గురి కుదిరింది

The target is reachedపారిస్‌ ఒలింపిక్స్‌లో భారత్‌ మూడో పతకాన్ని ఖాతాలో వేసుకుంది. ఈ మూడు పతకాలు షూటింగ్‌లో వచ్చినవే. మను భాకర్‌ వ్యక్తిగత విభాగంలో, మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో సరబ్‌జ్యోత్‌తో కలిసి కంచు మోగించగా.. ఇప్పుడు 50 మీటర్ల 3 పొజిషన్‌ ఈవెంట్‌లో స్వప్నిల్‌ కుశాలె కాంస్యం అందించాడు. ఈ ముగ్గురు యువ క్రీడాకారుల విశేషాలు ఈ వారం జోష్‌…

చరిత్ర సష్టించిన మను భాకర్‌
ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన తొలి భారతీయురాలిగా మను భాకర్‌ చరిత్ర సష్టించింది. టీనేజీలోనే సంచలన ప్రదర్శనతో ప్రపంచ మేటి షూటర్లలో ఒకరుగా ఎదిగిన యువ క్రీడాకారిణి మను భాకర్‌. ప్రపంచ క్రీడా వేదికపైనా సత్తా చాటింది. టెన్నిస్‌, స్కేటింగ్‌, బాక్సింగ్‌ వంటి క్రీడలపై మక్కువ ఉన్నప్పటికీ షూటింగ్‌పైనే దష్టి సారించిన ఆమె.. తన నిర్ణయం విషయంలో గురి తప్పలేదని మరోసారి నిరూపించుకుంది. పారిస్‌ ఒలింపిక్స్‌లో మొన్న వ్యక్తిగత విభాగంలో కాంస్య సాధించిన మను.. తాజాగా మిక్స్‌డ్‌ టీమ్‌ విభాగంలో సరబ్‌జోత్‌ సింగ్‌తో కలిసి భారత్‌కు మరో కాంస్య పతకాన్ని అందించింది. దీంతో స్వాతంత్య్రం తర్వాత ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన భారత అథ్లెట్‌గా ఆమె రికార్డు సష్టించింది. బాక్సర్లు, రెజ్లర్లకు పర్యాయపదమైన హర్యానాలో ఫిబ్రవరి 18, 2002న మను భాకర్‌ జన్మించింది. తండ్రి రామ్‌కిషన్‌ భాకర్‌.. వాణిజ్యనౌకలో చీఫ్‌ ఇంజినీర్‌. పాఠశాల విద్య సమయంలో టెన్నిస్‌, స్కేటింగ్‌, బాక్సింగ్‌లో రాణించిన మను.. మార్షల్‌ ఆర్ట్స్‌లో ప్రావీణ్యం పొందింది. ఆయా విభాగాల్లో పతకాలు సాధించింది.
14 ఏండ్ల వయసులో అనూహ్యంగా షూటింగ్‌ను ఎంచుకుంది. 2016లో రియో ఒలింపిక్స్‌ ముగిసిన కొన్ని రోజులకే ఆ నిర్ణయం తీసుకుంది. వెంటనే తండ్రి రామ్‌కిషన్‌కు చెప్పిన ఆమె.. షూటింగ్‌ పిస్టల్‌ కావాలని కోరింది. మను వెన్నంటే నిలిచే ఆయన.. అంగీకరించి తక్షణమే షూటింగ్‌ పిస్టల్‌ కొనిచ్చారు. ఈ క్రమంలోనే 2017 ఆసియా జూనియర్‌ ఛాంపియన్‌షిప్స్‌లో రజతం సాధించి.. మను తొలిసారి అంతర్జాతీయ పోటీల్లో పతకం అందుకుంది.
పతకాల పంట..
– 2017లో కేరళలో నిర్వహించిన జాతీయ షూటింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో ఏకంగా తొమ్మిది స్వర్ణాలు సాధించింది. ఒలింపియన్‌, మాజీ ప్రపంచ నంబర్‌ 1 హీనా సిద్ధూనూ ఓడించింది. 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ ఫైనల్‌లో హీనా నెలకొల్పిన రికార్డు (240.8 పాయింట్లు)ను చెరిపేసి, 242.3 పాయింట్లతో తిరగరాసింది.
– అంతర్జాతీయ వేదికపై.. 2018 మెక్సికోలో అంతర్జాతీయ స్పోర్ట్‌ షూటింగ్‌ ఫెడరేషన్‌ (ఐఎస్‌ఎస్‌ఎఫ్‌) ప్రపంచ కప్‌లో అరంగేట్రం చేసింది. మహిళల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ ఫైనల్‌లోకి ప్రవేశించేందుకు ఉద్దేశించిన అర్హత రౌండ్లలో జూనియర్‌ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది.
