– పేదలకు భూపంపిణీలో సీఎం విఫలం :మాజీ ఎంపీ, సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు
– డాక్టర్ మిడియం బాబురావు
నవతెలంగాణ-వాజేడు
ములుగు జిల్లా వాజేడు మండలం మండపాక గ్రామంలోని ప్రభుత్వ భూమిలో ఇండ్ల స్థలాల పోరాటాన్ని మాజీ ఎంపీ, సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు డాక్టర్ మిడియం బాబురావు, రాష్ట్ర కమిటీ సభ్యులు సూడి కృష్ణారెడ్డి, మచ్చ వెంకటేశ్వర్లు సోమవారం జెండా పాతి ప్రారంభించారు. అనంతరం వాజేడు మండల కార్యదర్శి కొప్పుల రఘుపతి అధ్యక్షతన జరిగిన సభలో బాబురావు మాట్లాడుతూ.. గడిచిన 70 ఏండ్లుగా వారి సమస్యలపై గిరిజనులు, గిరిజనేతరులు పోరాటాలు చేస్తున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారికి న్యాయం చేసిన పరిస్థితి లేదన్నారు. పెట్టుబడిదారులకు భూములు ఉచితంగా ఇస్తూ పేదలను విస్మరిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఎక్కడ ప్రభుత్వ భూమి ఉంటే అక్కడ పేదలకు ఇస్తామన్న సీఎం కేసీఆర్.. అమలులో విఫలమయ్యారని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా ఎర్రజెండా నాయకత్వంలో అనేక దఫాలుగా ఉద్యమాలు చేపట్టినా ప్రభుత్వం నిమ్మకు నిరేత్తినట్టుగా వ్యవహరిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేద ప్రజలు ఐక్యమై ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. వాజేడు మండలంలో అనేకమంది ప్రజలు ఇండ్లు లేని పరిస్థితిలో ఉన్నారన్నారు. ఇండ్ల సాధనకు రెండు దఫాలు ఉద్యమాలు నిర్వహించామని, జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రాలిచ్చినా ఫలితం లేదన్నారు. ఈ క్రమంలో మండపాక సెంటర్‌లోని ప్రభుత్వ భూమి సర్వేనెంబర్ 11లో 25 గ్రామాల నుంచి 600 మంది పేదలు గుడిసెలు వేసుకున్నారని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ప్రభుత్వ భూమిలో పేదలకు పట్టాలివ్వాలని, లేదంటే ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో భద్రాచలం నియోజకవర్గం కో కన్వీనర్ కారం పుల్లయ్య, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బీరెడ్డి సాంబశివ, గ్యానం వాసు, మండల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.