గడువు రెండు రోజులే ముగియనున్న పంచాయతీల పదవీకాలం

– అభివృద్ధి పనుల బిల్లులు అందక సర్పంచుల ఇబ్బందులు
– తెచ్చిన అప్పులకు వడ్డీలు కూడా కట్టలేక పోతున్నామని ఆవేదన
– పెండింగ్‌ బిల్లులు చెల్లించి ఆదుకోవాలని ప్రభుత్వానికి వేడుకోలు
నవతెలంగాణ-ఆమనగల్‌
సర్పంచుల పదవి కాలం రెండు రోజుల్లో ముగియనుంది. ఈలోపు ఎన్నికలు నిర్వహించి కొత్తగా పాలకవర్గాన్ని ఎన్నుకోవాల్సి ఉన్నప్పటికీ పార్లమెంట్‌ ఎన్నికల దృష్ట్యా రాష్ట్ర ఎన్నికల సంఘం సర్పంచ్‌ ఎన్నికలపై దృష్టి పెట్టడం లేదు. పదవీకాలం ముగిశాక తిరిగి ఎన్నికలు నిర్వహించే వరకు పంచాయతీ కార్యదర్శులు ఇన్చార్జులుగా వ్యవహరించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తమకు రావలసిన పెండింగ్‌ బిల్లులు కోసం సర్పంచుల కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కొత్త ప్రభుత్వం బిల్లులు మంజూరు చేసి ఆదుకోవాలని వారు కోరుతున్నారు.
సర్పంచులకు అందని బిల్లులు..
ఆమనగల్‌ మండలంలో 13 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. గ్రామాల్లో రోడ్లు, డ్రయినేజీలు, వీధిలైట్ల ఏర్పాటు, డంపింగ్‌ యార్డులు, పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠ ధామాల నిర్మాణం చేపట్టారు. గ్రామాల్లో చెత్తను సేకరించేందుకు ప్రభుత్వం టాక్టర్లను అందించి మల్టీ పర్పస్‌ విధానంలో వర్కర్లను నియమించింది. కాగా కేంద్రం నుంచి వచ్చే ఆర్థిక సంఘం నిధులు గ్రామ పంచాయతీలో పనిచేసే సిబ్బంది జీతాలు నిర్వహణకు సరిపోని పరిస్థితి. అభివృద్ధి పనులకు ప్రభుత్వం నుంచి బిల్లుల మంజూరులో జాప్యం కావడంతో సర్పంచులు అప్పులు చేసి మరి పనులు పూర్తి చేశారు. ఇలా ఒక్కొక్కరు సుమారు రూ.5 లక్షల నుంచి రూ.30 లక్షలకు పైగా అప్పులు చేశారు. బిల్లులు సకాలంలో రాకపోవడంతో తీసుకొచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజులలో తమ పదవీకాలం ముగుస్తుండటం, చేసిన పనులకు ప్రభుత్వం నుంచి బిల్లులు అందకపోవడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు.
కోటికి పైగా పెండింగ్‌..
గ్రామాల్లో రైతు వేదికలు, వైకుంఠ ధామాలు, డంపింగ్‌ యార్డ్‌ పనులను అధికారులు సర్పంచులపై ఒత్తిడి తీసుకొచ్చి మరీ పూర్తి చేయించారు. ఒక్కో రైతు వేదికను రూ.22 లక్షల అంచనా వ్యయంతో నిర్మించగా అందులో రూ.12 లక్షలు ఉపాధి హామీనిధుల నుంచి ఖర్చు చేయగా మిగిలిన రూ.10 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. ఉపాధి హామీ నుంచి నిధులు వచ్చినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం నుంచి బిల్లులు ఇంతవరకు అందలేదని పలువురు చెప్తున్నారు. ఇలా ప్రతిపనికి అరకొరగానే బిల్లులు విడుదలయ్యాయని అంటున్నారు. మండలంలోని రాంనుంతల గ్రామ పంచాయతీకి దాదాపు రూ.24 లక్షలు, సింగంపల్లి రూ.8 లక్షలు, ఆకుతోటపల్లి రూ.7 లక్షలు, కొత్త కుంట తాండా రూ.2.5 లక్షలు, మేడిగడ్డ, పోలేపల్లి, సీతారాంనగర్‌ తాండా, శంకర్‌ కొండ, మంగళపల్లి తదితర గ్రామ పంచాయతీలకు రూ.6 లక్షలకు పైగా పెండింగ్‌ బిల్లులు రావాల్సి ఉందని ఆయా గ్రామాల సర్పంచులు తెలిపారు. ఇలా అన్ని గ్రామ పంచాయతీలకు కలుపుకొని సుమారు రూ.1 కోటికి పైగా బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్టు తెలుస్తుంది. నూతన ప్రభుత్వమైనా పెండింగ్‌లో ఉన్న బిల్లులను చెల్లించాలని వారు కోరుతున్నారు.

