– అంబేద్కర్ జయంతి వేడుకల్లో టీపీఎస్‌కే కన్వీనర్ జి రాములు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కుల నిర్మూలన ఉద్యమాలే అంబేద్కర్‌కు నిజమైన నివాళలని టీపీఎస్‌కే రాష్ట్ర కన్వీనర్ జి రాములు అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సామాజిక సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ 133 వ జయంతి వేడుకలు నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు. అనంతరం రాములు మాట్లాడుతూ అణగారిన వర్గాల్లో పుట్టి , వెలివాడల బతుకులను చూసి, అనేక ఒడిదుడుకులను ఎదుర్కొని తన చదువును కొనసాగించారన్నారు. దేశ అత్యున్నత రాజ్యాంగాన్ని రచించడానికి కారణమయ్యరని చెప్పారు. చదువుతోనే మనిషికి జ్ఞానం,, సమాజంలో గౌరవం దక్కుతాయని చెప్పారు. అంబేద్కర్ జీవితమే ఒక నిదర్శనమని చెప్పారు. మనుధర్మాన్ని తగలబెట్టి మనుషులంతా సమానమని రాజ్యాంగంలో పొందుపరిచారన్నారు. తన జీవితానంతా దళిత బలహీనవర్గాల అభివృద్ధికి పాటుపడ్డారని తెలిపారు. అణగారిన వర్గాలకు సమాజంలో సముచిత స్థానం దక్కాలని ఆకాంక్షించారన్నారు. రాజ్యాంగంలో రిజర్వేషన్లు పొందుపరిచారని తెలిపారు. అంబేద్కర్ ను కేవలం ఒక దళిత నాయకుడు గానే చిత్రీకరించడం సరైంది కాదన్నారు. కేంద్రంలో బీజేపీ సర్కార్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని రద్దు చేయడానికి ప్రయత్నిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడం ద్వారా రిజర్వేషన్లను తొలగించి సామాజిక న్యాయాన్ని సమాధి చేస్తున్నదని విమర్శించారు. రాజ్యాంగ రక్షణ ఉద్యమాల ద్వారా అంబేద్కర్ ఆలోచనా విధానాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరారు. కార్యక్రమంలో కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ స్కైలాబ్ బాబు, చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్ ఎం.వి రమణ, తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆర్ శ్రీరామ్ నాయక్, టీపీఎస్‌కే రాష్ట్ర అధ్యక్షులు భూపతి వెంకటేశ్వర్లు, జీఎంపీఎస్ రాష్ట్ర కార్యదర్శి ఉదుత రవీందర్, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బుర్రి ప్రసాద్, రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం శోభన్, రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గుమ్మడిరాజు నరేశ్, గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం ధర్మా నాయక్ , కేవీపీఎస్ నగర అధ్యక,్ష కార్యదర్శులు ఎం దశరధ్, బి సుబ్బారావు, సోషల్ మీడియా ఇన్‌ఛార్జీ జగదీష్, బాలోత్సవ కమిటీ కార్యదర్శి ఎన్ సోమయ్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం లోయర్ ట్యాంక్‌బండ్‌లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.