నవతెలంగాణ – రాయపోల్
స్త్రీలను గౌరవించే దేశమని గొప్పలు చెప్పుకునే భారతదేశంలో నిత్యం మహిళల పై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయని కలకత్తలో మహిళ డాక్టర్ పై అత్యాచారానికి పాల్పడిన వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని ఎస్ఆర్ ఫౌండేషన్ అధ్యక్షురాలు, సామాజిక ప్రజా సేవకురాలు మహమ్మద్ సుల్తాన ఉమర్ అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కలకత్తలోని మహిళా డాక్టర్ పై సామూహిక అత్యాచార ఘటన మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరు సిగ్గుపడవలసిన విషయమన్నారు.అత్యాచార ఘటన జరిగి 9 రోజులు గడిచినప్పటికీ నేరస్తులందరినీ గుర్తించి శిక్షించడంలో నిర్లక్ష్యాన్ని ఖండిస్తున్నామన్నారు. పాలకవర్గాలు ఘనంగా స్వతంత్ర వేడుకల్లో తమ గురించి డోలు వాయిద్యాలతో గొప్పలు చెప్పుకుంటారు కానీ మహిళలపై దేశవ్యాప్తంగా నిరంతరం అత్యాచారాలు జరగడానికి గల మూల కారణాలను తొలగించడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదన్నారు. దేశంలో అనేక ఘటనలు జరుగుతున్నప్పటికీ సమాజం నుంచి తీవ్రమైన చర్చ జరుగుతున్నప్పటికీ ప్రభుత్వాలు, పోలీసు వర్గాలు కోర్టులు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంటున్నాయన్నారు. గత పితృ స్వామిక సంస్కృతికి తోడు నేటి పెట్టుబడుదారి విశృంఖల సంస్కృతి, సాంప్రదాయాలు పురుషాధిపత్య సంస్కృతి మహిళలను ఒక ఆట బొమ్మగా, ఎంటర్ టైనర్ గా చిత్రీకరిస్తున్నారు. ఎక్కడైనా అత్యాచారం జరిగితే రాజకీయ పార్టీలు రాజకీయ ప్రయోజనాలు పొందడానికి గోల చేయడమే కానీ వాటిని మూలం నుంచి నివారించడానికి ఎలాంటి ప్రయత్నాలు లేవన్నారు. రాజకీయ పార్టీలు మహిళలపై మరింత తీవ్రంగా అణచివేత కొనసాగడానికి ,మహిళలను చిన్నచూపు చూడడానికి,అత్యాచారాలు కొనసాగడానికి నేటి ప్రభుత్వ విధానాలే కారణమన్నారు. డాక్టర్ అత్యాచార నిందితులందరిని వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.