ఉత్తరాఖండ్‌ దావానలంపై 8న సుప్రీం అత్యవసర విచారణ

న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌ దావానలంపై దాఖలైన పిటిషన్లను 8వ తేదీన అత్యవసరంగా విచారించేందుకు సుప్రీంకోర్టు సోమవారం అంగీకరించింది. ఈ దావానలం సంఘటనల్లో 90శాతం ఉద్దేశ్యపూర్వకంగా చోటు చేసుకున్నవేనని పిటిషనర్లు పేర్కొంటున్నారు. ఉత్తరాఖండ్‌లో దావానలం సంఘటనలపై విచారణలు సుప్రీం కోర్టులో ఏళ్ళతరబడి పెండింగ్‌లో వుంటున్నాయని పిటిషన్లు పేర్కొన్నాయి. అమికస్‌ క్యూరీ, న్యాయవాది కె.పరమేశ్వర్‌కు విషయం తెలియ చేయాల్సిందిగా సీనియర్‌ న్యాయవాది రాజీవ్‌ దత్తాతో సహా పిటిషనర్లను జస్టిస్‌ గవారు నేతృత్వంలోని బెంచ్‌ ఆదేశించింది. విచారణ సమయంలో ఆయన స్వయంగా హాజరవుతారని ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం తరపున డిప్యూటీ అడ్వకేట్‌ జనరల్‌ తెలియచేశారు. తదుపరి విచారణ సమయానికల్లా స్టేటస్‌ రిపోర్ట్‌ను దాఖలు చేసేందుకు అనుమతి కోరారు. పరిస్థితి చాలా దారుణంగా, దిగ్భ్రాంతికరంగా వుంది. మొత్తంగా ఆ ప్రాంతాల్లో కార్బన్‌ డయాక్సైడ్‌ బాగా నెలకొందన్నారు. వాస్తవానికి జాతీయ హరిత ట్రిబ్యునల్‌కు ప్రభుత్వం నివేదికను అందచేసిందని చెప్పారు. మంటలు రేగిన సంఘటనలు తగ్గుతున్నాయని ట్రిబ్యు నల్‌ తెలిపిందన్నారు. తదుపరి విచారణ సమయంలో అమికస్‌ క్యూరీ, కేంద్ర సాధికార కమిటీని కూడా తీసుకురావాల్సి వుంటుందని జస్టిస్‌ గవారు పేర్కొ న్నారు. గత ఆరు మాసాల్లో 900కి పైగా కార్చిచ్చు సంఘటనలు చోటు చేసుకు న్నాయి. మొత్తంగా 1100 హెక్టార్ల అటవీ భూములు తగలబడ్డాయి. వీటిలో 351 కేసులు మనుష్యుల వల్ల జరిగినవేనని వార్తా కథనాలు తెలుపు తున్నాయి. పదే పదే కార్చిచ్చు రగులుతున్నా నిర్లక్ష్యం, నిష్క్రియాపరత్వం, పట్టి పట్టని ధోరణి, సంసిద్ధత కొరవడడం వంటి కారణాలతో అడవులకు తీరని నష్టం జరుగుతోందని పిటిషన్‌దారులు పేర్కొంటున్నారు. దీనివల్ల వన్యప్రాణి సంరక్షణ ప్రమాదంలో పడుతోందన్నారు.