– టీఎస్ యుటిఎఫ్ ప్రధాన కార్యదర్శి చావ రవి డిమాండ్
నవతెలంగాణ-మెదక్ టౌన్
రాష్ట్ర వ్యాప్తంగా బదిలీలు, పదోన్నతుల షెడ్యూలు అర్ధాంతరంగా నిలిచిపోయిన సందర్భంలో కనీసం బదిలీ అయిన స్కూల్ అసిస్టెంట్లనైనా వెంటనే విడుదల చేయాలని, అవసరమైన చోట ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టిఎస్ యుటిఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావ రవి డిమాండ్ చేశారు. యుటిఎఫ్ పూర్వ అధ్యక్షులు నాగటి నారాయణ ప్రథమ వర్ధంతి సభ మంగళవారం సాయంత్రం స్థానిక టిఎస్ యుటిఎఫ్ జిల్లా కార్యాలయంలో జి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగింది. ఈ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న చావ రవి మాట్లాడుతూ నిరంతర ఉద్యమకారుడు నాగటి నారాయణ అని కొనియాడారు. అట్టడుగు వర్గాల నుంచి జాతీయ స్థాయి ఉపాధ్యాయ ఉద్యమ నాయకునిగా ఎదిగిన నారాయణ అందరికీ ఆదర్శమన్నారు. ఉపాధ్యాయ రంగంలో సామాజిక న్యాయం సాధనకోసం తుదిశ్వాస వరకు పోరాడిన నారాయణ ఆశయాల సాధనకోసం కషి చేయటమే నిజమైన నివాళి అన్నారు. ప్రభుత్వ లోపభూయిష్ట విధానాలు, కొందరి వ్యక్తిగత స్వార్థం కారణంగా బదిలీలు, పదోన్నతులు నిలిచిపోయి విద్యారంగంలో సంక్షోభం ఏర్పడిందన్నారు. విద్యార్థులకు తీవ్ర నష్టం కలుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వమే చొరవతీసుకుని సంక్షోభం పరిష్కారానికి కషి చేయాలని రవి డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పద్మారావు, ఉపాధ్యక్షులు కవిత, అజరు కుమార్, కోశాధికారి రవీందర్ రెడ్డి, కార్యదర్శులు సుధాకర్, శేఖర్, ఫయాజుద్దీన్, పోచయ్య, గణేష్ ,షాకిర్ అలీ, ప్రేమ్ కుమార్, సీతల్ సింగ్, ప్రభాకర్ ఏసయ్య, చంద్రశేఖర్, బాబు, రాందాస్, పీజీహెచ్‌ఎం శంకర్, సభ్యులు అస్గర్ హుస్సేన్, రియాజ్ అహమద్, యూనస్, ఎజాజ్ తదితరులు పాల్గొన్నారు.