యూనివర్సిటీల టైం స్కేల్‌ సిబ్బందిని రెగ్యులర్‌ చేయాలి

– వారికి కనీస వేతనాలివ్వాలి : జయశంకర్‌ తెలంగాణ స్టేట్‌ అగ్రికల్చరల్‌ వర్సిటీ సదస్సులో సీఐటీయూ కార్యదర్శి జె.వెంకటేశ్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
యూనివర్సిటీలలో పనిచేసే టైమ్‌ స్కేల్‌ సిబ్బందిని రెగ్యులర్‌ చేయాలనీ, ఎన్‌ఎంఆర్‌, డైలీవేజ్‌, కంటింజెంట్‌, కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు కనీస వేతనాలివ్వాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేశ్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. హన్మకొండ జిల్లాలోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ స్టేట్‌ అగ్రికల్చరల్‌ యూనివర్సిటీలో తెలంగాణ యూనివర్సిటీస్‌ ఎంప్లాయీస్‌, వర్కర్స్‌ యూనియన్‌(సీఐటీయూ అనుబంధం) ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించారు. దీనికి ఆ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు మెట్టు రవి అధ్యక్షత వహించారు. ఆ యూనియన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాగుల రమేష్‌, (కాకతీయ యూనివర్సిటీ) రామ్‌చందర్‌, దేశిని రవి, అచ్చికాయల చిరంజీవి, (శాతవాహన) శ్రీనివాస్‌, సతీష్‌, (ఎజి యూనివర్సిటీ, హనుమకొండ) జి. సమ్మయ్య, వి. దర్గయ్య, ఎస్‌బి. రఘు, రాజ్‌భరత్‌, ఎం. రమేష్‌, కె. స్వరూప, రమ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆ యూనియన్‌ రాష్ట్ర గౌరవాధ్యక్షులు, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె. వెంకటేష్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 18 వర్సిటీల్లో టైమ్‌ స్కేల్‌, డైలీవేజ్‌, ఎన్‌ఎంఆర్‌, కంటింజెంట్‌, కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ తదితర పద్ధతుల్లో సుమారు 10 వేల మంది పనిచేస్తున్నారని చెప్పారు. వారికి వేతనాల్లో తీవ్రమైన వ్యత్యాసాలున్నాయనీ, మూడేండ్లుగా ఏజెన్సీల ద్వారానే నియామకాలు జరుగుతున్నాయని వివరించారు. యూనివర్సిటీలు నిర్ణయించిన కనీస వేతనాలే అతి తక్కువగా ఉన్నాయనీ, వాటిలోనూ ఏజెన్సీలు పర్సంటేజీల పేరుతో కోతలు పెడుతున్నాయని విమర్శించారు. ఒక్కో యూనివర్సిటీకి ఒక్కో వేతన నిర్ణయం అమలు చేయడం దారుణమన్నారు. యూనివర్సిటీల యాజమాన్యాలు, రాష్ట్ర ప్రభుత్వం వారి సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. వారికి కనీస వేతనాలివ్వడంతో పాటు గుర్తింపు కార్డులు, బస్‌ పాస్‌లివ్వాలనీ, రూ.10 లక్షల ఇన్సూరెన్స్‌ చెల్లించాలని కోరారు. రాగుల రమేష్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో అత్యంత దయనీయ స్థితిలో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులు న్యాయమైన డిమాండ్లపై పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సదస్సులో భవిష్యత్‌ కార్యాచరణను మెట్టురవి ప్రవేశపెట్టారు.

సదస్సు కార్యాచరణ
8 జూలై 1న రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల వద్ద రిలే నిరాహార దీక్షలు.
8 ఆర్ధిక శాఖామంత్రి, విద్యా శాఖామంత్రి, ప్రిన్సిపల్‌ సెక్రటరీలకు జూలై 3 నుంచి 6 వరకు రాయబారాలు
8నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌ అందరూ డిమాండ్‌ బ్యాడ్జీలు ధరించాలి.
8జూలై 7న హైదరాబాద్‌లోని ఇందిరా పార్కు వద్ద యూనివర్సిటీల నాన్‌ టీచింగ్‌ శంఖారావం సభకు వేలాదిగా తరలిరావాలి.