రూ.35 లక్షలు రావాల్సి ఉంది..
గ్రామీణాభివృద్ధి కోసం వడ్డీకి తీసుకొచ్చి పనిచేశా. సీసీ రోడ్లు, డ్రయినేజీలు, నీటి సమస్య పరిష్కరిచేందుకు బోరు మోటార్లకు ఖర్చు చేశా. ఈ నెల చివరన పదవీకాలం ముగియ నుంది. నేను గ్రామాభివృద్ధి కోసం పెట్టిన ఖర్చులో ఇంకా రూపాయలు 35 లక్షల బిల్లులు రావాల్సి ఉంది పెట్టిన డబ్బులు వెంటనే చెల్లించకపోతే ఆర్థికంగా చితికిపోయే ప్రమాదం ఉంది. కొత్త ప్రభుత్వమైనా బిల్లులు చెల్లించాలి.
– కొప్పు మంజుల యాదయ్య, సర్పంచ్‌, చింతలపల్లి

అప్పులు తెచ్చి అభివృద్ధి చేశాం..
గ్రామీణాభివృద్ధి కోసం ఖర్చు చేసిన నిధులను వెంటనే విడుదల చేయాలి. అప్పులు తీసుకొచ్చి మరీ పనులు చేపట్టాం. దానికి సంబంధించిన రికార్డులను కూడా సమర్పిచాం. వెంటనే బిల్లులు మంజూ రయ్యే విధంగా చర్యలు తీసుకోవాలి. మా గ్రామంలో రూ.15 లక్షల అభివృద్ధి పనుల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. వెంటనే వాటిని చెల్లించడంతో పాటు మా పదవీ కాలాన్ని పొడిగించాలి.
– పబ్బతి శ్రీనివాస్‌, సర్పంచ్‌, చెన్నంపల్లి

పెండింగ్‌ బిల్లులు వెంటనే చెల్లించాలి
అప్పులు చేసి గ్రామంలో అభివృద్ధి పనులు చేపట్టాం. మాకు దాదాపు రూ.24 లక్షలకు పైగా బిల్లులు రావాల్సి ఉంది. రాష్ట్ర మంత్రివర్గం ప్రత్యేక చొరవ తీసుకుని గ్రామ పంచాయతీలకు రావలసిన పెండింగ్‌ బిల్లులు వెంటనే చెల్లించాలి. అదేవిధంగా ప్రత్యేక అధికారుల పాలనలో గ్రామాల అభివృద్ధి కుంటుపడే ప్రమాదం లేకపోలేదు. కావున సర్పంచ్ల పదవీకాలన్ని ఆరు నెలలు పొడగించాలి.
– వడ్త్యావత్‌ సోనా శ్రీను నాయక్‌ సర్పంచ్‌, రాంనుంతల

పదవి కాలాన్ని పొడిగించాలి
ఈనెల చివరిలో ముగియనున్న సర్పం చుల పదవికాలాన్ని పొడిగించాలి. గతంలో ఎన్నడూ లేని విధంగా కరోనా మహమ్మారి విలయతాండం చేసిన సమయంలో ఆత్మ స్థైర్యంతో ముందుకు వచ్చి గ్రామీణ ప్రాంతాల్లోని పేద ప్రజలకు అన్ని విధాలుగా ఆదుకున్న ఘనత నాటి ప్రజా ప్రతినిధులకే దక్కుతుంది. అలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులు కుంటూ పడకుండా పనిచేసిన నేటి వరకు బిల్లులు రాక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. లాక్‌ డౌన్‌, పెండింగ్‌ బిల్లులు తదితర వాటిని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర మంత్రివర్గం ప్రత్యేక చొరవ తీసుకొని సర్పంచుల పదవీకాలం పొడిగించాలి.
– ఎగిరిశెట్టి గోదాదేవి సత్యం, మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షులు, శెట్టిపల్లి సర్పంచ్‌