
– ట్యాంక్ బండ్ నిర్మాణ పనులు పూర్తి చేయాలి..
– సినారె కళామందిర్ ఆడిటోరియం, మినీ స్టేడియం నిర్మాణాన్ని చేపట్టాలి..
– వేములవాడలో రాష్ట్రంలోనే అతిపెద్ద బస్టాండ్ నిర్మాణానికి చర్యలు చేపట్టాలి..
– పట్టణ అభివృద్ధికి రేపు సీఎం రూ.20 కోట్లు కేటాయిస్తూ ప్రకటన చేయాలి..
– వేములవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో బిఆర్ఎస్ నేతల వ్యాఖ్యలు..
నవతెలంగాణ – వేములవాడ
గత బిఆర్ఎస్ ప్రభుత్వం వేములవాడ పట్టణంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించవద్దని వాటిని పూర్తి చేసే బాధ్యత ప్రస్తుత సర్కారుపై ఉందని వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి, పట్టణ కౌన్సిలర్లు అన్నారు. మంగళవారం పట్టణంలోని చల్మెడ లక్ష్మీ నరసింహారావు నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ నేడు వేములవాడ ఆలయ అభివృద్ధితోపాటు పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనకు విచ్చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బిఆర్ఎస్ పార్టీ ద్వారా స్వాగతం పలుకుతున్నామని తెలిపారు. కానీ గత ప్రభుత్వ హాయంలో గుడి చెరువు సుందరీ కరణ పేరిట రూ.100 కోట్లతో చేపట్టిన ట్యాంక్ బండ్ నిర్మాణంతోపాటు వివిధ అభివృద్ధి కార్యక్రమాలు ప్రస్తుతం తుది దశకు చేరుకున్నాయని ప్రస్తుత వాటి పనులు వేగవంతం చేసే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉందన్నారు. అంతే కాకుండా పట్టణంలో గత ప్రభుత్వం చేపట్టిన సినారె కళామందిరం, మినీ స్టేడియం, రోడ్ల వెడల్పు, పట్టణ సుందరీ కరణ, డబల్ బెడ్ రూమ్స్ నిర్మాణం, రహదారుల నిర్మాణం, తదితర పనులను ప్రస్తుత ప్రభుత్వం నిర్లక్ష్యం చేయవద్దని, పూర్తిచేసి పట్టణాభివృద్ధికి సహకరించాలని వారు కోరారు. బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కౌన్సిలర్ నిమ్మశెట్టి విజయ్ మాట్లాడుతూ గత ప్రభుత్వం రాష్ట్రంలో ఎక్కడలేని విధంగా అతిపెద్ద బస్టాండును వేములవాడ పట్టణంలో నిర్మించేందుకు వ్యూహాలు రచించిందని వెంటనే బస్టాండ్ నిర్మాణానికి ప్రస్తుత ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు.ఈ సమావేశంలో పట్టణ కౌన్సిలర్లు నరాల శేఖర్, కొండ కనకయ్య, మారం కుమార్, గోలి మహేష్, కందుల క్రాంతి కుమార్, సిరిగిరి చందు, కుమ్మరి శ్రీనివాస్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు తోపాటు తదితరులు పాల్గొన్నారు.