వినాయక నిమజ్జనంలో విషాదం..గోదావరిలో బాలుడి గల్లంతు

– బాణసంచా పడి చిరు వ్యాపార దుకాణం దగ్ధం
నవతెలంగాణ-భద్రాచలం రూరల్‌
వినాయక విగ్రహాల నిమజ్జనం సందర్భంగా పలు చోట్ల విషాద ఘటనలు జరిగాయి. రాష్ట్ర నలుమూలల నుంచి నవరాత్రులు ముగించుకొని శోభాయాత్రతో నిమజ్జన నిమిత్తం భద్రాచలానికి వేల సంఖ్యలో గణనాథులు తరలిరాగా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా పోలీస్‌ శాఖ, రెవెన్యూ, పంచాయతీ శాఖల అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినప్పటికీ ఒకటి రెండు విషాదాలు జరిగాయి. గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం వీర్య తండాకు చెందిన 20 మంది వినాయకున్ని నిమజ్జనానికి భద్రాచలం తీసుకొచ్చారు. నిమజ్జనం అనంతరం ముగ్గురు గోదావరిలో స్నానానికి దిగి గల్లంతు కాగా వెంటనే స్పందించిన ఎన్‌డిఆర్‌ఎఫ్‌ పోలీస్‌ సిబ్బంది ఇద్దరిని రక్షించినట్టు పట్టణ సీఐ నాగరాజు రెడ్డి తెలియజేశారు. మరో బాలుడు గల్లంతయ్యాడు. గాలింపు చేపట్టారు. భద్రాచలం పట్టణంలోని భగవాన్‌ దాస్‌ కాలనీలో అంబేద్కర్‌ సెంటర్‌ వద్ద బాణసంచా పేలుస్తుండగా నిప్పు రవ్వలు ఫుట్‌పాత్‌పై ఉన్న చిరు వ్యాపారి దుకాణం పడటంతో దగ్ధమైంది. మంటలు పెద్దఎత్తున ఎగిసిపడ్డాయి. ఫైరింజిన్‌ వచ్చి మంటలను అదుపు చేసింది.