రెండో రోజు కు చేరిన టోకెన్ సమ్మె

నవతెలంగాణ – అశ్వారావుపేట
గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, వేతన బకాయిలను వెంటనే విడుదల చేయాలని, ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అర్హులైన గ్రామపంచాయతీ కార్మికులకు ఇల్లు మంజూరు చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు పిట్టల అర్జున్ డిమాండ్ చేశారు. గ్రామపంచాయతీ కార్మికులు వారి అపరిస్క్రృత  సమస్యలపై చేపట్టిన టోకెన్ సమ్మె శనివారం నాటికి రెండవ రోజుకు చేరుకుంది.
ఈ సందర్భంగా రెండవ రోజు సమ్మెను ప్రారంభిస్తూ అర్జున్ మాట్లాడుతూ కార్మికులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నప్పటికి రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల సమస్యల పట్ల నాన్చివేత ధోరణి ప్రదర్శిస్తుందని అన్నారు. జనవరి 4 లోపు గ్రామపంచాయతీ జేఏసీ ని చర్చలకు పిలిచి సమస్యలు పరిష్కరించాలని లేదంటే జేఏసీ నిర్ణయం మేరకు విధులు బహిష్కరించి నిరవదిక సమ్మె లోకి వెళ్తున్నట్టు హెచ్చరించారు. గ్రామపంచాయతీ కార్మికులకు కనీస వేతనం రూ. 26 వేలు ఇవ్వాలని,చట్టబద్ధ సౌకర్యాలు కల్పించాలని,మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ మండల కన్వీనర్ కే.నరసింహారావు, గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్షుడు వెంకటప్పయ్య, ముత్తా రావు,మల్లయ్య, విజయ్, సీతారాములు తదితరులు పాల్గొన్నారు.