స్వరం మారుతోంది…

స్వరం మారుతోంది...– ఎన్నికల ప్రచారంలో పాటలకు ప్రాధాన్యం
– ప్రజా సమస్యలను వదిలి అభ్యర్థులపై పాటలు
– పథకాలపై కొన్ని.. ప్రత్యర్ధులపై విమర్శలతో లిరిక్స్‌
– హిట్‌ సాంగ్స్‌కు వెంటనే పేరడీలు
నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి :
ఎన్నికల ప్రచారంలో పాటలకు ప్రాధాన్యం పెరిగింది. ఒకప్పుడు ప్రజా సమస్యలు, జీవన శైలి, చైతన్యం, ఉత్తేజ పరిచే పాటల స్థానంలో ఇప్పుడు రాజకీయ నాయకుల కోసం గొంతెత్తుతున్నారు. ఎన్నికల పాటలై హౌరెత్తుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాటలు మారుమోగుతున్నాయి. ప్రధాన పార్టీల అభ్యర్థులు తమ క్యాంపెయిన్‌లో పాటలను తప్పనిసరి చేశాయి. పార్టీలే కాకుండా అభ్యర్ధులు కూడా సొంతంగా పాటలు రాయించుకుంటున్నారు. తమ పేర్లు, వ్యక్తిత్వం, సేవా కార్యక్రమాలు, పార్టీ చేసిన పనులు.. ఇవన్నీ ప్రస్తావిస్తూ సాహిత్యం వెలువడుతోంది.
పాటలకు తగినట్ట్లగా సంగీతాన్ని సమకూర్చి మ్యూజిక్‌ డైరెక్టర్లు ఆ పాటలను రికార్డ్‌ చేయించి ప్రచార రథాల్లో తిప్పుతున్నారు. కొన్ని పాటలు అత్యంత ఆసక్తి కరంగా ఉండటంతో జనం నోళ్లలో తరచూ నానుతున్నాయి. యూట్యూబ్‌, సోషల్‌ మీడియాలో ప్రచారం పాటలు కూడా ట్రెండింగ్‌ గా మారాయి. ఒకరు ” గులాబీల జెండలే రామక్క… అంటే మరొకరు గులాబీల దొంగలే రామక్క” అని అంటూ పేరడీలు కడుతున్నారు. ప్రచార పాటలతో కొత్త కవులు, రచయితలు, గాయకులు వెలుగులోకి వస్తున్నారు. ఎన్నికల పాటల మూలంగా కళాకారులకు జీవనోపాధి లభిస్తుంది.
ప్రజా ఉద్యమాల స్వరం మారుతోంది…
ఒకప్పుడు ప్రజా ఉద్యమాలు నిర్మాణం కోసం పాటలు పాడిన గొంతులే ఇప్పుడు ఎన్నికల్లో అభ్యర్ధులను, పార్టీలను కీర్తిస్తూ స్వరాలు పలుకుతున్నాయి. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రజలలో స్ఫూర్తి నింపడం కోసం పాటలు ప్రధాన అస్త్రాలుగా ఉపకరించాయి. నేడు ఎన్నికల ప్రచారంలో అలాంటి పాటలే మారుమోగుతున్నాయి. హిట్‌ అయిన సినిమా సాంగ్స్‌ను పోలిన బాణిలో అభ్యర్థులపై పాటలు కడుతున్నారు. తెలుగుదేశం పార్టీ ఏర్పాటు నుంచి రాజకీయాల్లో పాటలకు ప్రాధాన్యత బాగా పెరిగింది. ” కదలి రండి తెలుగుదేశం కార్యకర్తలారా… త్యాగాలకు వెనుదీయని దేశ భక్తులారా.. ” పాట నాడూ.. నేడు… అదే విశిష్టత తో సాగుతోంది. ప్రజా నాట్యమండలి ఆధ్వర్యంలో జనజాగృతి కోసం కమ్యూనిస్టు పార్టీల విధానాలపై అనేక పాటలు జనబాహుల్యంలోకి వచ్చాయి. వీటిలో విశేష ఆదరణ పొందిన కొన్ని పాటలను తమకు అనుకూలంగా కొన్నిపార్టీలు ఇప్పుడు ఎన్నికల ప్రచార పాటలుగా వాడుకుంటున్నారు.
పార్టీలు, అభ్యర్థుల కోసం పాటలు
కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులు, పార్టీ కోసం అనేక పాటలను రూపొందించింది. ఏ అభ్యర్థికి ఆ అభ్యర్థి ట్రెండింగ్‌లో ఉన్న పాటల మోడల్లో పాటలు రాయించుకొని సింగర్లతో పాడిస్తున్నారు. సీనియర్‌ నేతలు, ఎమ్మేల్యేలు , మంత్రులు చేసిన పనులు, సేవా కార్యక్రమాలు తదితరలా ఆధారంగా పాటలు రాయిస్తున్నారు.
ప్రభుత్వం తమ పథకాలను బేస్‌ చేసుకొని రూపొందించిన పాటలను సైతం ఈ ఎన్నికల ప్రచారం కోసం వాడుతోంది. దాదాపు వంద నియోజకవర్గాల్లో స్వతంత్ర అభ్యర్థులతో సహా అందరూ పాటలకు ప్రాధాన్యం ఇస్తుండటంతో కళాకారులకు ఉపాధి దొరుకుతోంది. సినిమా పాటల రచయితలకు ఎక్కువ బడ్జెట్‌ ఇవ్వాల్సి వస్తుండటంతో సాధారణ రచయితలకు తక్కువ పారితోషికం ఇచ్చి రాయిస్తున్న పాటలు కూడా విశేష ఆదరణ పొందుతున్నాయి. ఒక్కో ఆల్బమ్‌కు రూ.లక్ష నుంచి రూ.లక్షన్నర పారితోషికం ఇస్తున్నట్లు లీడర్లు చెబుతున్నారు.
కళ కళకోసం కాదు…
కళ కళకోసం కాదు ప్రజల కోసం…ప్రజలను చైతన్య పరచాల్సిన పాట ఇప్పుడు కొత్త రూపం సంతరించుకుంది. ప్రజా ఉద్యమాలు నిర్మించాల్సిన పాట ఇప్పుడు రూపం మార్చింది. పొట్ట కూటి కోసం కళాకారులు రాజకీయ పార్టీలు, అభ్యర్థుల కోసం పాటలు పాడక తప్పటం లేదు. బతుకుదెరువు కోసం కొన్ని పాటలు పాడిన ప్రజలను మేల్కొలిపే పాటలనూ కళాకారులు ఆలపించాల్సిస అవసరం ఎంతైనా ఉంది.
సదానంద్‌, ప్రజానాట్యమండలి
రాష్ట్ర నాయకులు