‘పోరాడితే పోయేదేమీ లేదు..బానిస సంకెళ్లు తప్ప’-కార్ల్‌మార్క్స్ చెప్పిన మాటల్ని స్ఫూర్తిగా తీసుకున్నారు ఈ కార్మికులు. తమిళనాడులోని కాంచీపురం జిల్లా శ్రీపెరంబదూర్ లోని బహుళజాతి సంస్థ అయిన శామ్‌సంగ్ కంపెనీలో 37 రోజుల పాటు జరిగిన చారిత్రాత్మక సమ్మెలో అద్భుత విజయం సాధించారు. వేతనాలు పెంచాలని, యూనియన్ ను గుర్తించాలని సెప్టెంబర్ తొమ్మిదవ తేదీన ప్రారంభమైన ఈ సమ్మెకు సీఐటీయూ నాయకత్వం వహించింది. సమ్మెను విచ్ఛిన్నం చేయటానికి, పోరాడుతున్న కార్మికులను లోబరుచుకోవటానికి, బెదిరించటానికి యాజమాన్యం విశ్వప్రయత్నాలు చేసింది. ప్రభుత్వం, పోలీసులు ప్రత్యక్షంగా యాజమాన్యానికి మద్దతు ప్రకటించారు. సమ్మెలో ఉన్న కార్మికులు చెక్కు చెదరని విశ్వాసంతో, సడలని పట్టుదలతో పోరాటాన్ని కొనసాగించటంతో ‘శామ్‌సంగ్ యాజమాన్యం, తమిళనాడు ప్రభుత్వం ఎట్టకేలకు దిగొచ్చాయి. కార్మికులతో చర్చలు జరిపి..అన్ని డిమాండ్లను సానుకూలంగా పరిష్కరిస్తామని, సమ్మెలో ఉన్న ఏ ఒక్క కార్మికుడిని తొలగించబోమని, కక్ష సాధింపులకు పూనుకోబోమని రాతపూర్వక సమాధానం అందించాయి. దీంతో కార్మికులు సమ్మెను విరమించి అక్టోబర్ 17వ తేదీ నుంచి విధులకు హాజరయ్యారు.
దక్షిణ కొరియాకు చెందిన శామ్‌సంగ్ కంపెనీకి భారతదేశంలో ఉన్న రెండు ప్లాంట్లలో ఒకటి తమిళనాడు కాంచీపురం జిల్లా శ్రీపెరంబదూరు సమీపంలోని శృంగేరి చత్రంలో వుండగా, రెండవది ఢిల్లీ సమీపంలోని నోయిడాలో వున్నది. శామ్‌సంగ్ ఆదాయం రూ.5 లక్షల కోట్లు. ప్రపంచమంతటా ఏడాదికి రూ.4 లక్షల కోట్ల ఆదాయం వస్తే భారతదేశం నుండి రూ.లక్ష కోట్లు వస్తుంది. 30 శాతం వస్తువులు భారతదేశంలోనే ఉత్పత్తవుతాయి. ఇక్కడి నుంచి 15 దేశాలకు ఎగుమతులు జరుగుతున్నాయి. ఇక్కడ అత్యంత అధునాతన ఏసీలు, ఫ్రిడ్జ్‌లు, టీవీలు ఉత్పత్తి అవుతాయి. 1700 మంది పర్మినెంట్, మూడు వేల మంది కాంట్రాక్టు కార్మికులు ఇందులో పనిచేస్తారు. మొత్తం 4700 మంది పదిహేడేండ్లుగా పనిచేస్తున్నారు. అయితే ఇక్కడ ఏ ట్రేడ్ యూనియన్ లేదు. అధిక పని గంటలు, పని భారం, జీతాల కోత, తక్కువ జీతం, కక్ష సాధింపులను కార్మికులు ఆత్మగౌరవం చంపుకుని ఇప్పటిదాకా భరించారు. తక్కువజీతం అది కూడా అసమానతలతో కూడిన వేతనాలు ఇస్తున్నారు. ఒకే సర్వీసు ఉన్నప్పటికీ యాజమాన్యం ఇష్టం వచ్చిన రీతిన జీతాలు చెల్లిస్తున్నది. విశ్రాంతి గదులు లేవు. బాత్‌రూమ్‌లు, టాయిలెట్లు అంత కన్నా లేవు.
