క్రాంతి ఖడ్గం

నాన్నా..!
నాకు భయంగా ఉంది
ఏడుపొస్తుంది
అన్నం తినలేకపోతున్నా..
యుద్ధాలు – బాంబులు
ఎందుకు నాన్నా?

ఆ తమ్ముడు చూడు
అమ్మానాన్నలను పోగొట్టుకుని
ఎలా ఏడుస్తున్నాడో..
ఆ అక్క చూడు
కాలు తెగి రక్తంతో
కుంటుకుంటూ.. అబ్బా!
తట్టుకోలేకపోతున్నా

ఎందుకు నాన్నా మీ పెద్దలు
ఈ యుద్ధం ఆపలేరా?

బాంబులు యుద్ధ ట్యాంకులు
తయారు చేసేవారు
సైంటిస్టులు, ఇంజనీర్లయితే
నాకా చదువులు వద్దు నాన్నా

సైనికుడంటే
పూర్వం గర్వం
వరదల నుండి విపత్తుల నుండి
కాపాడతాడనీ…

ఒకరి కోసం మరొకరిని
చంపే సైనిక పని
నాకొద్దు నాన్నా…

నాకు
బతకాలని ఉంది నాన్నా
అందరూ బతకాలని
ఉంది నాన్నా..

ఆ పని మీ పెద్దలు చేయలేరా?

మనుషుల్ని చంపడం
పాపం కదా నాన్నా
మీకు దణ్ణం పెడతా
యుద్ధం ఆపండి నాన్నా
*****
ఏడవకు కన్నా ఏడవకు
శాంతి భవిత పతాక
మీ చిట్టి చేతుల్లో ఉంది

మీ బాధను
అందరికీ పంచండి
శాంతి పతాకం
వాడవాడలా ఎగరేయండి
మా పెద్దలకు బుద్దొచ్చేలా
గల్లా పట్టుకుని గద్దించండి
అసలు మీరు మనుషులేనా?
అని గొంతెత్తి ప్రశ్నించండి
కళ్ళు తుడుచుకుని
క్రాంతి ఖడ్గం పట్టండి
– కె. శాంతారావు, 9959745723