సిఎం కప్‌ లోగో, మస్కట్‌ ఆవిష్కరణ

– మే 15 నుంచి తెలంగాణ క్రీడా సంబురాలు
నవతెలంగాణ-హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సిఎం కప్‌ 2023 నిర్వహణ ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. మే 15 నుంచి మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో జరుగనున్న సిఎం కప్‌ టోర్నీ అధికారిక లోగో, మస్కట్‌ను శనివారం ఆవిష్కరించారు. హైదరాబాద్‌లోని టూరిజం ప్లాజా హౌటల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి వి. శ్రీనివాసగ్‌ గౌడ్‌, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాట్స్‌) చైర్మెన్‌ డాక్టర్‌ ఈడిగ ఆంజనేయగౌడ్‌లు లోగో, మస్కట్‌లను ఆవిష్కరించారు. సిఎం కప్‌ టోర్నీలో నిర్వహించే 18 క్రీడాంశాలు ప్రతిబింబించేలా లోగో రూపొందించారు. తెలంగాణ రాష్ట్ర జంతువు కృష్ణ జింక స్ఫూర్తిగా మస్కట్‌కు రూపకల్పన చేశారు. యువతలోని చురుకుతనం, వేగానికి మస్కట్‌ ప్రతీక అని శాట్స్‌ చైర్మెన్‌ ఆంజనేయగౌడ్‌ వెల్లడించారు. ‘సిఎం కప్‌ నిర్వహణను ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాం. తెలంగాణ క్రీడా సంబురాలను విజయవంతం చేసేందుకు రూ.3.60 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే స్టేడియాల నిర్మాణం పనులు 50 శాతం మేరకు పూర్తయ్యాయి. గ్రామీణ స్థాయిలో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేశాము. సిఎం కప్‌ నిర్వహణలో అధికారులు ఎక్కడా నిర్లక్ష్యం వహించకూడదని’ ఈ సందర్భంగా మంత్రి వి. శ్రీనివాస్‌ గౌడ్‌ ఆదేశించారు. సిఎం కప్‌ 2023 టోర్నీ లోగో, మస్కట్‌ ఆవిష్కరణ కార్యక్రమంలో జాతీయ హ్యాండ్‌బాల్‌ సంఘం అధ్యక్షుడు జగన్‌మోహన్‌ రావు, తెలంగాణ ఒలింపిక్‌ సంఘం (టిఓఏ) ఆఫీస్‌ బేరర్లు, వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులు సహా శాట్స్‌ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.