– ఇంగ్లాండ్‌పై 36 పరుగులతో గెలుపు
– ఆస్ట్రేలియా 201/7, ఇంగ్లాండ్ 165/6
నవతెలంగాణ-బ్రిడ్జ్‌టౌన్
డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లాండ్ చతికిల పడింది. 202 పరుగుల ఛేదనలో మిడిల్ ఆర్డర్ వైఫల్యంతో పరాజయం మూటగట్టుకుంది. స్కాట్లాండ్‌తో మ్యాచ్ వర్షార్పణం, ఆసీస్ చేతిలో ఓటమితో డిఫెండింగ్ చాంపియన్ గ్రూప్ దశ నుంచి నిష్క్రమించే ప్రమాదంలో పడింది. ఫిల్ సాల్ట్ (37, 23 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), జోశ్ బట్లర్ (42, 28 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఛేదనలో అదిరే ఆరంభం అందించారు. తొలి వికెట్‌కు 7.1 ఓవర్లలోనే 73 పరుగులు జోడించారు. కానీ ఓపెనర్లు ఇద్దరూ జంపా మాయలో పడటంతో ఇంగ్లాండ్‌కు కష్టాలు మొదలయ్యాయి. విల్ జాక్స్ (10), జానీ బెయిర్‌స్టో (7) విఫలమ య్యారు. మోయిన్ అలీ (25), హ్యారీ బ్రూక్ (20 నాటౌట్), లివింగ్‌స్టోన్ (15) అంచనాలను అందుకోలేదు. 20 ఓవర్లలో 6 వికెట్లకు 165 పరుగులే చేసిన ఇంగ్లాండ్ 36 పరుగుల తేడాతో భారీ ఓటమి చవిచూసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 7 వికెట్లకు 201 పరుగులు చేసింది. ట్రావిశ్ హెడ్ (34, 18 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), డెవిడ్ వార్నర్ (39, 16 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లు), మిచెల్ మార్ష్ (35, 25 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), మార్కస్ స్టోయినిస్ (30, 17 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) సహా గ్లెన్ మాక్స్‌వెల్ (28, 25 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. ఆసీస్ స్పిన్నర్ జంపా (2/28) ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. రెండు మ్యాచుల్లో రెండు విజయాలతో గ్రూప్- బిలో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో కొనసాగుతుంది.