– సిర్పూరులో బీఆర్‌ఎస్‌కు పునర్‌వైభవం తీసుకొస్తాం
– బీఆర్‌ఎస్ నాయకుడు ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్
నవతెలంగాణ-కాగజ్‌నగర్
ఉద్యమ ద్రోహులే బీఆర్‌ఎస్ పార్టీని వీడారని ఆ పార్టీ నాయకుడు ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ విమర్శించారు. బుధవారం కాగజ్‌నగర్‌లోని పద్మశాలి భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్‌ఎస్ పాలనలో రాజకీయ పదవులు అనుభవించి. అధికారం కోల్పోగానే కాంగ్రెస్‌లో చేరిన వారు నిజమైన ఉద్యమ నాయకులు కాదని, వారికి రాజకీయ భవిష్యత్తు ఉండదని అన్నారు. ఈ ప్రాంతాన్ని మరింత దోచుకోవడం కోసమే వారు పార్టీని మారారని మండిపడ్డారు. సిర్పూరు నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ పునర్‌వైభవం కోసం ప్రతీ కార్యకర్త కృషి చేయాలని కోరారు. కాంగ్రెస్ హయాంలో తలపెట్టిన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు పనులను త్వరితగతిన ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ప్రాజెక్టు కోసం సేకరించిన భూములకు సంబంధించిన రైతులకు ఇంకా నష్టపరిహారం అందించలేదని అన్నారు. నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న తుమ్డిహెటి, సాండ్‌గాం, రన్‌వెల్లి, కోర్సిని, గూడెం, హుడ్కిలి, లోనవెల్లి, సుర్జాపూర్, జంబుగ ఎత్తిపోతల పథకాలను తిరిగి వినియోగంలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న కర్జవెల్లి-గూడెం మార్గానికి బీటీ రహదారి నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. అధికారం అండతో కాంగ్రెస్ నాయకులు బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలపై గుండాగిరీ చేస్తున్నారని, దీనిని సహించేది లేదని అన్నారు. సిర్పూరు పేపర్ మిల్లులో వెంటనే గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ మిల్లులో స్థానిక ఉద్యోగులకు తక్కువ వేతనాలు ఇస్తూ, స్థానికేతరులకు మాత్రం అధికంగా వేతనాలు చెల్లిస్తున్నారని అన్నారు. అనంతరం బీఆర్‌ఎస్ నియోజకవర్గ కన్వీనర్‌గా లెండుగురె శ్యాంరావును నియమించారు. అదేవిధంగా సిర్పూరు మండల కన్వీనర్‌గా అస్లాంబిన్ అబ్దుల్లా, బెజ్జూరుకు సోయం చిన్నయ్య, కాగజ్‌నగర్‌కు ఆవుల రాజ్‌కుమార్, దహెగాంకు నస్పర్ లక్ష్మి, కౌటాలకు బండు, పెంచికల్‌పేట్‌కు బిట్టు శ్రీనివాస్, చింతలమానెపల్లికి గోమాసె లాంచులను నియమించినట్లు ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ ప్రకటించారు.
ఇథనాల్ ఫ్యాక్టరీని రద్దు చేయాలి
కాగజ్‌నగర్ మండలం అంకుసాపూర్ సమీపంలో అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు నిర్మిస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీని రద్దు చేయాలని ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ డిమాండ్ చేశారు. ప్రెస్‌మీట్‌కు ముందు ఏర్పాటు చేసిన కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ పులుల అభయారణ్యానికి కేవలం 60 మీటర్ల దూరంలో ఈ ఫ్యాక్టరీ నిర్మిస్తున్నారని, దీనికి నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ, నేషనల్ బోర్డు ఫర్ వైల్డ్‌లైఫ్ నుంచి ఎలాంటి అనుమతులు లేవని అన్నారు. అయినా నిబంధనలకు విరుద్దంగా ఈ ఫ్యాక్టరీ పనులు చేపడుతున్నారని అన్నారు. పులులు చనిపోతే ఆదివాసీ బిడ్డలను బాధ్యులు చేసే అటవీ శాఖాధికారులు ఈ ఫ్యాక్టరీ పనులపై ఎందుకు మౌనంగా ఉన్నారని ఆయన ప్రశ్నించారు.