ఐరాన్ ట్రాక్ ను దొంగిలించిన దుండగులు

–  అపహరణకు గురైన సుమారు లక్షల విలువ చేసే ప్రభుత్వ సొమ్ము
–  సంఘటన స్థలంలోనే గ్యాస్ ను వదిలి వెళ్లిన దుండగులు
–  పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన సంబంధిత అధికారులు
–  కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్
–  నందికొండలో అపహరణకు గురౌతున్న ప్రభుత్వ ఆస్తులను కాపాడాలి
నవతెలంగాణ – నాగార్జునసాగర్
నాగార్జునసాగర్ ప్రాజెక్టు పరిధిలోని నీటి సరఫరా డివిజన్ కు సంబంధించి నీటి మోటార్ల ట్రాక్లను గుర్తు తెలియని దుండగులు అపహరించారు.హిల్ కాలని పాత ఫిల్టర్ హౌస్ దిగువ భాగాన గతంలో నీటిని పంపిణీ చేసే  ప్రక్రియ కొనసాగేది. నూతనముగా పైలాన్ కాలనీలో ఫిల్టర్ హౌస్ ఏర్పాటు చేసిన అనంతరం హిల్ కాలని ఫిల్టర్ హౌస్ నుండి నీటిని సరఫరా చేయడం ఆగిపోయింది. నీటి సరఫరా విభాగానికి చెందిన ఓ అధికారి కార్యాలయము , సిబ్బంది అక్కడే తమ విధులు నిర్వహిస్తుంటారు.. ఈ కార్యాలయము దిగువ భాగాన కృష్ణ నది ఒడ్డున నుండి పాత ఫిల్టర్ హౌస్ వరకు సుమారు కిలోమీటర్ మేర నీటి మోటర్ ను ఏర్పాటు చేశారు.డ్యామ్ నీటిమట్టం పెరిగినప్పుడు,తగ్గినప్పుడు పైకి,కిందికి కావాల్సిన రీతిలో మోటార్ కు నీరు అందే విధంగా ట్రాక్ ను ఏర్పాటు చేశారు.  అదేవిధంగా మోటార్ మరమ్మత్తులకు గురైనప్పుడు పైకి ఫిల్టర్ హౌజ్ దాకా తీసుకొచ్చే విధంగా ఇనుప స్తంభాలతో ఐరన్ ట్రాక్ ను ఏర్పాటు చేశారు. అయితే ఆ ఐరన్ ట్రాకులను గత కొంతకాలంగా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కిలోమీటర్ పైగా స్తంభాల ట్రాకులను గ్యాస్ వెల్డింగ్ తో  ముక్కలు ముక్కలుగా కట్ చేసి  అపహరించారు.  సుమారు లక్షల రూపాయలు విలువ చేసే ఐరన్ ట్రాక్ ను ముక్కలు ముక్కలుగా చేసి కృష్ణానది ఒడ్డున నుండి పైకి తీసుకురావడం అంతా సులభమైన పని కాదని స్థానికులు ఆరోపిస్తున్నారు. గత రెండు రోజుల క్రితం స్థానికులు ఈ వ్యవహారాన్ని గుర్తించి సంబంధిత అధికారులకు తెలియజేసిన సకాలంలో స్పందించకపోవడం ఫిల్టర్ హౌస్ కు కూతవేటు దూరంలోనే ఈ దొంగతనం జరగటం స్థానికులకు అనేక అనుమానాలకు తావిస్తోంది. ఇదే విషయాన్ని కొంతమంది స్థానికులు అధికారుల దృష్టికి తీసుకు వెళ్లడంతో స్పందించిన సంభందించిన అధికారులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై ఎన్ఎస్పి ఉన్నత స్థాయి అధికారులు లోతుగా విచారణ చేపట్టి ప్రభుత్వ ఆస్తులను అపహరించిన వ్యక్తులను, వారికి సహకరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
ప్రభుత్వ ఆస్తులను కాపాడాలి: హీరేకార్ రమేష్ , కౌన్సిలర్, నాగార్జునసాగర్ హిల్ కాలనీలో తాగునీటి మోటర్ కోసం లక్షలు వెచ్చించి ఏర్పాటుచేసిన ఐరాన్ ట్రాక్ ను అపహరించిన దొంగలను,సహకరించిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలి.దొంగతనం జరిగిన సమయంలో వీధులలో ఉన్న సిబ్బందిని కూడా విచారించాలి.నందికొండలో అపహరణకు గురౌతున్న ప్రభుత్వ ఆస్తులను కాపాడాలి.