చిత్రాన్ని తెలుగులో భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన బుధవారం చిత్ర విశేషాలను మీడియాతో పంచుకున్నారు.
పరిపాలకుల అహంకారానికి అణచివేయబడిన సామాన్యుల నుంచి ఉధ్భవించిన ఒక అసామాన్యుడి వీర విప్లవ గాథే ‘విడుదల-2’. ఈ కథ మన నేటివిటీకి సరిపోతుంది అని ఈ సినిమా తెలుగు హక్కులను దక్కించుకున్నాను. యదార్థ సంఘటనల ఆధారంగా తీసిన చిత్రమిది. అణగారిన వర్గాల నుంచి ఉద్భవించిన ఓ విప్లవ కెరటం అందరిని పెట్టుబడిదారీ వ్యవస్థ నుంచి ఎలా బయటపడేలా చేశారు అనేది ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లోని సమస్యలు, ఇక్కడ జరిగిన సంఘటనలు ఆధారంగా తీసిన చిత్రమిది. ఇది తమిళ దర్శకుడు తీసిన తెలుగు వారి కథ.
నటుడిగా విజరుసేతుపతి గురించి ఎంత చెప్పిన తక్కువే. ఈ చిత్రంలో పెరుమాళ్‌కు పాత్రకు ఆయన నూటికి నూరు శాతం సరిపోయాడు. నక్సెలైట్ పాత్రలో ఆయన నటన, పాత్రలోని ఎమోషన్ పండించిన విధానం అద్భుతం. ఈ చిత్రం ఆయనకు మరింత మంచి పేరు తీసుకొస్తుంది. ప్రజా సంక్షేమం కోసం కోరిన వ్యక్తి తమ వాళ్లను, కుటుంబాన్ని కూడా వదిలి ఎలాంటి త్యాగాలు చేశాడు? అనేది ఎంతో ఎమోషనల్‌గా ఉంటుంది.
ఈ చిత్రానికి ఇళయరాజా నేపథ్య సంగీతం ప్రాణంగా నిలుస్తుంది. పీటర్ హెయిన్స్ ఇప్పటి వరకు ఇండియన్ స్క్రీన్‌పై చూడని పోరాటాలు సమాకూర్చాడు. మంజు వారియర్ సహజ నటనఈ చిత్రానికి ప్లస్ అవుతుంది. విజరు, మంజు వారియర్ మధ్య ఎమోషన్స్ సీన్స్ అద్భుతంగా ఉంటాయి. ఆ సన్నివేశాలు అందర్ని కంటతడి పెట్టిస్తాయి. ‘శ్రీ శ్రీ రాజావారు’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. త్వరలోనే ‘డ్రీమ్‌గర్ల్’ అనే ప్రాజెక్ట్‌ను ప్రారంభించబోతున్నాం. ఇది కాక మరో రెండు సినిమాలు సెట్స్ మీదకు వెళ్లడానికి సిద్దంగా ఉన్నాయి.