గురి అదిరింది

– షూటింగ్‌లో మరో పసిడి
– వుషూలో రోషిబినాకు రజతం
– ఈక్వెస్ట్రియన్‌లో అనూశ్‌కు కాంస్యం
– హాంగ్జౌ ఆసియా క్రీడలు 2023
ఆసియా క్రీడల్లో టీమ్‌ ఇండియా పతక జోరు కొనసాగుతుంది. హాంగ్జౌలో భారత్‌ వరుసగా ఐదో రోజు పతకాల పంట పండించింది. షూటింగ్‌లో మరో పసిడి పతకం దక్కగా.. వుషూలో సిల్వర్‌ మెడల్‌ సొంతమైంది. ఈక్వెస్ట్రియన్‌ (గుర్రపుస్వారీ)లో కాంస్య పతకం లభించింది. ఐదో రోజు మూడు మెడల్స్‌ సాధించిన భారత్‌.. పతకాల పట్టికలో 25 మెడల్స్‌తో ఐదో స్థానంలో నిలిచింది.
నవతెలంగాణ-హాంగ్జౌ
షూటింగ్‌లో మెన్స్‌ 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ ఈవెంట్‌. భారత యువ షూటర్‌ సౌరభ్‌ చౌదరి ఈ విభాగంలో ఆసియా రికార్డు నెలకొల్పాడు. 2018 జకర్తా క్రీడల్లో సౌరభ్‌ రికార్డు 240.7 పాయింట్లతో పసిడి కొల్లగొట్టాడు. దీంతో సహజంగానే ఈసారి ఈ విభాగంలో భారత్‌ పతక ఆశలతో బరిలోకి దిగింది. కానీ పతక వేటలో 4, 8 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. సరబ్జోత్‌ సింగ్‌ 199 స్కోరుతో నాల్గో స్థానంలో నిలిచి పతకాన్ని తృటిలో చేజార్చుకోగా.. చీమా సింగ్‌ అర్జున్‌ ఫైనల్లో చివరి స్థానంలో నిలిచాడు. దీంతో మెన్స్‌ 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ జట్టు విభాగంలో మనోళ్లపై పెద్దగా అంచనాలు లేకుండా పోయాయి. ఇక్కడే యువ షూటర్ల త్రయం అద్భుతం చేసింది. ఆసియా క్రీడల్లో తొలిసారి గురి పెట్టిన సరబ్జోత్‌ సింగ్‌, చీమా అర్జున్‌ సింగ్‌, శివ నర్వాల్‌లు అదరగొట్టారు. 1734 పాయింట్లతో పసిడి పతకం అందుకున్నారు. చైనా షూటర్లు 1733 పాయింట్లతో రజతం, వియత్నాం జట్టు 1730 పాయింట్లతో కాంస్యం సాధించాయి. పతక వేటలో భారత్‌కు చైనా నుంచి గట్టి పోటీ ఎదురైంది. చివరి రౌండ్‌లో కచ్చితంగా పదేసి పాయింట్లు సాధిస్తే కానీ పసిడి రేసులో నిలువలేని పరిస్థితి. ఒత్తిడిలో మరింత మెరుగ్గా గురి పెట్టిన సరబ్జోత్‌, అర్జున్‌, శివలు బంగారు పతకం ముద్దాడారు. సరబ్జోత్‌ సింగ్‌ వరుసగా 95, 95, 97, 98, 97, 98 పాయింట్లు సాధించగా.. చీమ అర్జున్‌ సింగ్‌ 97, 96, 97, 97, 96, 95తో మెరిశాడు. శివ నర్వాల్‌ 92, 96, 97, 99, 97, 95తో దుమ్మురేపాడు. షూటింగ్‌లో భారత్‌కు ఇది నాలుగో పసిడి పతకం కావటం విశేషం.
వుషూలో రోషిబినాకు రజతం :
ఆసియా క్రీడల్లో భారత్‌కు పతక అవకాశాలు మెరుగ్గా ఉన్న మరో ఈవెంట్‌ వుషూ. క్రీడల ఆరంభానికి ముందే వుషూ అథ్లెట్లు వార్తల్లో నిలిచారు. అరుణాచల్‌ ప్రదేశ్‌కు చెందిన ముగ్గురు వుషూ అథ్లెట్లకు చైనా స్టాంప్డ్‌ వీసా నిరాకరించింది. దీంతో పతకం నెగ్గే అవకాశం ఉన్న ముగ్గురు అథ్లెట్లు టోర్నీకి దూరంగానే ఉండిపోయారు!. మార్షల్‌ ఆర్ట్స్‌ గేమ్‌లో బరిలో నిలిచిన ఇతర అథ్లెట్లు మాత్రం సత్తా చాటుతున్నారు. మణిపూర్‌ మణిపూస రోషిబినా దేవి మహిళల విభాగంలో సిల్వర్‌ మెడల్‌ సాధించింది. మహిళల 60 కేజీల శాండ విభాగంలో పోటీపడిన రోషిబినా దేవి గురువారం జరిగిన పసిడి పోరులో చైనా అమ్మాయికి స్వర్ణం కోల్పోయింది. తొలి రౌండ్లో రోషిబినా దేవి లెగ్‌ కిక్స్‌తో మెరిసినా.. చైనా అమ్మాయి 1-0తో ముందంజ వేసింది. చావోరేవో తేల్చుకోవాల్సిన రెండో గేమ్‌లో సైతం రోషిబినా దేవి మెరుగైన ప్రదర్శన చేసినా ప్రత్యర్థిదే పైచేయిగా నిలిచింది. దీంతో మూడో రౌండ్‌ అవసరం లేకుండానే చైనా అమ్మాయి 2-0తో స్వర్ణం దక్కించుకుంది. పసిడి పోరులో పోరాడి ఓడిన రోషిబినా దేవి సిల్వర్‌ మెడల్‌ సొంతం చేసుకుంది. 2018 జకర్తా ఆసియా క్రీడల్లో కాంస్య పతకం సాధించిన రోషిబినా దేవి.. తాజాగా రజతంతో పతకం రంగు మెరుగుపర్చుకుంది.
ఈక్వెస్ట్రియన్‌లో మెరిసిన అనూశ్‌ :
2023 ఆసియా క్రీడల్లో భారత గుర్రపు స్వారీ జట్టు అదరగొడుతుంది. డ్రెసేజ్‌ విభాగంలో టీమ్‌ ఇండియా ఇప్పటికే టీమ్‌ విభాగంలో పసిడి సాధించి చరిత్ర సృష్టించగా.. అదే విభాగం వ్యక్తిగత పోటీలో అనూశ్‌ అగర్‌వాలా మెరిశాడు. పలు సిరీస్‌లుగా జరిగిన ఈ పోటీల్లో అనూశ్‌ అగర్‌వాలా, అతడి గుర్రం ఎట్రో 73.030 స్కోరు సాధించారు. ఓవరాల్‌గా మూడో స్థానంలో నిలిచిన అనూశ్‌ అగర్‌వాలా కాంస్య పతకం సొంతం చేసుకున్నాడు. మలేషియా రైడర్‌ 75.780 స్కోరుతో పసిడి నెగ్గగా.. హాంగ్‌కాంగ్‌ రైడర్‌ 73.450 స్కోరుతో రజతం గెల్చుకున్నాడు.
నిజాయితీగా చెప్పాలంటే, ఈ పసిడి పతకం ఊహించలేదు. ఇవి మాకు తొలి ఆసియా క్రీడలు. తొలి ప్రయత్నంలోనే పతకం సాధించటం, అదీ బంగారం సొంతం చేసుకోవటం ఎంతో సంతోషంగా ఉంది. మేము అన్నదమ్ముల్లా ఉంటాం. షూటింగ్‌ రేంజ్‌లో పోటీ, ఆ తర్వాత చెలిమి మా నైజం. శివ, అర్జున్‌తో కలిసి సాధించిన ఈ గోల్డ్‌ మెడల్‌ ఎంతో ప్రత్యేకం. వ్యక్తిగత విభాగంలో నాల్గో స్థానంలో నిలువటం సంతృప్తి ఇవ్వలేదు. రానున్న టోర్నీల్లో పతక ప్రదర్శన చేసేందుకు మెరుగవుతాను’
– సరబ్జోత్‌ సింగ్‌