– ఫైనల్‌లో ఒలింపిక్స్‌లో బంగారు పతక విజేత అన్నా కొరకాకి, మూడుసార్లు ప్రపంచ కప్‌ గెలిచిన సెలిన్‌ గోబెర్‌విల్లే, స్థానిక ఫేవరెట్‌ అలెజాండ్రా జవాలా వంటి హేమాహేమీలతో తలపడి.. 237.5 పాయింట్లతో స్వర్ణాన్ని చేజిక్కించుకుంది. కేవలం 16 ఏళ్లలోనే ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ ప్రపంచ కప్‌లో బంగారు పతకాన్ని గెలుచుకున్న అతి పిన్న వయస్కురాలిగా నిలిచింది. అదే పోటీల్లో 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ విభాగంలో ఓం ప్రకాశ్‌ మిథర్వాల్‌తో కలిసి రెండో స్వర్ణాన్ని గెలుచుకుంది.
– ఆస్ట్రేలియాలో జరిగిన 2018 కామన్వెల్త్‌ గేమ్స్‌లో మహిళల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ స్వర్ణాన్ని కైవసం చేసుకుంది.
– ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ జూనియర్‌ ప్రపంచ కప్‌లో 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌లో మరో స్వర్ణాన్ని గెలుచుకుంది. మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో కాంస్యం సాధించింది. అయితే.. 25 మీటర్ల పిస్టల్‌ ఈవెంట్‌లో మాత్రం త్రుటిలో పతకం చేజారింది.
– 2018 ఆసియా క్రీడల్లో ఆమెకు పతకం రానప్పటికీ.. అర్జెంటీనాలోని బ్యూనస్‌ ఎయిర్స్‌లో జరిగిన 2018 యూత్‌ ఒలింపిక్స్‌ గేమ్స్‌లో చరిత్ర సష్టించింది. 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ విభాగంలో స్వర్ణాన్ని గెలుచుకుని.. యూత్‌ ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన మొదటి భారతీయ షూటర్‌గా, భారత్‌ నుంచి మొదటి మహిళా అథ్లెట్‌గా నిలిచింది.
– 2019లో జరిగిన మూడు ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ ప్రపంచ కప్‌లలో మిక్స్‌డ్‌ టీమ్‌ విభాగంలో బంగారు పతకాలను గెలుచుకుంది. చైనాలో జరిగిన వరల్డ్‌ కప్‌లో వ్యక్తిగతంగా, మిక్స్‌డ్‌ టీమ్‌ విభాగంలోనూ స్వర్ణం సాధించింది.
– 2019 మ్యూనిక్‌ ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ ప్రపంచ కప్‌లో నాల్గో స్థానంలో నిలిచి.. టోక్యో ఒలింపిక్స్‌లో చోటుదక్కించుకుంది.
– 2021 ఢిల్లీ ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ ప్రపంచ కప్‌లో 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌లో బంగారు, రజత పతకాలు, 25 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌లో కాంస్యం వచ్చింది.
– అదే ఏడాది జరిగిన టోక్యో ఒలింపిక్స్‌లో నిరాశే ఎదురైంది. 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ క్వాలిఫికేషన్‌ మధ్యలో ఆమె పిస్టల్‌ మరమ్మతులకు గురికావడంతో.. పోటీ నుంచి బయటకు రావాల్సివచ్చింది. మరమ్మతుల అనంతరం తిరిగివచ్చినప్పటికీ.. అప్పటికే నష్టం జరిగిపోయింది. దీంతో ఫైనల్‌కు చేరుకోలేకపోయింది. 10 మీటర్ల పిస్టల్‌ మిక్స్‌డ్‌లో ఏడో స్థానంలో నిలిచింది. 25 మీటర్ల పిస్టల్‌లో ఫైనల్‌కు చేరుకోలేకపోయింది.
– 2021 లిమాలో ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ జూనియర్‌ వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌లో పతకాల పంట పండించింది. నాలుగు స్వర్ణాలు, ఒక కాంస్యం సాధించింది.
– 2022 కైరో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో మహిళల 25 మీటర్ల పిస్టల్‌లో రజతం, 2023 హాంగ్‌జౌలో జరిగిన ఆసియా క్రీడల్లో స్వర్ణం గెలుచుకుంది.
– భోపాల్‌లో నిర్వహించిన ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ వరల్డ్‌ కప్‌లో మహిళల 25 మీటర్ల పిస్టల్‌లో కాంస్యం వచ్చింది.