ప్రపంచంలో వారానికి 35 పని గంటల పని విధానం ఉండగా భారతదేశంలో 48 గంటలు, దక్షిణ కొరియాలో 42 గంటలుగా ఉంది. కానీ ఈ కంపెనీలో 66 గంటలుగా ఉంది. వారాంతపు సెలవులు, పండుగలు, జాతీయ సెలవులు లేనే లేవు. ఇక్కడ రెండు షిప్టులు వుంటాయి. ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు, రాత్రి 8 నుండి ఉదయం 8 గంటల వరకు 12 గంటలుగా ఉంటుంది. హఠాత్తుగా డబుల్ డ్యూటీ వేస్తారు. ఏకబిగిన 24 గంటల పని చేయమంటారు. ఇది చాలా కష్టంగా ఉంటుందని కార్మికులు చెబుతున్నారు.
శ్రీపెరంబదూర్ చుట్టుపక్కల గ్రామాల నుండి కార్మికులు పనికి వస్తుంటారు. ఉదయం 8 గంటల షిప్టుకు రావాలంటే 5 గంటలకే నిద్ర లేవాలి. రాత్రి 8 గంటలకు దిగి తమ గ్రామాలు చేరాలంటే రాత్రి 10 దాటుతుంది. పడుకునేటప్పటికి 11 గంటలు దాటుతుంది. కేవలం 5 గంటలు మాత్రమే నిద్రపోవ డానికి ఉంటుంది.ఈ కారణంగా కార్మికులు తీవ్ర అనారోగ్యాలకు గురవుతున్నారు.ఒక వస్తువును బిగించడానికి ‘రోబో’కి 9.3 నిమిషాలు కేటాయిస్తారు. అదే కార్మికుడికి అయితే 9 నిమిషాలు మాత్రమే. రెప్పపాటున ఏ మాత్రం ఏమారినా మిషన్ ముందుకు వెళ్లిపోతుంది. అలా వెళ్లిపోయిందంటే నెగిటివ్ మార్కులు వేసి జీతాలలో కోత విధిస్తారు. కనురెప్ప వేయకుండా 12 గంటలు పనిచేయాలి. సిబ్బంది కొరత ఉంటుంది. సహాయకులుండరు. కాలకృత్యాలు కూడా బిగపట్టాల్సిందే. రోబోకంటే స్పీడుగా కార్మికులతో పని చేయించుకుంటున్నారు.
దక్షిణకొరియాలో శిక్షణ పూర్తి చేసుకుని పదహారేండ్ల సర్వీసు ఉన్న స్కిల్డ్ కార్మికుడి జీతం రూ.26 వేలు. కాగా దక్షిణ కొరియా సియోల్‌లో పనిచేస్తున్న శామ్‌సంగ్ ఉద్యోగి రూ. జీతం 3 లక్షలా 50 వేలు. యాజమాన్యం ఇష్టానుసారంగా జీతాలు నిర్ణయిస్తుంది. జర్మనీలో ఒక ఉద్యోగికి ఇచ్చే సంవత్సర జీతంతో ఇద్దరు అమెరికన్లకు, నలుగురు యూరోపియన్లకు.. అదే ఇండియన్లు అయితే 118 మందికి చెల్లిస్తారు. భారతీయ కార్మిక శక్తి అంత చౌక. అందుకే దోపిడీ చేయడానికి ఈ కార్పొరేట్ సంస్థ ఇక్కడకు వచ్చింది. గత పదిహేడేండ్లుగా ఈ కష్టాలు భరించలేని శామ్‌సంగ్ కార్మికులు తమ బతుకు భద్రత కోసం సీఐటీయూ నాయకత్వాన ‘శామ్‌సంగ్ ఇండియా వర్కర్స్ యూనియన్’ను ఏర్పాటు చేసుకున్నారు. అయితే కార్మిక సంఘం పెట్టుకోవడానికి యాజమాన్యం ఒప్పుకోలేదు. పైగా సీఐటీయూ అసలు అవసరం లేదని కార్మికులను గదులలో నిర్బంధించి బెదిరించింది. యూనియన్ రిజిస్టర్ కాకుండా అనేక ఆటంకాలు కల్పించింది. పేరులో శామ్‌సంగ్ ఉన్నందున యూనియన్ ఏర్పాటు చెల్లదన్నారు. తమకు పేటెంట్ హక్కు ఉందని, కార్మిక చట్టాలు వర్తించవని అభ్యంతరం చెప్పారు. వస్తువులపై పేటెంట్ గానీ చట్టాలపై వర్తించదని సీఐటీయూ వాదించింది. సంఘానికి సీఐటీయూ కార్యాలయ చిరునామా ఉందని, అది రాజకీయ కార్యాలయంగా ఉందని, తమ సంస్థలో రాజకీయ పార్టీలకు ప్రవేశం లేదని చెప్పారు.
