తీయతీయని బాలగీతాల చెఱకుతోట

The sugarcane field of unedited children's songsగేయాన్ని అత్యంత తీయగా రాస్తున్న ఆధునికుల్లో ‘సనారె’ గా ప్రసిద్ధి చెందిన గేయకవి చెఱకు సత్యనారాయణ రెడ్డి ఒకరు. వీరు నేటి పెద్దపల్లి జిల్లా కొత్తపల్లిలో ఏప్రిల్‌ 3, 1949న పుట్టారు. తల్లిదండ్రులు శ్రీమతి కౌసల్యాదేవి, శ్రీ ఇంద్రసేనారెడ్డి. చెఱకు కొత్తపల్లి, మంథని, కాల్వ శ్రీరాంపూర్‌, సిరిసిల్ల, జమ్మికుంట మొదలైన ప్రాంతాల్లో విద్యాభ్యాసం చేసిన సనారె కాగజ్‌నగర్‌లోని సిర్పూర్‌ పేపర్‌ మిల్స్‌లో ఉద్యోగం చేసి పదవీ విరమణ తరువాత హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు.
పాఠశాల స్థాయి నుండే పాటలు పాడడం, రాయడంలో ప్రతిభ కనబరిచిన సనారె బడిలో ప్రతియేడు పాటల పోటీల్లో ప్రథమ బహుమతి సంపాదించి ‘ఘంటసాల’గా ప్రశంసించబడ్డారు. సిరిసిల్ల విద్యార్థిగా మొదలైన సాహిత్య జిజ్ఞాస మంచిర్యాలలో వానమామలై వరదాచార్యుల దర్శనంతో సాహిత్యంపట్ల పూర్తి స్థాయిలో మమైకమయ్యేట్లు చేసింది. కాగజ్‌నగర్‌ తెలుగు, బెంగాలీ, హిందీతో బాటు ఇతర భారతీయ భాషల్లో సాహిత్య కార్యక్రమాలకు పెట్టింది పేరు. గంధర్వ నికేతన్‌, తెలుగు సాహితీ సమితి సంస్థల బాధ్యుల్లో ఒకరుగా ఉన్న సనారె, నిరంతరం అక్కడి కార్యక్రమాలతో తలమునకలై ఉండేవారు. కార్యక్రమాల కోసం గేయాలు రాయడం, స్వయంగా పాడడం చేసేవారు. ఏ పండుగైనా, పబ్బమైనా లలితకళాసమాఖ్య వేదికలో విధిగా సాంస్కృతిక కార్యక్రమం ఉండేది.
సనారె కు తొలినాళ్ళ నుండి గేయ రచనలో డా. సినారె గారు స్ఫూర్తి. వీరి తొలి గేయ సంపుటి ‘చెఱకు తోట’, డా||సామల సదాశివ ఆశీస్సులతో ఆవిష్కృతమైంది. ‘తలపుల వీణ’ రెండవ గేయ సంపుటి, మూడవది ‘భావ భాస్వరం’. పదవీ విరమణ తరువాత ‘సనారె గేయాలు’ పేరుతో కొత్త సంపుటి తెచ్చారు. ఇంటి పేరు లాగే సనారె పాటలన్నీ చెఱకు గడలంత తీయగా, కమ్మగా ఉంటాయి. మాత్రాఛందస్సులో ప్రయోగాలతో పాటు, అలతి అలతి పదాలను ఉపయోగించి రాయడం సనారెకు తెలిసిన గేయ రసవిద్య. ఆ గేయరచనా విద్యయే బాలల కోసం రాసేలా చేసింది. దాదాపు నాలుగు దశాబ్ధాలుగా పూస్తున్న ఈ పాటల పూదోట ఇప్పటికీ నిత్య నూతనమై గేయపరిమళాలు వెదజల్లడం విశేషం. గేయ కవిగా, గాయకునిగా అనేక సత్కారాలు, పురస్కారాలు అందుకున్న వీరికి విశేషంగా గౌరవాన్ని తెచ్చిన పురస్కారాల్లో ‘డా|| సామల సదాశివ పురస్కారం’, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి డా|| తిరుమల శ్రీనివాసాచార్య- స్వరాజ్యలక్ష్మి కీర్తి పురస్కారం’ ఉన్నాయి.
