దళిత వరుడిపై అగ్రవర్ణాల దాష్టీకం

– ఊరేగింపుగా వెళ్లాడని దాడి
మీరట్‌ : ఆగ్రాలో ఓ దళిత వరుడిపై అగ్రవర్ణాలకు చెందిన వారు దాడి చేసి తీవ్రంగా హింసించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వరుడు, మరి కొందరు కలిసి వివాహానికి ఊరేగింపుగా వెళుతుండగా ఈ నెల 4వ తేదీ రాత్రి అగ్రవర్ణాల వారు అటకాయించారు. వాహనం నుండి కిందికి లాగి చిత్రహింసలు పెట్టారు. పెళ్లికి వచ్చిన అతిథులు ప్రాణభయంతో వివాహం జరగాల్సిన హాలులోకి పరుగులు తీశారు. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం… అగ్రవర్ణాలకు చెందిన వారు కర్రలు, ఇనుప రాడ్లు పట్టుకొని యువకుడిని, అతనితో ఉన్న వారిని వెంబడించారు. వారిపై దాడికి తెగబడ్డారు. వేదిక వద్ద ఉన్న మహిళలను వేధించారు. పెళ్లి మండపం వద్ద విద్యుత్‌ సరఫరాను నిలిపివేసి కులం పేరుతో దూషించడం ప్రారంభించారు. పెళ్లి వేడుకకు ఆటంకం కలిగించారు. ఈ ఘటనపై వరుడి అత్త గీతా జాతవ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు కాబోయే అల్లుడు అజరు జాతవ్‌, మరికొందరు ఊరేగింపుగా సొహల్లా బస్తీ మీదుగా వెళుతుండగా 20-25 మంది వారిని అటకాయించారని, ఆగిపొమ్మని హెచ్చరించారని ఆమె తన ఫిర్యాదులో తెలిపారు. ‘మా గ్రామంలో పెళ్లి చేసుకునే దళిత యువకులు ఊరేగింపుగా వెళ్లకూడదు. అలా వెళ్లేందుకు వారికి ఎంత ధైర్యం ?’ అంటూ దూషించారని వాపోయారు. ఈ నెల 5న స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించామని, కానీ వారు తీసుకోలేదని చెప్పారు. ఆగ్రా పోలీస్‌ కమిషనర్‌ ఆదేశాల మేరకు 8న ఫిర్యాదును స్వీకరించారని అన్నారు. తన కుమార్తె అంజన వివాహాన్ని అడ్డుకున్న వారిని తక్షణమే అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. పోలీసులు వివిధ సెక్షన్ల కింద 20 మంది గుర్తు తెలియని వ్యక్తులు సహా 25 మందిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. అయితే ఇప్పటి వరకూ ఎవరినీ అరెస్ట్‌ చేయలేదు.