నవతెలంగాణ – అశ్వారావుపేట
ఓ హాస్టల్ విద్యార్థిని ఉదయం ఉదయం అదృశ్యం అయింది.అప్రమత్తం అయిన హాస్టల్ సిబ్బంది చాకచక్యంగా వెతకగా తన తాతయ్య ఇంట్లోనే లభ్యం కాగా తీసుకువచ్చి పోలీస్ ల సమక్షంలో తల్లిదండ్రులకు అప్పగించారు. దీంతో ఇటు సిబ్బంది,అటు తల్లిదండ్రులు ఊపిరి పీల్చు కున్నారు. గిరిజన సంక్షేమ శాఖ బాలికల ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయుడు మాధవ రెడ్డి తెలిపిన వివరాలు ప్రకారం అశ్వారావుపేట ఫోర్త్ క్లాస్ ఎంప్లాయిస్ కాలనీలో గల బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో నారంవారిగూడెం గ్రామానికి చెందిన మేడి పూజిత ఆరో తరగతి చదువుతుంది.బుధవారం ఉదయం 9 గంటల సమయంలో స్కూల్ బ్యాగ్ లోని జామెట్రీ బాక్స్ లో తాను తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్లి పోతున్నానని ఎవరు వెతికి వద్దని లెటర్ రాసి పెట్టింది.అనంతరం హాస్టల్ గోడ దూకి పారిపోయింది.హాజరు నమోదు సమయంలో టీచర్స్ ఆరో తరగతి చదువుతున్న పూజిత గైర్హాజర్ అయినట్లుగా గుర్తించి వార్డెన్ సునీత కు సమాచారం ఇచ్చారు.హాస్టల్ సిబ్బంది తో వార్డెన్ వెతికించినా ఫలితం లేకపోయింది.స్కూల్ బ్యాగ్ వెతికిన విద్యార్థులకు జామెట్రీ బాక్స్ లో లెటర్ కనిపించడంతో ఉపాధ్యాయులకు అందజేశారు.లెటర్ ఆధారంగా ఏపీలోని చింతలపుడి మండలం ఎర్రగుంటపల్లి లో తన తాతయ్య వాళ్ల ఇంటికి విద్యార్ధిని క్షేమంగా చేరుకున్న విషయం తెలుసుకుని హాస్టల్ సిబ్బంది అక్కడకు చేరుకుని పాప ను తీసుకువచ్చి పోలీస్ స్టేషన్లో అప్పగించారు. అనంతరం విద్యార్థిని తల్లిదండ్రులను హాస్టల్ కు పిలిపించి పోలీస్ స్టేషన్ నుండి విద్యార్థిని తీసుకువచ్చి అప్పగించారు.దీంతో అదృశ్యం వైనం సుఖాంతం అయింది.