హాకీ ఇండియా గెలుపు
భారత మెన్స్‌ హాకీ జట్టు గ్రూప్‌ దశలో కీలక విజయం సాధించింది. గ్రూప్‌-ఏలో డిఫెండింగ్‌ చాంపియన్‌ జపాన్‌పై 4-2తో గెలుపొందింది. ఈ విజయంతో గ్రూప్‌-ఏలో భారత్‌ అగ్రస్థానానికి చేరుకుంది. 30 నిమిషాల ఆట అనంతరం భారత్‌ 2-0తో ముందంజలో నిలిచింది. ద్వితీయార్థంలో జపాన్‌ గోల్స్‌ కొట్టినా.. భారత్‌ సైతం మెరిసింది. అభిషేక్‌ 13, 45వ నిమిషాల్లో గోల్‌ కొట్టగా.. రోహిదాస్‌, మన్‌దీప్‌ సింగ్‌లు గోల్స్‌ నమోదు చేశారు. జపాన్‌ తరఫున కటో, మిటానిలు గోల్స్‌ సాధించారు.

ఛెత్రి సేన ఇంటిముఖం
సమకరణాలు కలిసొచ్చి గ్రూప్‌ దశ దాటి నాకౌట్‌ దశకు చేరుకున్న భారత ఫుట్‌బాల్‌ జట్టు.. ప్రీ క్వార్టర్స్‌లో పరాజయం పాలైంది. సౌదీ అరేబియా చేతిలో 0-2తో ఓటమి చెంది ఇంటిముఖం పట్టింది. ప్రథమార్థం ముగిసే సరికి ఇరు జట్లు గోల్స్‌ కొట్టలేదు. కానీ ద్వితీయార్థం ఆరంంలోనే సౌదీ ఆటగాడు మారెన్‌ 51, 58వ నిమిషాల్లో డబుల్‌ గోల్స్‌తో విరుచుకుపడ్డాడు. గోల్స్‌ వేటలో విఫలమైన భారత్‌ ఆసియా క్రీడల నుంచి నిష్క్రమించింది.

ఆకుల శ్రీజ ముందంజ
టేబుల్‌ టెన్నిస్‌లో తెలంగాణ స్టార్‌ ఆకుల శ్రీజ శుభారంభం చేసింది. మహిళల డబుల్స్‌లో దియ చితాలెతో కలిసి ప్రీ క్వార్టర్స్‌కు చేరుకుంది. 11-8, 15-13, 11-6తో వియత్నాం జోడీపై గెలుపొంది ముందంజ వేశారు. మహిళల సింగిల్స్‌లో శ్రీజ 6-11, 4-11, 13-15, 9-11తో ఉత్తర కొరియా ప్యాడ్లర్‌ చేతిలో ఓడింది.