పేదలకు భూములు పంచేంతవరకు పోరాటం ఆగదు..

The struggle will not stop until the land is distributed to the poor.– జైలునుంచి జగిత్యాల భూపోరాట నాయకులు విడుదల : సీపీఐ(ఎం) ఘన స్వాగతం
నవతెలంగాణ – కరీంనగర్‌
జగిత్యాల జిల్లాలో వందలాది ఎకరాల్లో సుమారుగా 15 వేల మంది పేదలను సమీకరించి, భూ పోరాటం చేసిన తొమ్మిది మంది నాయకులు కరీంనగర్‌ జిల్లా జైలులో 20రోజులుండి ఆదివారం బెయిల్‌పై విడుదలయ్యారు. 20రోజులుగా జైల్లో ఉండి, పేదల కోసం పోరాటం చేసి విడుదలైన రమేష్‌, సులోచన, హేమలత, పోచయ్య, శంకర్‌, నాగరాజు, తదితరులకు సీపీఐ(ఎం) రాష్ట్ర, కరీంనగర్‌ జిల్లా నాయకులు పూలమాలలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు పైళ్ల ఆశయ్య, కరీంనగర్‌ జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి మాట్లాడారు. పేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని పోరాటం చేసిన నాయకులు, పేదలపై అక్రమంగా కేసులు పెట్టి 20 రోజులుగా జైల్లో నిర్బంధించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ కేసులు, బెదిరింపులు ఉద్యమాలను ఆపలేవని.. పేదలకు ఇండ్లు, ఇండ్ల స్థలాలు దక్కేంతవరకు సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో అన్ని ప్రజా సంఘాలను కలుపుకొని ఐక్యంగా ఉద్యమిస్తామని స్పష్టంచేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అర్హులైన పేదలందరికీ ఇండ్ల స్థలాలు, ఇంటి నిర్మాణానికి రూ.5లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ స్థలాలను కబ్జా చేస్తున్న రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులను వదిలేసి, పేదలకు ఇంటి జాగాలు ఇవ్వాలని పోరాటం చేస్తున్న వారిని ప్రభుత్వం నిర్బంధించడం హేయమైన చర్య అని అన్నారు.
సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కూరపాటి రమేష్‌ మాట్లాడుతూ.. అసంఘటిత రంగ కార్మికులకు, పేదలకు సీఐటీయూ అండగా ఉంటుందని, రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలైన ఇంటి స్థలాలు, ఇంటి నిర్మాణానికి 5లక్షల ఆర్థిక సహకారం అందించాలని కోరారు. కొంతమంది స్థానిక ప్రజాప్రతినిధులు కక్షపూరితంగా ప్రజా ఉద్యమాలను అణిచివేయాలని, ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాలనే కుట్రతో పేదలపై అక్రమంగా కేసులు పెడుతున్నారని, రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పేదలపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. లేకపోతే అన్ని ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలను కలుపుకొని ఐక్య కార్యాచరణ రూపొందించి పేదలకు ఇండ్ల స్థలాలు దక్కేంత వరకు పోరాడుతామని అన్నారు. పేదలు, భూపోరాట నాయకుల తరపున కేసు వాదించి, బెయిల్‌ ఇప్పించిన వకీల్‌ బీమా సాహెబ్‌కి ప్రజాసంఘాల తరపున అభినందనలు తెలియజేసి, పూలమాలలు వేసి శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) కరీంనగర్‌ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు గీట్ల ముకుందరెడ్డి, వర్ణ వెంకటరెడ్డి, గుడికందుల సత్యం, జిల్లా కమిటీ సభ్యులు శ్రీనివాస్‌, ఎడ్ల రమేష్‌, నరేష్‌ పటేల్‌, నాయకులు పుల్లెల మల్లయ్య, జి.తిరుపతి, తిప్పారపు సురేష్‌, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.