
– విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం
– దోషులను కఠినంగా శిక్షించాలి
– ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
నవతెలంగాణ – భువనగిరి
భువనగిరి ఎస్సీ హాస్టల్లో విద్యార్థుల ఆత్మహత్యల గురించి పూర్తిస్థాయిలో విచారణ జరిపి, నిజాలను బయటకు తీయాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. మంగళవారం ఆమె భువనగిరిలోని సాంఘిక సంక్షేమ ఎస్సీ హాస్టల్ ను సందర్శించారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇద్దరు పదవ తరగతి విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని, హృదయ విదారకరమని ఆవేదన వ్యక్తపరిచారు. విద్యార్థులు మృతి, సూసైడ్ లెటర్, ఇక్కడ హాస్టల్లో పరిసరాలు అనుమానాస్పదంగా ఉన్నాయన్నారు. బాలికల హాస్టల్ లోపలికి ఔటర్సు ఎలా వస్తున్నారని ప్రశ్నించారు. పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా మరింత భద్రతా చర్యలు తీసుకోవాలన్నారు. దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బాధ్యతల పట్ల నిర్లక్ష్యంగా ఉన్న వార్డెన్ ను సస్పెండ్ చేయాలని ఆమె కోరారు. ఆమె వెంట బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.