బంగారు తెలంగాణ కాదు ధర్నాల తెలంగాణ

– టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శంకర్‌
నవతెలంగాణ-కేశంపేట
బంగారు తెలంగాణ కాదు ఇప్పుడు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పుణ్యమా అంటూ ధర్నాల తెలంగాణగా మా రిందని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శంకర్‌ ఎద్దేవా చేశారు. శనివారం మండల కేంద్రంలో మధ్యాహ్న భోజన కార్మికులు, ఆశా వర్కర్లు వేరువేరుగా తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ధర్నా నిర్వహించారు. వీరికి శంకర్‌ మద్దతు తెలిపి మాట్లాడారు.. అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందజేస్తే సకాలంలో ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో వారు అప్పుల పాలవుతున్నారని అన్నారు. చాలీచాలని జీతాలతో ఆశావర్కర్లు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వీరిని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. వారి సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ మండల అధ్యక్షులు గూడ వీరేశం, యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు భాస్కర్‌ గౌడ్‌, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.