వస్త్ర పరిశ్రమ కార్మికులకు ఉపాధి కల్పించాలి

– పవర్‌లూమ్‌ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూరపాటి రమేష్‌
– చేనేత జౌళిశాఖ కార్యాలయం ఎదుట వంటా వార్పు
నవతెలంగాణ – సిరిసిల్ల టౌన్‌
సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో నెలకొన్న సంక్షోభాన్ని నివారించి వస్త్ర పరిశ్రమపై ఆధారపడ్డ కార్మికులందరికీ ప్రభుత్వం వెంటనే ఉపాధి కల్పించాలని తెలంగాణ పవర్‌లూమ్‌ వర్కర్‌ యూనియన్‌ (సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూరపాటి రమేష్‌ డిమాండ్‌ చేశారు. గురువారం సీఐటీయూ వస్త్ర పరిశ్రమ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో చేనేత జౌళిశాఖ కార్యాలయం ఎదుట వంటావార్పు కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా రమేష్‌ మాట్లాడుతూ.. మూడు నెలల నుంచి సిరిసిల్లలో నెలకొన్న సంక్షోభంతో నేతన్నలు ఉపాధి లేక రోడ్డున పడి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. నేతన్నల సమస్యలను పరిష్కరించాలని పలు దఫాలుగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వస్త్ర పరిశ్రమ సమస్యలను పరిష్కరించి ఉపాధి కల్పించాలని, లేకుంటే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభ నివారణ, నేతన్నల ఉపాధి కోసం సీఐటీయూ వస్త్ర పరిశ్రమ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ఐక్య పోరాట కార్యాచరణ రూపొందించి ముందుకెళ్తామని స్పష్టంచేశారు. కార్యక్రమంలో యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు మూశం రమేష్‌, జిల్లా అధ్యక్షులు కోడం రమణ, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఎగమంటి ఎల్లారెడ్డి, ఎలిగేటి రాజశేఖర్‌, సిరిమల్ల సత్యం, ఉడుత రవి, ఒగ్గు గణేష్‌, కుమ్మరి కుంట కిషన్‌, సబ్బని చంద్రకాంత్‌, సదానందం, సురేష్‌, వేణు, రాజు, రవీందర్‌, సంపత్‌, సతీష్‌, పోచమల్లు తదితరులు పాల్గొన్నారు.