మహిళలు ఎక్కడ పూజింప బడతారో అక్కడ దేవతలు సంచరిస్తారని భారతీయ సంస్కృతిలో నానుడి. నాటి నుండి నేటి వరకు సమాజంలో సగ భాగంగా ఉన్న మహిళలు ఉత్పత్తిలో, అభివృద్ధిలో అంతే స్థాయిలో భాగస్వామ్యం వహిస్తున్నారు. చరిత్రలో ఆనాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నుండి నేటి తెలంగాణ రాష్ట్ర సాధన వరకు మహిళల సగభాగం భాగస్వామ్యంతోనే విజయం సాధించారు. సమాజ అభివృద్ధిలో ఎంతో ప్రాధాన్యత గల మహిళ నాటి నుండి నేటి వరకు వివక్ష, అణచివేత, హింస, వెనుకబాటుతనానికి గురవుతూనే ఉంది. 1990 న్యూయార్క్ టైమ్స్‌లో ఆసియా మరియు ఆఫ్రికాలో లింగ నిష్పత్తి గురించి అమర్త్య సేన్ రాసిన వంద మిలియన్లకు పైగా మహిళలు తప్పిపోయారు అనే వ్యాసం మూడు దశాబ్దాల తర్వాత నేటికి కూడా భారత దేశానికి వర్తిస్తుంది. భారత్‌లో 2011 జనాభా లెక్కల ప్రకారం లింగ నిష్పత్తి ప్రతి 1000 మంది పురుషులకు 940 మహిళలు మాత్రమే ఉన్నారు. మగ పిల్లాడు పుడితే పండగ, ఆడ పిల్ల పుడితే దండగ అని పుత్రుడు పున్నామ నరకం నుండి కాపాడేవాడు అనే ధోరణి తల్లిదండ్రులలో బలంగా ఉంది. సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆడపిల్ల అని తెలియగానే సెక్స్-సెలక్టివ్ అబార్షనులు, భ్రూణ హత్యలు అధికమయ్యాయి. ఐక్యరాజ్యసమితి రూపొందించిన లైంగిక అసమానతల సూచీలో భారతదేశం 134వ స్థానంలో ఉంది. కార్మికశక్తి, వారి ఆదాయాలు, అక్షరాస్యత, జననాల నిష్పత్తిలో అడుగున ఉన్న ఇరవై దేశాలలో భారత్ మొదటి స్థానంలో ఉంది. విద్యా నివేదిక ప్రకారం దేశంలో నిరక్షరాస్యులలో మహిళలు 68శాతం ఉన్నారు. 18ఏండ్లు నిండకముందే 41శాతం బాల్య వివాహాలు జరుగు తున్నాయి. 70శాతం బాలికలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. ఐ.ఎల్.ఓ. ఫిలడెన్ఫియా ప్రకటన 1944 ప్రకారం జాతి, సంప్రదాయం, లింగ భేదాలు లేకుండా స్వేచ్ఛగా, గౌరవ ప్రదంగా, ఆర్థిక భద్రతతో, సమాన అవకాశాలతో మనుషు లందరూ తమ తమ ఆర్థిక పరిపుష్టిని, మానసిక ఉన్నతిని సాధించుకునే హక్కును కలిగి ఉన్నారు. ఆస్ట్రేలియన్ హ్యూమన్ రైట్స్ కమిషన్ టెలీఫోన్‌లో జరిపిన ఒక సర్వే ప్రకారం లైంగిక వేధింపులు అనేవి పని ప్రదేశాలలో దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్నట్లు తేలింది. పదిహేను ఆపై వయసున్న ప్రతి నలుగురు మహిళలలో ఒకరు తమ సహ ఉద్యోగుల చేతిలో వేధింపులకు గురయ్యారు. లైంగిక వేధింపులకు గురైనప్పుడు అది ఆ వ్యక్తులపైన మానసిక, శారీరక వ్యధ కలిగించడమే కాక ప్రతికూల, వేధనా భరిత ప్రభావాన్ని చూపుతుంది. వేధింపులకు గురైన