నవతెలంగాణ – కంఠేశ్వర్
బదిలీ అయినా ఎస్జిటి ఉపాధ్యాయులను వెంటనే రిలీవ్ చేయాలని బిసి ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు మాడవేడి వినోద్ కుమార్ తెలియజేశారు. ఈ మేరకు ఆదివారం జిల్లా కేంద్రం లో బిసి ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మాడవేడి వినోద్ కుమార్ మాట్లాడుతూ…ఇటీవల జరిగిన ఉపాధ్యాయుల బదిలీలలో ఒకే పాఠశాలలో దాదాపు 13 సంవత్సరాలు పనిచేసి బదిలీ అయిన తరువాత కూడా వారిని రిలీవ్ చేయకపోవడం బాధాకరమన్నారు. బదిలీ అయిన ఎస్జీటీ ఉపాధ్యాయులను వెంటనే రిలీవ్ చేసి ఖాళీలను విద్యావాలంటీర్ చే భర్తీ చేయాలన్నారు , ఆప్షన్లకు తగు సమయం ఇవ్వక సాంకేతిక మరియు ఇతర కారణాలతో నష్టపోయిన ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని, స్కూల్ అసిస్టెంట్ పదోన్నతులలో పలువురు ఉపాధ్యాయులకు ఒకటి కంటే ఎక్కువ సబ్జెక్టులలో పదోన్నతి వచ్చిందని, ఎంపిక చేసుకున్న సబ్జెక్టు పోగా, మిగిలిన వారు పదోన్నతి తిరస్కరించిన సబ్జెక్టు ఖాళీలను, తదుపరి అర్హత కలిగిన ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాలన్నారు. బిసి ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బిసి ఉపాధ్యాయ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్షి రాఘవాపురం గోపాలకృష్ణ, ఉపాధ్యక్షులు జె శ్రీనివాస్, గౌరవ సలహాదారులు రమణ స్వామి, డిచ్ పల్లి మండలం అధ్యక్షులు కొట్టాల రామ కృష్ణ, మహిళా ఉపాధ్యక్షురాలు బోగ ప్రతిభ తదితరులు పాల్గొన్నారు.