తక్షణ కాల్పుల విరమణ కోసం ఐరాస పిలుపు వీటో పవర్‌తో అడ్డుకున్న అమెరికా

తక్షణ కాల్పుల విరమణ కోసం ఐరాస పిలుపు వీటో పవర్‌తో అడ్డుకున్న అమెరికాన్యూయార్క్‌ : ఇజ్రాయెల్‌ హమాస్‌ మధ్య భీకర పోరు వేళ .. తక్షణ కాల్పుల విరమణ కోసం ఐరాస భద్రతా మండలి పిలుపునిచ్చింది. ఈ దాడుల కారణంగా గాజాలోని సామాన్య ప్రజల బతుకు ఛిద్రమవుతున్నదని, గాజాలో తక్షణమే కాల్పులు విరమణ జరగాలని ఐరాస భద్రతా మండలి చేసిన తీర్మానాన్ని అమెరికా వ్యతిరేకించింది. అందుకోసం తన వీటో పవర్‌ను ఉపయోగించింది. కాల్పుల విరమణ కోసం తీర్మానాన్ని ఆమోదించడానికి గతంలో చేసిన అనేక ప్రయత్నాలు వీటో చేయబడ్డాయి.
ఐక్యరాజ్యసమితి వివరణ
ఇజ్రాయెల్‌ దాడుల్లో గాజాలోని విస్తారమైన ప్రాంతాలు బంజరు భూమిగా మారాయి. వ్యాధి ముప్పుతోపాటు ఆహారం, ఇంధనం, నీరు, ఔషధాల కొరతను ఎదుర్కొంటున్న 80 శాతం జనాభా స్థానభ్రంశం చెందారని ఐక్యరాజ్యసమితి పేర్కొంది. ‘అంతర్జాతీయ మానవతా చట్టం పౌరులను రక్షించే బాధ్యతను కలిగి ఉంటుంది’ అని గుటెర్రెస్‌ చెప్పారు.
వీటో అధికారంతో తీర్మానాన్ని అడ్డుకున్న అమెరికా
గాజాలో మానవతా సంక్షోభ నివారణ నిమిత్తం ఇటీవల ఐరాస చీఫ్‌ ఆంటోనియో గుటెరస్‌ అసాధారణ అధికారాన్ని ఉపయోగించారు. యూఎన్‌ ఛార్టర్‌లోని ఆర్టికల్‌ 99ను ప్రయోగించారు. ఈ ప్రత్యేక అధికారంతో అంతర్జాతీయంగా ఆందోళనలను కలిగించే పరిస్థితుల్లో భద్రతా మండలిని సమావేశపరచవచ్చు. దీనిలో భాగంగా సమావేశమైన మండలిలో ఓటింగ్‌ జరిగింది. అయితే మండలిలో శాశ్వత సభ్యదేశమైన అమెరికా తన వీటో అధికారంతో తీర్మానాన్ని అడ్డుకుంది. మండలిలో మొత్తం 15 సభ్య దేశాలు ఉన్నాయి.
అమెరికా, ఇజ్రాయెల్‌ వ్యతిరేకత
అమెరికా, ఇజ్రాయెల్‌ దేశాలు కాల్పుల విరమణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అది హమాస్‌ పుంజుకునేందుకు ఉపయోగపడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే గాజాలో పౌరుల రక్షణ కోసం, బందీల విడుదల కోసం యుద్ధంలో స్వల్ప విరామాలకు మాత్రం అమెరికా అనుకూలంగా ఉంది.
అమెరికన్‌ రాయబారి రాబర్ట్‌ వుడ్‌ స్పందన
అమెరికన్‌ రాయబారి రాబర్ట్‌ వుడ్‌ మాట్లాడుతూ.. తీర్మానం వాస్తవికతకు దూరంగా ఉందన్నారు. ”నేల మీద సూదిని ముందుకు కదిలించలేరు” అని చెప్పారు. ఈ తీర్మానం ఇప్పటికీ షరతులు లేని కాల్పుల విరమణ కోసం పిలుపునిస్తుందని చెప్పారు. ఇది అక్టోబర్‌ 7న హమాస్‌ చేసిన పనిని పునరావతం చేయగలదు అని అభిప్రాయపడ్డారు.
పాలస్తీనా ప్రతినిధి స్పందన
”మీరు దానిని (యుద్ధాన్ని) సమర్ధిస్తే, మానవత్వానికి వ్యతిరేకంగా చేసిన నేరాలకు మద్దతు ఇస్తున్నారు” అని పాలస్తీనా ప్రతినిధి రియాద్‌ మన్సూర్‌ అన్నారు.
ఓటింగ్‌కు బ్రిటన్‌ దూరం..
గాజాలో తక్షణమే కాల్పుల విరమణ కోసం భద్రతా మండలిలో యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ ప్రతిపాదించిన ముసాయిదాకు 13 మంది అనుకూలంగా ఓటేశారు. బ్రిటన్‌ ఓటింగ్‌కు దూరంగా ఉంది. హమాస్‌ చర్యల పట్ల ఎలాంటి ఖండన లేకపోవడంతో ఓటింగ్‌కు దూరమయ్యామని బ్రిటన్‌ తెలిపింది.