‘తెలుగు మాతృభాషయైన/ వారి జన్మ ధన్యము/ కవులో రచయితలోయేతే/ వారిదెపో పున్నెము’ అనిన నమ్మే సనారె వందలాది బాల గేయాలు రాశారు. వాటిలో ఆయన నచ్చి మొచ్చిన వాటిని ‘చెఱకుగడలు’ పేరుతో బాల గేయ సంపుటిగా తెచ్చారు. తెలంగాణ సాంస్కృతిక నేపథ్యం మొదలుకుని బాలలకు నచ్చే పెంపుడుజంతువు బుజ్జి కుక్కపిల్ల వరకు వీరి గేయాల్లో అందంగా ఒదిగి పోయాయి. బతుకమ్మ పండుగను పిల్లలకు పరిచయం చేస్తూ ‘వచ్చింది వచ్చింది/ చల్లనీ బతుకమ్మ/ వనమంత మన చిన్ని/ వాకిట్లో మెఱువంగ’ అనడం ఆయన అవగాహననే కాదు, చక్కని, చిక్కని ఊహకు నిదర్శనం. ఈ ఊహ ఆ గేయం చదివిన ప్రతి చిన్నారిని ఆలోచింపజేస్తుంది. పల్లెలో పుట్టి, టౌన్‌లలో, చదివి మినీ ఇండియాగా పిలిచే కాగజ్‌ నగర్‌లో పని చేసినా సనారె తన పల్లె యాసను, తెలంగాణ భాషను మరవలేదు. అయన గేయాల్లో అది అక్షరమక్షరాన కనిపిస్తుంది. ‘మా చెల్లె అందం/ అది మల్లె గంధం/ మా చెల్లె నవ్వు/ అది బుల్లి పువ్వు’ అంటూ వర్ణిస్తాడు. ఇంకా ‘సంక్రాంతి వచ్చింది/ సంబరం తెచ్చింది’ అంటూనే ‘…శిర్రగోను ఆట/ తెగ ఆడుకోవచ్చు’ అంటారొకచోట. మరోచోట, ‘మా అమ్మ చకినాలు/ కమ్మగుంటాయి/ నోట్లె పెట్టకముందె/ నీళ్ళూరుతుంటాయి’ అంటారు. గుడిని, బడిని చక్కని గేయ చిత్రంగా మలిచిన కవి ‘గుడిలో దేవుడు ఉంటాడు/ బడిలో పంతులు ఉంటాడు/ గుడికెళితే శుభమవుతుంది/ బడికెళితే చదువొస్తుది’ అని రాస్తూ, గుడికి, బడికి రోజూ వెళ్ళాలంటారు. పిల్లలకు ఇంట్లో తల్లిదండ్రులలాగే, బడి వయసులో చదువు చెప్పే టీచర్‌ రోల్‌ మోడల్‌. దానిని గేయగీతగా రాసిన సనారె, ‘మా సారు కన్నెక్కువ/ చదువలేదు ఎవరు/ మా సారుకు తెలియని/ విషయమేది లేదు/ సాంఘికాన్ని చెబుతాడు/ సైన్సును బోధిస్తాడు/ ఇంగ్లీషును చెబుతాడు/ హిందీ నేర్పిస్తాడు/ … అర్థం అయ్యేట్టుగ/ అన్నీ నేర్పిస్తాడు’ మా తరం సర్కారు బడిలో చదువుకున్న సమయంలోని సారు విశ్వరూపాన్ని అందగా చెప్పారు. ‘ఊరిలోన చెఱువు/ ఉంటె ఎంత అందం/ పల్లె బ్రతుకులోన/ పండును ఆనందం’ అని చెఱువు గురించి రాసినా, ‘ఎర్రబస్సు ఎర్రబస్సు ఎంత మంచిది/ చేయి వూపితేనె చాలు ఆగిపోతది/ ఎంతమందినైనా ఎక్కించు కుంటది/ ఏర్లు దాటి వూర్లు దాటి ఎల్లిపోతది’ అని సామాన్యుల విమానాన్ని వర్ణించిన ఆది ఆయనకె చెల్లింది. బాలబాలికలకు అనందాన్ని, అర్ధాన్ని, మార్గదర్శనాన్ని ఇచ్చేందుకు గేయాన్ని ఎలా తీర్చిదిద్దాలో ‘సనారె’ రచనలు మనకు తెలుపుతాయి. జయహో!
– డా|| పత్తిపాక మోహన్‌
9966229548