రష్యా చమురు ధరపైనున్న పరిమితిని మరింత కఠినంగా కుదించాలని ఉక్రెయిన్ పదపదే కోరటాన్ని అమెరికా ప్రభుత్వం తిరస్కరించింది. దీనికి కారణం రష్యా చమురు ధరపైన సరికొత్తగా తీసుకునే తీవ్ర చర్యలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదింపుకు గురిచేస్తాయని అమెరికా ఆందోళన చెందుతోందని వాషిగ్టన్ పోస్టు బుధవారంనాడు రిపోర్ట్ చేసింది. రష్యా ఆర్థిక వ్యవస్థపైన వత్తిడి తీసుకురావటానికి ఆ దేశ చమురు ధరను 60డాలర్ల నుంచి 30డాలర్లకు తగ్గించాలని ఉక్రెయిన్ బైడెన్ పాలనను కోరుతోందని వాషింగ్టన్ పోస్టు రాసింది. అయితే అటువంటి చర్యతో ప్రపంచ మార్కెట్ అంతలాకుతలం అవుతుందని, అదీ 2024లో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న సందర్భంలో ఇది వాంచనీయం కాదని అమెరికా భావిస్తోంది. అంతేకాకుండా అటువంటి చర్యకు యూరోపియన్ యూనియన్ ఆమోదం అవసరం అవుతుందని, అది ఉక్రెయిన్ కు సైనిక సహాయాన్ని అందించటాన్ని ప్రమాదంలో పడేయవచ్చని కూడా అమెరికా అనుకుంటోంది. రష్యా చమురు ధరపైన ఇటువంటి నియంత్రణను విధించటంవల్ల నౌకా రవాణా, భీమా, ఇతర సేవలను అందించే పశ్చిమ దేశాల కంపెనీలు మరింతగా ప్రమాదంలో పడతాయి. తమ చమురుపైన ఇటువంటి ఆంక్షలను విధించటానికి వ్యతిరేకంగా రష్యా తీవ్రంగా స్పంధించింది. ఇటువంటి చర్యలకు మద్దతునిస్తున్న దేశాలకు తమ చమురు, ఇతర ఉత్పత్తుల విక్రయాన్ని రష్యా నిషేధించి చైనా, ఇండియావంటి మిత్రదేశాలకు ఎగుమతి చేస్తోంది. గత సంవత్సరం రష్యా చమురు ధరపైన ఆంక్షలను విధించిన తరువాత జులై మధ్యదాకా చమురు ధర 60డాలర్లు దాటలేదు. అదే కాలంలో పశ్చిమ దేశాల కంపెనీలను ఆంక్షలను అనుసరించ వలసిందిగా అమెరికా నచ్చజెప్పే ప్రయత్నం చేసింది. అయినప్పటికీ పశ్చిమ దేశాల కంపెనీలు రష్యా చమురు ధరపైన విధించిన ఆంక్షలను పట్టించుకోకుండా రష్యా క్రూడ్ ఆయిల్ ఎగుమతికి మార్గం సుగమం చేస్తూనే ఉన్నాయని రాయిటర్స్ పేర్కొంది.