– సంఘీభావంగా దుబ్బాకలో సీఐటీయూ ప్లకార్డులతో ప్రదర్శన
నవతెలంగాణ – దుబ్బాక
క్యూబా పై అమెరికా విధించిన వాణిజ,ఆర్థిక నిర్బంధాన్ని వెంటనే ఎత్తివేసేలా ఐక్యరాజ్యసమితిలో తీర్మానం చేయాలని సీఐటీయూ సిద్దిపేట జిల్లా కోశాధికారి జీ.భాస్కర్ డిమాండ్ చేశారు. క్యూబా పై అమెరికా అవలంబిస్తున్న సామ్రాజ్యవాద నిరంకుశ నిర్బంధాన్ని ఖండిస్తూ సీఐటీయూ ఇచ్చిన దేశవ్యాప్త సంఘీభావ ప్రదర్శనలో భాగంగా మంగళవారం దుబ్బాక పట్టణ కేంద్రంలో సీఐటీయూ ఆధ్వర్యంలో ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. సీఐటీయూ జిల్లా కోశాధికారి జీ.భాస్కర్ మాట్లాడుతూ.. క్యూబాపై అమెరికా ఉద్దేశపూర్వకంగా నిషేధాలు,నిర్బంధాలను కొనసాగిస్తుందని విమర్శించారు. దీని ఫలితంగా అక్కడి ప్రజలకు అత్యవసర వైద్య సేవలకు, చికిత్సలకు వినియోగించే మందులు, ఇతర పరికరాలు కొరత ఏర్పడడమే కాకుండా.. నేడు క్యూబా అతిపెద్ద ఇంధన సంక్షోభం ఎదుర్కొంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈనెల 28, 29 తేదిల్లో జరగబోవు ఐక్యరాజ్యసమితి సాధారణ సమావేశాల్లో క్యూబా పై అమెరికా నిర్బంధాలను ఎత్తివేసేలా ప్రపంచ దేశాలు ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు.ఈ నిరసనలో సీఐటీయూ నాయకులు కొంపెల్లి భాస్కర్, బత్తుల రాజు, మెరుగు రాజు, మల్లేశం, సాజిత్, లక్ష్మీనర్సయ్య, రమేష్, సాయికుమార్ పలువురు పాల్గొన్నారు.