అమెరికా అధ్యక్ష ఎన్నికలు రేపే తుది సమరం

US presidential election Final fight tomorrow – పోలింగ్‌ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు
– విజేత ఎవరో తేలడానికి సుదీర్ఘ నిరీక్షణ
వాషింగ్టన్‌: ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన, శక్తివంతమైన దేశంలో అధ్యక్ష ఎన్నికల తుది ఘట్టానికి రంగం సిద్ధమైంది. ఇప్పటికే 7 కోట్ల మంది అమెరికన్లు వివిధ ఓటింగ్‌ కేంద్రాల్లో ముందస్తుగా ఓటు వేశారు. కీలకమైన తుది ఓటింగ్‌ మంగళవారం (నవంబరు5) జరగనుంది. అయితే విజేత ఎవరో తేలడానికి రోజులు పట్టవచ్చు. ఏడు స్వింగ్‌ స్టేట్స్‌కు గాను ఆరింటిలో ట్రంప్‌దే పైచేయిగా ఉన్నట్టు అట్లాస్‌ తాజా పోల్‌ సర్వే పేర్కొనగా, ఇద్దరి మధ్యచాలా గట్టి పోటీ నెలకొన్నట్లు న్యూయార్క్‌టైమ్స్‌ సర్వే పేర్కొంది. తుది ఓటింగ్‌కు మరో 24 గంటల్లో తెర లేవనుండడంతో కమలా హారిస్‌ (డెమొక్రాటిక్‌ పార్టీ), డొనాల్డ్‌ ట్రంప్‌ (రిపబ్లికన్‌ పార్టీ) మధ్య మాటల యుద్ధం పతాక స్థాయికి చేరింది. ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో మాటల తూటాలు పేల్చుతూ వాతావరణాన్ని వేడెక్కిస్తున్నారు. కీలకమైన సమస్యలను ఎజెండాపైకి రానీయకుండా వ్యక్తిగత ధూషణలు, ఊక దంపుడు ఉపన్యాసాలతో ప్రచారాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. ఎలక్టొరల్‌ కాలేజీలో అత్యధిక ఎలక్టొర్స్‌ కలిగిన రాష్ట్రాల్లో ఒకటైన పెన్సిల్వేనియాలో ప్యూర్టోరికన్లపై ఆదివారం నాటి ఎన్నికల ర్యాలీలో ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలు హారిస్‌కు ఆయాచిత వరంగా పరిణమించాయి. ప్యూర్టోరికో చెత్త దీవి అని ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలు పెన్సిల్వేనియాలో ఆయన విజయావకాశాలను దెబ్బతీసేలా ఉన్నాయి. ట్రంప్‌ వ్యాఖ్యలపై ప్యూర్టోరికన్లు ఆగ్రహంగా ఉన్నారు. దీనిని సొమ్ము చేసుకోవడానికి హారిస్‌ యత్నిస్తున్నారు. జాతి దురహంకారం, విద్వేష రాజకీయాలకు పెట్టింది పేరు ట్రంప్‌ అని ఆమె దుయ్యబట్టారు. తాజాగా నిర్వహించిన ఓ ఒపీనియన్‌ పోల్‌లో హారిస్‌కు అమెరికన్ల మద్దతు 44 శాతం నుండి 43 శాతానికి తగ్గినట్లు వెల్లడించింది. దీంతో ఈ సారి ఎన్నికల ఫలితాన్ని జార్జియా, మిచిగాన్‌ వంటి ఏడు స్వింగ్‌ రాష్ట్రాలు నిర్ణయించనున్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. హారిస్‌ తన దృష్టంతా ఇప్పుడు మిచిగాన్‌ పై కేంద్రీకరించారు. ఇజ్రాయిల్‌కు అమెరికా మద్దతు తెలపడాన్ని అరబ్‌ అమెరికన్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అరబ్‌ అమెరికన్లు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఇదే. పాలస్తీనీయులను ఊచకోత కోస్తున్న ఇజ్రాయిల్‌కు గత సంవత్సర కాలంలో అమెరికా 380 కోట్ల డాలర్ల మిలిటరీ సాయాన్ని అందజేసింది. ట్రంప్‌ కూడా ఇజ్రాయిల్‌ను పూర్తిగా వెనకేసుకొస్తున్నారు. ఈ విషయంలో ట్రంప్‌, హారిస్‌ల మధ్య తేడా ఏమీ లేదు. అలాగే కార్పొరేట్‌ పన్ను తగ్గించే విషయంలో డెమొక్రాటిక్స్‌కి, రిపబ్లికన్స్‌కి మధ్య ఎలాంటి పేచీ లేదు. జాన్‌ఎఫ్‌ కెనడీ, ఐషెన్‌ హోవర్‌ కాలంలో 90 శాతంగా ఉన్న కార్పొరేట్‌ టాక్స్‌ నేడు 21 శాతానికి కుదించబడిందంటే దీనికి ఈ రెండు పార్టీలే కారణం. విదేశీ వలస కార్మికులు, కష్టజీవుల విషయంలో ట్రంప్‌ చాలా క్రూరమైన వైఖరి తీసుకున్నారు. ఈసారి తాను గెలిస్తే ఎలాంటి సరైన పత్రాలు లేకుండా దేశంలో ఉంటున్న 2 కోట్ల మంది విదేశీయులను గెంటివేస్తానని బాహాటంగా చెబుతున్నారు. హారిస్‌ దీనికి ప్రత్యామ్నాయం ఏమిటో చెప్పకుండా ట్రంప్‌ రేసిస్టు, విద్వేషి అని విమర్శించడానికే పరిమితమవు తున్నారు. ఈ రెండు ప్రధాన పార్టీలకు పూర్తి భిన్నంగా, పీపుల్స్‌ అజెండాతో అమెరికన్‌ కమ్యూనిస్టు పార్టీ ఎన్నికల్లో పాల్గొంటున్నది. ‘మాగా’ (ఎంఎజిఎ- మేక్‌ అమెరికా గ్రేట్‌ ఎగైన్‌) నినాదంతో ముందుకొస్తున్న ఫాసిస్టు ట్రంప్‌ను ఓడించేందుకు కార్మిక, ప్రగతిశీల శక్తులను కలుపుకుని వీలైనంత విశాల ఐక్యత సాధించేందుకు కమ్యూనిస్టు పార్టీ కృషి చేస్తోంది. కొన్ని రాష్ట్రాల్లో అణగారిన వర్గాలకు ఓటు వినియోగించుకునే హక్కు తిరస్కరించబడుతున్నందున వారి ఓటు వేసే హక్కును కాపాడతామని, కార్మిక హక్కులను పరి రక్షించడం, పేద, ధనికుల మధ్య విపరీతంగా పెరిగిపోయిన అంతరాలను తొలగిస్తామని, పునరుత్పత్తి హక్కు పరిరక్షిస్తామని, టెస్లా, నెట్‌ ఫ్లిక్స్‌, జనరల్‌ ఎలక్ట్రికల్స్‌, టెస్లా వంటి గుత్త సంస్థల పై కార్పొరేట్‌ పన్ను పెంచుతామని, తద్వారా సమకూరిన ఆదాయాన్ని అందరికీ విద్య, వైద్యం, గృహవసతి కల్పించేందుకు వినియోగిస్తామని కమ్యూనిస్టు పార్టీ తన ఎజెండాలో పేర్కొంది. అంతేకాదు, క్యూబాపై దశాబ్దాలుగా అమెరికా సాగిస్తున్న ఆర్థిక దిగ్బంధనాన్ని ఎత్తివేస్తామని, యూదు దురహంకార ఇజ్రాయిల్‌కు అన్ని రకాల సాయాన్ని నిలిపివేస్తామని, శాశ్వత కాల్పుల విరమణకు కృషి చేస్తామని కమ్యూనిస్టు పార్టీ తెలిపింది. పచ్చి మితవాది ట్రంప్‌ను ఓడించేందుకు శాయశక్తులా కృషి చేయాలని కమ్యూనిస్టు పార్టీ తన శ్రేణులకు పిలుపునిచ్చింది.