గీతానంద్, నేహా సోలంకి జంటగా నటించిన చిత్రం ‘గేమ్ ఆన్’. సీనియర్ నటులు మధుబాల, ఆదిత్య మీనన్, శుభలేఖ సుధాకర్ కీలక పాత్రలు పోషించారు. కస్తూరి క్రియేషన్స్ అండ్ గోల్డెన్ వింగ్ ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై దయానంద్ దర్శకత్వంలో రవి కస్తూరి ఈ సినిమాను నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 2న గ్రాండ్‌గా విడుదలకు సిద్దమవుతోంది. ఈ సందర్భంగా శనివారం ప్రసాద్ లాబ్స్‌లో ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మాత రవి కస్తూరి మాట్లాడుతూ, ‘ఇది నా ఫస్ట్ ప్రాజెక్ట్. నేను ఆస్ట్రేలియాలో ఉంటాను. గీతానంద్ నా క్లాస్‌మేట్. మంచి కథతో ఈ సినిమాను స్టార్ట్ చేసాం. ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా రూపొందించాం. ప్రేక్షకులను ఎంగేజ్ చేసేలా సినిమా ఉంటుంది. నవాబ్ గ్యాంగ్స్ అద్భుతమైన పాటలు ఇచ్చారు. అవి అందర్నీ ఆకట్టుకునేలా ఉంటాయి. ఇలాంటి కథ ఇప్పటివరకు తెలుగు తెరపై రాలేదు’ అని చెప్పారు. ‘కమర్షియల్ స్క్రిప్ట్‌ని రా అండ్ రస్టిక్‌గా చిత్రీకరించాను. పూరి జగన్నాథ్ ఫ్యాన్‌గా ఈ సినిమాను డైరెక్ట్ చేశాను. ఈ చిత్రంలో పాత్రలన్నీ గ్రే షేడ్‌లో ఉంటాయి. ప్రతి పాత్రకు ప్రాధాన్యం ఉంటుంది. తన జీవితాన్ని చాలించాలనుకునే ఓ వ్యక్తి రియల్ టైమ్ సైకలాజికల్ గేమ్‌లోకి ఎలా ప్రవేశించాడు?, గేమ్‌లోని టాస్క్‌ను ఎలా స్వీకరించాడు?, అసలు ఆ గేమ్ ఎంచుకోవడానికి కారణం ఏమిటి?, ఈ గేమ్ ఎవరు ఆడిస్తున్నారు? అనే అంశాలతో ఈ సినిమా తెరకెక్కింది. యాక్షన్, రొమాన్స్, ఎమోషన్స్ ఆకట్టుకుంటాయి. కచ్చితంగా మా సినిమా ప్రేక్షకులకు కొత్త ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది’ అని దర్శకుడు దయానంద్ అన్నారు. నేహా సోలంకి మాట్లాడుతూ, ‘ఇలాంటి పాత్రను గతంలో నేనెప్పుడూ చేయలేదు. మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాం’ అని తెలిపారు.