– దక్షిణ కొరియాలో ఆసియా షూటింగ్‌ ఛాంపియన్‌షిప్స్‌-2023లో మహిళల 25 మీటర్ల పిస్టల్‌లో అయిదో స్థానంలో నిలిచి.. భారత్‌ తరఫున పారిస్‌ ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. తాజాగా 10 మీ ఎయిర్‌ పిస్టల్‌లో కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది.
టికెట్‌ కలెక్టర్‌ టూ ఒలింపిక్‌ మెడలిస్ట్‌..
క్వాలిఫికేషన్‌ రౌండ్‌లో ఏడో స్థానంలో నిలిచి ముందంజ వేసిన స్వప్నిల్‌ ఫైనల్‌లో మెరుగైన ప్రదర్శన చేసి మూడో స్థానంలో నిలిచాడు. దీంతో భారత్‌ ఖాతాలో మరో కాంస్య పతకం చేరింది. ఒలింపిక్స్‌లో 50 మీటర్ల విభాగంలో పతకం సాధించిన తొలి భారత షూటర్‌గా స్వప్నిల్‌ రికార్డు సష్టించాడు. అతను ఇండియన్‌ రైల్వేలో టికెట్‌ కలెక్టర్‌. ఉద్యోగం చేస్తూనే టోర్నీల్లో పాల్గొంటున్నాడు. ఎంతో కష్టపడి చివరికి తన కలను సాకారం చేసుకున్నాడు. ఇది చదువుతుంటే క్రికెట్‌ దిగ్గజం ఎం.ఎస్‌ ధోనీనే గుర్తొచ్చి ఉంటాడు కదా. టీమిండియాలోకి అరంగేట్రం చేయకముందు ధోనీ టికెట్‌ కలెక్టర్‌గా పనిచేసిన విషయం తెలిసిందే. ధోనీ నుంచి ప్రేరణ పొందిన మరో అథ్లెట్‌ పారిస్‌ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన భారత షూటర్‌ స్వప్నిల్‌ కుసాలే. స్వప్నిల్‌ కుసాల్‌ కూడా సెంట్రల్‌ రైల్వేలో టికెట్‌ కలెక్టర్‌గా పనిచేస్తున్నాడు. కట్‌ చేస్తే విశ్వక్రీడల్లో దేశానికి పతకం అందించాడు. తొలి విశ్వక్రీడల్లోనే స్వప్నిల్‌ మెడల్‌ గెలవడం మరో విశేషం.
మహారాష్ట్రలోని కొల్హాపూర్‌ జిల్లాలోని కంబల్వాడి గ్రామంలో 29 ఏళ్ల స్వప్నిల్‌ పుట్టి పెరిగాడు. అతని తండ్రి, సోదరుడు ప్రభుత్వ ఉపాధ్యాయులు. తల్లి గ్రామ సర్పంచ్‌. మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన స్వప్నిల్‌ షూటింగ్‌ను తన కెరీర్‌గా ఎంచుకున్నాడు. భారత మాజీ కెప్టెన్‌ ధోనీని ప్రేరణగా తీసుకున్న అతను కల సాకారం కోసం కష్టపడ్డాడు. 2012 నుంచి స్వప్నిల్‌ అంతర్జాతీయ ఈవెంట్లలో పాల్గొంటున్నాడు. స్వప్నిల్‌ 2015 నుంచి సెంట్రల్‌ రైల్వేలో పుణెలో టికెట్‌ కలెక్టర్‌గా పనిచేస్తున్నాడు. ఆ సంపాదనతో తొలి రైఫిల్‌ కొనుగోలు చేశాడు. కొన్ని సార్లు ప్రాక్టీస్‌ కోసం బుల్లెట్లు కొనడానికి కూడా సరిపడా డబ్బులు ఉండేవి కాదని ఓ ఇంటర్వ్యూలో స్వప్నిల్‌ చెప్పాడు. 2012 నుంచి అంతర్జాతీయ ఈవెంట్లలో పాల్గొంటున్న అతను ఒలింపిక్స్‌లో పాల్గొనడానికి 12 ఏళ్లు ఎదురుచూశాడు. 2015లో జరిగిన జూనియర్‌ ఏషియన్‌ షూటింగ్‌ చాంపియన్‌షిప్‌లో 50 మీటర్ల రైఫిల్‌ ప్రోన్‌ 3 కేటగిరీలో గోల్డ్‌ మెడల్‌ గెలిచాడు. 2021 నుంచి అతను నిలకడగా రాణిస్తున్నాడు. ఆ ఏడాది జరిగిన వరల్డ్‌ కప్‌లో, గతేడాది జరిగిన ఆసియా క్రీడల్లో 50 మీటర్ల రైఫిల్‌ 3 పొజిషన్స్‌ టీమ్‌ కేటగిరీలో భారత జట్టు స్వర్ణం సాధించడంలో అతను కీలక పాత్ర పోషించాడు. 2022లో వరల్డ్‌ షూటింగ్‌ చాంపియన్‌షిప్‌లో 4వ స్థానంలో నిలిచి ఒలింపిక్స్‌ కోటా సాధించాడు.
