ఆశాలను వేధింపులకు గురి చేసిన సూపర్‌వైజర్‌ను సస్పెండ్‌ చేయాలి

Adilabad– సీఐటీయూ జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్‌ కుమార్‌
నవతెలంగాణ-నస్పూర్‌
ఆశాలను వేధింపులకు గురిచేసిన సూపర్‌వైజర్‌ మధును సస్పెండ్‌ చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్‌ కుమార్‌ డిమాండ్‌ చేశారు. శుక్రవారం ఆశా వర్కర్స్‌ యూనియన్‌(సీఐటీయూ) ఆధ్వర్యంలో ఆశా వర్కర్లను వేధింపులకు గురి చేసి, అసభ్యపదజాలంతో తిట్టిన షంషిర్‌ నగర్‌ యూపీహెచ్‌పీ సూపర్‌వైజర్‌ మధును విధుల నుంచి తొలగించాలని కలెక్టరేట్‌ ఎదుట ఆశాలు ఆందోళన చేపట్టారు. ధర్నా వద్దకు వచ్చిన డీఎంహెచ్‌ఓ హరీష్‌ రాజ్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా దుంపల రంజిత్‌ కుమార్‌ మాట్లాడుతూ ఆశా వర్కర్లను వేధింపులకు గురి చేస్తు, అసభ్యపదజాలంతో తిట్టిన సూపర్‌ వైజర్‌ను వెంటనే విధుల్లో నుంచి తొలగించాలని, అంతేకాకుండా జిల్లాలో ఆశాల పట్ల అధికారుల వేధింపుల ఆపాలని, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమ్మక్కకు అధికారులు మెరుగైన వైద్యం అందించాలని, లేనిపక్షంలో పోరాటం ఉదృతం చేస్తామని హెచ్చరించారు. దండేపల్లి మండలం నర్సపూర్‌ గ్రామంలో రెండు నెలల క్రితం చనిపోయిన ఆశా వర్కర్‌ తీగల శ్యామల కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, శ్యామల కూతురును ఆశా వర్కర్‌ గా నియమించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఆశా యూనియన్‌ జిల్లా కార్యదర్శి(సీఐటీయూ) ఎస్‌ శోభ, ఆశాలు రాణి, నీరజ, కవిత, సునీత, సుజాత, నాగుబారు, విజయలక్ష్మి పాల్గొన్నారు.