– ఆర్థిక వ్యవస్థలకు ప్రమాదం
– ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత వెల్లడి
న్యూఢిల్లీ : క్రిప్టో కరెన్సీలతో ఆర్థిక వ్యవస్థల స్థిరత్వానికి భారీ ముప్పు పొంచి ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ మరోమారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ డిజిటల్ కరెన్సీలతో సెంట్రల్ బ్యాంక్ నగదు చలామణిపై నియంత్రణ కోల్పోయే పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. పీటర్సన్ ఇనిస్టిట్యూట్ ఫర్ ఇంటర్నేషనల్ ఎకనామిక్స్ అనే థింక్ ట్యాంక్ కార్యక్రమంలో గవర్నర్ శక్తికాంత మాట్లాడుతూ.. ‘ఆర్థిక వ్యవస్థపై ఆధిపత్యం ప్రదర్శించే క్రిప్టో కరెన్సీలను అనుమతించవద్దు. క్రిప్టో కరెన్సీలతో ఆర్థిక సుస్థిరతకు ముప్పు. ద్రవ్య లభ్యత ప్రమాదం పొంచి ఉంటుంది. బ్యాంకింగ్ వ్యవస్థ కూడా ముప్పులో పడుతుంది. ఆర్థిక వ్యవస్థలో నగదు చెలామణిపై ఆర్‌బిఐ నియంత్రణ కోల్పోతుంది.” అని శక్తికాంత అన్నారు. క్రిప్టోకరెన్సీల వల్ల కలిగే నష్టాల గురించి ప్రభుత్వాలు కూడా తెలుసుకుంటున్నాయని శక్తికాంత పేర్కొన్నారు. ఆర్ధిక వ్యవస్థపైన క్రిప్టోల ఆధిపత్యం ఉండకూడదన్నారు. ఈ కరెన్సీ వల్ల కలిగే నష్టాలను గురించి తెలుసుకోవాలన్నారు. ఈ సమస్య మీద అందరికి అవగాహన ఉండాలన్నారు. క్రిప్టోకరెన్సీల గురించి భారత దేశమే తొలి సారి ప్రశ్నించిందన్నారు.
”భారత్‌లో జరిగిన జీ20 సమావేశంలో క్రిప్టో అంశం మీద అవగాహన పెంపొందించడానికి ఒక ఒప్పందం జరిగింది. అప్పట్లో దీనిపైన తీవ్రమైన ఆందోళనలను వ్యక్తం చేసిన మొదటి సెంట్రల్ బ్యాంక్ ఆర్‌బీఐనే. ఈ విషయంలో ఇప్పటికే కొంత పురోగతి సాధించాము. దీనిపై ఇంకా పనిచేయాల్సి ఉంది. క్రిప్టోల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.” అని అన్నారు. క్రిప్టోతో కలిగే భారీ నష్టాలను దృష్టిలో ఉంచుకొని ఈ సమస్యపై అంతర్జాతీయంగా అవగాహన పెరగాలన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బ్యాంక్‌లకు ఇది ప్రధాన ఆందోళనగా మారిందన్నారు.