టెట్‌ దరఖాస్తు ఫీజు తగ్గించలేదు

– నేటినుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ
– వాటి సమర్పణకు తుది గడువు ఏప్రిల్‌ 10
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఆన్‌లైన్‌లో బుధవారం నుంచి ప్రారంభం కానుంది. వాటి సమర్పణకు తుది గడువు వచ్చేనెల పదో తేదీ వరకు ఉన్నది. ఈనెల 22న టెట్‌ పూర్తిస్థాయి నోటిఫికేషన్‌ను విద్యాశాఖ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే టెట్‌ దరఖాస్తు ఫీజును భారీగా పెంచడం పట్ల అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక పేపర్‌ రాస్తే రూ.వెయ్యి, రెండు రాయాలనుకుంటే రూ.రెండు వేలు చెల్లించాలని విద్యాశాఖ ప్రకటించింది. దీనిపై తీవ్ర వ్యతిరేకత వస్తున్నది. గతంలో ఒక పేపర్‌కు రూ.200, రెండు పేపర్లు రాస్తే రూ.300 దరఖాస్తు ఫీజు ఉన్నది. టెట్‌ దరఖాస్తు ఫీజును భారీగా పెంచడాన్ని విద్యార్థి, యువజన సంఘాలు కూడా వ్యతిరేకిస్తున్నాయి. ఈ నిర్ణయాన్ని పునరాలోచన చేసి నిరుద్యోగ అభ్యర్థులపై భారం లేకుండా చూడాలని కోరుతున్నాయి. ఫీజు పెంపుపై పెద్దఎత్తున వ్యతిరేకత వచ్చినా, అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నా విద్యాశాఖ అధికారులు మాత్రం తగ్గించకపోవడం గమనార్హం. మే 20 నుంచి జూన్‌ మూడో తేదీ వరకు టెట్‌ రాతపరీక్షలను ఆన్‌లైన్‌లో కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష (సీబీటీ) విధానంలో నిర్వహిస్తారు. ఇతర వివరాల కోసం ష్ట్ర్‌్‌జూర://రషష్ట్రశీశీశ్రీవసబ.్‌వశ్రీaఅస్త్రaఅa.స్త్రశీఙ.ఱఅ వెబ్‌సైట్‌ను సంప్రదించాల్సి ఉంటుంది.