ఫుట్‌బాలర్‌ కాబోయి… షూటర్‌గా మెడల్‌ సాధించాడు
మను-సరబజ్యోత్‌ జోడీ దక్షిణ కొరియా జట్టును 16-10 తేడాతో ఓడించి భారత్‌కు రెండో పతకాన్ని అందించింది. సరబ్‌జ్యోత్‌ సింగ్‌ ఈ విభాగంలో గగన్‌నారంగ్‌, విజరు కుమార్‌ తర్వాత పతకం సాధించిన మూడో భారత షూటర్‌గా నిలిచాడు. కచ్చితంగా గగన్‌ నారంగ్‌ కాంస్య పతకం గెలిచిన 2012 జులై 30 నాటి నుంచి 12 ఏళ్ల తర్వాత అదే తేదీన విజయం సాధించడం విశేషం.
హరియాణలోని అంబాలా సమీపంలోని ధేన్‌ గ్రామానికి చెందిన జతీందర్‌ సింగ్‌-హర్దీప్‌ కౌర్‌ దంపతులకు సరబ్‌జ్యోత్‌ సెప్టెంబర్‌ 2001న జన్మించాడు. తండ్రి రైతు. చిన్నప్పటి నుంచి ఫుట్‌బాలర్‌ కావాలని సరబ్‌జ్యోత్‌ కలలు కన్నాడు. కానీ, అతడి లక్ష్యాలు వేగంగా మారిపోయేవి. 13 ఏళ్ల వయస్సులో ఒక సారి సమ్మర్‌ క్యాంప్‌లో పిల్లలు పేపర్‌ టార్గెట్లను గురిపెట్టడం చూసి పిస్తోల్‌ షూటింగ్‌పై ఆసక్తి పెంచుకొన్నాడు. ఆ తర్వాత మెల్లగా ఆ దిశగా మళ్లాడు. తొలుత ఇది ఖరీదైన క్రీడ కావడంతో తల్లిదండ్రులు ప్రోత్సహించేందుకు సంకోచించారు. కానీ, సరబ్‌జోత్‌ వారికి నచ్చజెప్పాడు. ఇక వారు బిడ్డ ఆసక్తిని కాదనలేకపోయారు. తొలుత జిల్లా స్థాయిలో రజత పతకం సాధించడంతో కుమారుడిలో ప్రతిభ ఉందని గుర్తించారు. ఈ విజయం అతడి జీవితాన్ని మార్చేసింది. అభిషేక్‌ రాణా పర్యవేక్షణలో ప్రొఫెషనల్‌ కోచింగ్‌ మొదలైంది. చండీగఢ్‌ డీఏవీ కళాశాలలో సరబ్‌జ్యోత్‌ చదువుకొన్నాడు. అతడి శిక్షణ మొత్తం అంబాలాలోని ఏఆర్‌ షూటింగ్‌ అకాడమీలో జరిగింది. 2019 జూనియర్‌ వరల్డ్‌ ఛాంపియన్‌ షిప్‌లో స్వర్ణ పతకం సాధించడంతో సీనియర్‌ ర్యాంకింగ్స్‌లోకి అడుగుపెట్టాడు. అంతేకాదు వ్యక్తిగత, మిక్స్‌డ్‌ టీమ్‌ విభాగాల్లో రజత పతకాలను అందుకొన్నాడు. అదే ఏడాది దోహాలో జరిగిన ఆసియా ఛాంపియన్‌ షిప్‌లో కూడా బంగారు పతకం లభించింది. 2022లో జరిగిన 65వ జాతీయ షూటింగ్‌ ఛాంపియన్‌ షిప్‌లో రెండు స్వర్ణాలను గెలుచుకొన్నాడు. 2023 ఆసియా ఛాంపియన్‌ షిప్స్‌లో కాంస్యపతకం సాధించి.. ఒలింపిక్స్‌లో బెర్త్‌ ఖాయం చేసుకొన్నాడు.

– అనంతోజు మోహన్‌కృష్ణ, 8897765417