యూనియన్‌లో ఫ్యాక్టరీ కార్మికులే ఉండాలి, బయటి వారు ఉండకూడదన్నారు. బయటి వ్యక్తులకు గాని, నాయకులకు గాని, సంఘా లకు గాని అనుమతి లేదని ఆక్షేపించారు. భారత కార్మిక చట్టాలు-1926, సెక్షన్ 22 ప్రకారం 1/3 వంతు మంది (ఐదుగురు) బయటి వారు ఉండవచ్చు. 1929లో ఏర్పడిన ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ఐ.ఎల్.ఓ) ప్రకారం కూడా ఉండవచ్చు. అయితే శామ్‌సంగ్ యాజమాన్యం భారత కార్మిక చట్టాలను, అంతర్జాతీయ చట్టాలను అతిక్రమించింది. దీన్ని ప్రశ్నించాల్సిన లేబర్ అధికారులు కంపెనీకి ఊడిగం చేస్తూ 45 రోజులు దాటినా కాలయాపన చేశారు. కాంచీపురం జిల్లా కలెక్టర్ అతి నిరంకుశంగా వ్యవహరించారు.
సంబంధం లేని పోలీ సులు శామ్‌సంగ్‌కు దాసోహమై కార్మికులపట్ల అమానుషంగా వ్యవహరించారు. రిజిస్ట్రేషన్ చేయాలని సంఘం కోర్టును ఆశ్రయించింది. కోర్టు కూడా రెండు వారాలు శామ్‌సంగ్ యాజమాన్యానికి వ్యవధి ఇచ్చింది. ప్రభుత్వంపై కార్మిక సంఘం కేసు వేస్తే ప్రభుత్వ న్యాయవాది శామ్‌సంగ్ యాజమాన్యాన్ని థర్డ్ పార్టీగా అడ్డుకోమని కోరడం హాస్యాస్పదం.గత్యంతరం లేని పరిస్థితులలో గత నెల తొమ్మిదవ తేదీ నుండి కార్మికులు సమ్మెకు పూనుకున్నారు. 1700 మంది కార్మికులలో 1550 మంది సమ్మెలో ఉన్నారు. యాజమాన్యం యూనియన్‌లో చీలికలు తెచ్చేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేయగా ఫలించలేదు. తమకు తొత్తులుగా ఉండే ఒక గ్రూపుతో యూనియన్ పెట్టించింది. ప్లాంట్‌కు సమీపంలో శిబిరం వేసుకుని శాంతియుతంగా సీఐటీయూ పోరాడుతుంటే, తొత్తు యూనియన్ సమ్మె విచ్ఛిన్నానికి డ్యూటీలు చేసింది.