శ్రామికులు తమ వృత్తిలో ఉన్నత ప్రతిభను చూపలేకపోతారు. దీని ప్రభావం మిగిలిన శ్రామికుల మీద కూడా పడి సమిష్టి పని మందగించడం, ఆర్థిక నష్టం, ఉత్పత్తి సామర్థ్యం కుంటు పడుతుంది. ఇది దేశ సమగ్ర అభివృద్ధిపై, దేశ ప్రజల సంక్షేమంపై హానికారక ప్రభావాన్ని కలిగిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది సహించ కూడనిది. శ్రామికులు తమ రోజులోని అధిక భాగాన్ని గడిపే స్థలం గనుక అందరు శ్రామికులకు రక్షణనిచ్చే, భద్రమైన, వ్యత్యాసాలు పాటించని, హింసలేని పనిప్రదేశం హక్కుగా కలిగి ఉంటారు. అందువలన లైంగిక వేధింపులు నిరోధించడం, వాటిపై చర్యలు తీసుకోవడం రెండూ సమాజానికి అవసరం. నేడు దేశాన్ని పట్టి పీడిస్తున్న మరో సమస్య మహిళల, బాలికల అక్రమ రవాణా. దేశంలో కోట్ల డాలర్ల వ్యాపారంగా సాగుతుంది. వెట్టి చాకిరీ, లైంగిక దోపిడీ, అశ్లీలత, అవయవాల తొలగింపు, నిర్బంధం, హింస, వంచన, బలాత్కారం, భయపెట్టడం, పనికి తగిన వేతనం చెల్లించకపోవడం, వివాహం పేరుతో వంచించడం, బలవంతపు నిర్బంధంతో మానసిక క్షోభకు గురిచేయడం లేదా మహిళను గర్భవతిని చేయడం, మాదక ద్రవ్యాలకు, మత్తు పదార్థాలకు బానిసగా మార్చడం వంటివి మానవ అక్రమ రవాణా కింద పరిగణిస్తారు. ప్రభుత్వం మానవ అక్రమ రవాణాను అరికట్టేందుకు జాతీయ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ కమిటీలు ఏర్పాటు చేయాలి. ఇమ్మోరల్ ట్రాఫికింగ్, బాల కార్మిక నిర్మూలన చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలి. దిశ, నిర్భయ చట్టాలకు బడ్జెట్ కేటాయించి ఖర్చు చేయాలి. భారతదేశంలో స్త్రీ సమస్యలకు సంబంధించి మహిళగా, శ్రామిక మహిళగా, పౌరురాలిగా సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగా లలో వివక్షకు, దోపిడీకి గురవుతుంది. ప్రపంచీకరణ, నయా ఉదారవాద విధానాలు మరింత దిగజారుస్తూ స్త్రీని వ్యాపార వస్తువుగా చిత్రీకరిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో మహిళ లకు అండగా ఉండవలసిన ప్రభుత్వం మహిళల చేత అధిక పని గంటలు వెట్టి చాకిరీ చేయించుకుంటూ ఎలాంటి వేతనం లేకుండా ఫ్యాన్సీ పేర్లతో పిలుస్తూ శ్రమ దోపిడీకి గురిచేస్తుంది. ఇంట్లో, సమాజంలో, పని ప్రదేశంలో కనీస వేతనం కోసం, పని భద్రత కోసం, గౌరవ ప్రథమైన జీవనం కోసం పెట్టుబడిదారీ దోపిడీకి గురవుతున్న శ్రామిక వర్గాన్నంతటినీ కలుపుకొని లెనిన్ మహాశ యు డు చెప్పినట్లు ప్రతీ వంటగత్తె ఒక ఉద్యమకారిణిగా మారి అంతర్జాతీ య మహిళా దినోత్సవం స్పూర్తిగా పోరాడవలసిన అవసరం ఉంది.
– కాసు మాధవి
9492585106