పేదలపై ప్రభుత్వ దౌర్జన్యం నశించాలి

The tyranny of the government against the poor must perish– కూల్చిన గుడిసెలకు నష్టపరిహారం చెల్లించాలి
– వారందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలి : సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు
నవతెలంగాణ – కోరుట్ల
గూడు కోసం ప్రభుత్వ స్థలంలో గుడిసెలు, శాశ్వతనివాసాలు ఏర్పాటుచేసుకున్న పేదల ఇండ్లను అర్థరాత్రి దౌర్జన్యంగా కూల్చేసిన ప్రభుత్వం.. వారికి నష్టపరిహారం చెల్లించి, ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయాలని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు డిమాండ్‌ చేశారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో పోలీసులు, ప్రభుత్వ అధికారులు కూల్చిన గుడిసెలు, ఇండ్ల స్థలాన్ని చెరుపల్లితో పాటు రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మల్లు లక్ష్మి, రాష్ట్ర నాయకులు పి.ఆశయ్య, జిల్లా నాయకులు పరిశీలించారు. కోరుట్ల పట్టణ శివారులోని సర్వేనెంబర్‌ 923లోని 53 ఎకరాల ప్రభుత్వ భూమిలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ఏడాదికిపైగా పోరాడి సుమారు 600మందికిపైగా పేద కుటుంబాలు గుడిసెలు వేసుకొని పూలే, అంబేద్కర్‌ నగర్‌లుగా నామకరణం చేసుకున్నారని తెలిపారు. అందులో దాదాపు 80 కుటుంబాలు రూ.లక్ష చొప్పున ఒక్కో కుటుంబం ఖర్చుపెట్టి పక్కా ఇండ్లు నిర్మించుకుని ఆర్నెల్లుగా అక్కడే ఉంటున్నారన్నారు. కానీ ఇది సహించని ప్రభుత్వం.. అన్యాయంగా గురువారం అర్థరాత్రి వందల మంది పోలీసుల బలగాలతో ప్రభుత్వ అధికారులు జేసీబీలతో ఆ ఇండ్లను కూల్చివేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పేదలకు ఇందిరమ్మ ఇండ్లు పక్కా ఇస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ మాత్రం పేదలు వేసుకున్న గుడిసెలపై దౌర్జన్యకాండ ప్రదర్శిస్తోందన్నారు. కోరుట్లలో కూల్చిన ఇండ్లలో విలువైన వస్తువులు, వంటగ్యాస్‌ సిలిండర్‌, సామాగ్రి, కుట్టుమిషన్లు ధ్వంసం అయ్యాయని, అందులో కొన్ని పోలీసులు తమ వాహనాల్లో తరలించుకుని పోయారని తెలిపారు. ఇప్పటికే ఆ పోరాటానికి బాసటగా ఉన్న తమ పార్టీ ముఖ్య నాయకులను అరెస్టు చేసి పేదలను భయబ్రాంతులకు గురి చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయాలతో గత పాలకులకు, ఈ పాలకులకు తేడా ఏముందని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎంపీ, ఎమ్మెల్యేల స్థాయిలో ప్రజాప్రతినిధులు చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూములను కబ్జా చేసినా ఏ అధికారీ పట్టించుకున్న దాఖలాలు లేవని, ప్రభుత్వ భూమిలో నిలువనీడ లేని పేదలు గుడిసెలు వేసుకుంటే మాత్రం కబ్జా పేరుతో దమనకాండ ప్రదర్శిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూముల్లో నివసించేందుకు గుడిసెలు వేసుకోవచ్చని రాజ్యాంగమే చెబుతుందని, దాన్నీ కాలరాస్తున్నారన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని సీపీఐ(ఎం) బృందం కలిసి తమ పార్టీ ఆధ్వర్యంలో పేదలు గుడిసెలు వేసుకున్నారని, వాటికి పక్కా ఇండ్లతోపాటు పట్టాలు ఇవ్వాలని కోరామని వివరించారు. అప్పుడు వారందరి గుడిసెలను ఇందిరమ్మ ఇండ్లుగా మార్చి పట్టాలు ఇస్తామని, తమ పార్టీ నాయకులపై కేసులనూ ఎత్తివేస్తామని చెప్పారని గుర్తు చేశారు. అది మరిచి తమ నాయకులపై మరిన్ని కేసులు బనాయించి పేదలను వేధిస్తున్నారని మండిపడ్డారు. ఆయన వెంట సీపీఐ(ఎం) కరీంనగర్‌ జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పుప్పాల శ్రీకాంత్‌, జిల్లా నాయకులు చౌదరి, ఎమ్‌డీ సలీం సహా గుడిసెవాసులు ఉన్నారు.