ఈ న్యాయమైన పోరాటానికి డి.ఎం.కె మినహా కూటమిలోని అన్ని పక్షాలూ బలపరిచాయి. అన్ని కార్మిక సంఘాలూ మద్దతు తెలిపాయి. రాష్ట్రంతో పాటు దేశమంతటా నిరసన కార్యక్రమాలు జరిగాయి. జిల్లా కలెక్టర్, ప్రభుత్వం, కార్మిక శాఖ సమస్య పరిష్కారానికి పూను కోకుండా శామ్‌సంగ్ యాజమాన్యం మెప్పుకోసం సమ్మెలో ఉన్న 640 మంది కార్మికులను అరెస్టు చేశాయి. తమిళనాడు సీఐటీయూ అధ్యక్షులు ఎ.సౌందర్యరాజన్, శామ్‌సంగ్ ఇండియా వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు ఇ.ముత్తుకుమార్‌లను అరెస్టు చేసి నిర్బంధించారు. అర్ధరాత్రి నాయకుల ఇళ్ల దగ్గరకు వెళ్లి వారి కుటుంబాలను, స్త్రీలను, పిల్లలను, వృద్ధులనూ కూడా భయభ్రాంతులకు గురిచేసి దౌర్జన్యంగా నాయకులను పోలీసులు తీసుకెళ్లారు. సమ్మె చేస్తున్న కార్మికుల పోరాట శిబిరాన్ని కూల్చివేశారు. అది ప్రభుత్వ భూమి..అందుకే ధ్వంసం చేశామన్నారు. వాస్తవానికి ఆ స్థలం ఒక ప్రయివేటు యజమానిది. తను ఇష్టపూర్వకంగా ఇచ్చానని, నా స్థలంలో ఉన్న శిబిరాన్ని కూల్చడం చట్ట విరుద్ధమని, రౌడీల కంటే ఘోరంగా పోలీసులు చేయడం దుర్మార్గమని చివాట్లు పెట్టారు. సోదర సంఘాలు నిధి సహాయం చేశాయి. కోర్టు కూడా శాంతియుతంగా కార్మికులు పోరాటం చేయవచ్చన్నది. దాంతో ప్రభుత్వం కొత్త అవతారమెత్తింది. ముగ్గురు మంత్రులతో కమిటీ వేసింది. వీరు సమ్మె చేస్తున్న కార్మికులతో కానీ, వారి నాయకులైన సీఐటీయూ వారితో కానీ మాట్లాడలేదు. మేనేజ్ మెంట్ ఏర్పాటు చేసుకున్న తొత్తు యూనియన్ నేతలతో మంత నాలు జరిపారు. అంతటితో ఆగకుండా -అగ్రిమెంట్ (18/1) చేసుకున్నారు. మంచి ఒప్పందం జరిగిందని, సిఐటియు యూని యన్ రిజిస్ట్రేషన్ కోర్టులో ఉందని, డిమాండ్లన్నిటినీ యాజ మాన్యం ఉదారంగా ఒప్పేసుకున్నదని-ప్రకటించారు. ఇది బ్రహ్మాండమైన విజయమని కార్మికులు సంతోషంగా ఉరుకులు వేసుకుంటూ పనిలో చేరిపోయారని అబద్ధపు పత్రికా ప్రకటన చేశారు.
నిజానికి ఏ ఒక్క కార్మికుడూ సమ్మె విరమించలేదు. పోరాట శిబిరాన్ని వీడలేదు. తామే కాకుండా పిల్లలతో సహా తమ కుటుంబ సభ్యులను పోరాటంలోకి దింపారు. వీరికి మద్దతుగా ఇరుగు పొరుగు వారు, స్నేహితులు, వారి కుటుంబాలు పాల్గొన్నాయి. కార్మికుల కుటుంబ సభ్యులు కాంచీపురం బజారులో నిరసన తెలపడానికి పూనుకున్నారు. అక్కడ పోలీసులు అనుమతి లేదన్నారు. అడ్డగించారు. అందరూ ప్లాంట్ సమీపంలోని పోరాట శిబిరం వద్ద పాల్గొన్నారు.భారత రాజ్యాంగాన్ని, సార్వభౌమాధికారాన్ని కాపాడతామని ప్రమాణం చేసిన మంత్రులు..ముద్దాయి శామ్‌సంగ్ పక్షాన నిలవడం ద్రోహం చేయటమే. ప్రభుత్వ పెద్దలు, బీజేపీ, శామ్‌సంగ్ యాజమాన్యం అదే పనిగా దాడి చేస్తున్నా కార్మికులు ఏ మాత్రం సంకోచించకుండా, వీరోచితంగా పోరాడారు. శామ్‌సంగ్ కార్మికుల పోరాటానికి తమిళనాడు రాష్ట్ర ప్రజల నుంచేగాక, దేశ వ్యాప్తంగా మద్దతు లభించింది. దాంతో శామ్‌సంగ్ కంపెనీ ఎట్టకేలకు దిగొచ్చి కార్మికులు సంఘం పెట్టుకోవడానికి అంగీకరించి, వారి డిమాండ్లపై చర్చించేందుకు సిద్ధమైంది. విజయం సాధించిన కార్మిక వర్గానికి జేజేలు.
జి.బాలసుబ్రహ్మణ్యం
9490300758