కేంద్రం విధానాలపై విద్యార్థి లోకం ఉద్యమించాలి

– వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు :దేశవ్యాప్త సమ్మెకు మద్దతు
– 16న రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు, నిరసన ప్రదర్శనలకు పిలుపు
నవతెలంగాణ-ముషీరాబాద్‌
మోడీ ప్రభుత్వ విద్యార్థి వ్యతిరేక విధానాలపై విద్యార్థి లోకం ఉద్యమించాలని వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. 16న దేశవ్యాప్త గ్రామీణ బంద్‌, సమ్మెకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌ విద్యానగర్‌లోని పీడీఎస్‌యూ రాష్ట్ర కార్యాలయంలో వామపక్ష విద్యార్థి సంఘాల నాయకుల సమావేశం జరిగింది. పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు పి.మహేష్‌ మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పది సంవత్సరాలుగా విద్యార్థి వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్య కాషాయీకరణ, ప్రయివేటీకరణ, కార్పొరేటీకరణ చేస్తూ విద్యారంగాన్ని నిర్వీర్యం చేసే విధంగా నూతన జాతీయ విద్యావిధానాన్ని తీసుకొచ్చిందని తెలిపారు. విద్యారంగానికి బడ్జెట్‌లో నిధులు ఇవ్వకుండా, స్కాలర్‌షిప్‌ ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ.. విద్యా వ్యాపారీకరణ, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీలకు సామాజిక న్యాయం దూరం చేసే విధంగా నూతన జాతీయ విద్యావిధానం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. భిన్నత్వంలో ఏకత్వానికి బదులు హిందూత్వ రాజ్యాన్ని స్థాపించడానికి బాటలు వేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానాన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్‌ చేశారు. ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుట్ట లక్ష్మణ్‌ మాట్లాడుతూ.. 16వ తేదీన సమ్మెలో విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పీడీఎస్‌యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అజాద్‌, పీడీఎస్‌యూవీ రాష్ట్ర కార్యదర్శి విజరు, ఏఐడీఎస్‌ఓ రాష్ట్ర కార్యదర్శి మల్లేష్‌, ఏఐఎస్‌బీ నాయకులు హకీమ్‌ నవీద్‌, వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు కంచనపల్లి శ్రీనివాస్‌, అశోక్‌ రెడ్డి, ప్రవీణ్‌, గౌతమ్‌, దిలీప్‌ తదితరులు పాల్గొన్నారు.