స్నేహం విలువ

The value of friendshipప్రియమైన వేణు గీతికకు..
ఎలా ఉన్నావు చిట్టి తల్లి? నువ్వు నీ స్నేహితులు కలిసి సరదాగా గడుపుతున్నారని ఆశిస్తున్నా. నేను రాస్తున్న ఉత్తరాలు చదువుతున్నందుకు చాలా సంతోషం నాన్న. ఇవాళ నీకు జీవితంలో స్నేహం ఎంత ముఖ్యమైనదో చెప్తాను. తల్లి తండ్రులతో చెప్పుకోలేనివి, తోడ బుట్టిన వారితో పంచుకోలేనివి స్నేహితులతో పంచుకుంటాం. స్నేహం అనేది ఓ ఆత్మీయ బంధం. దీంట్లో కష్టం, సుఖం, సంతోషం అన్నీ ఉంటాయి. స్నేహానికి సరైన అర్ధం తెలుసుకోవాలి. అందరూ స్నేహితులు కారు. ఈ మధ్య కాలంలో స్నేహం అనేది ఒక రొటీన్‌ పదం అయిపోయింది. అంతలోనే స్నేహం అంటారు, అంతలోనే మేము మాట్లాడుకోవడం లేదు అంటారు. ఇద్దరి మధ్య సరైన అవగా హన లేకపోవడమే దీనికి కారణం. అవసరం కోసం స్నేహం చేయ కూ డదు. అవి నిలబడవు. ముఖ్యంగా నమ్మక ద్రోహం అసలు చేయకూ డదు. ఒకరి గురించి ఇంకొకరి దగ్గర చెడుగా అసలు మాట్లాడకూడదు.
చిన్ననాటి స్నేహితుల మధ్య ఏర్పడే ఆత్మీయత, ప్రేమ పెద్ద వాళ్ళు అయ్యాక ఏర్పడే స్నేహితుల మధ్య అంతగా ఉండవు. అన్నింటికంటే ముఖ్యం నీ కోసం, నీ కష్టంలో తోడు ఉండేవారే నిజమైన స్నేహితులు. నీవు ఏదైనా తప్పు చేస్తే, సరిదిద్దుతూ మంచి మార్గం చూపగలగాలి. స్నేహంలో స్వార్ధం, అసూయ, ద్వేషాలకు తావు ఉండకూడదు.
ఇక అన్నింటికి కంటే ముఖ్యమైనది ఈ బంధలో డబ్బుకు తావుండ కూడదు. డబ్బు వల్ల స్నేహం చెడిపోతుంది. ఏ రోజు అయితే ఆర్థిక లావాదేవీలు మొదలు అవుతాయో ఆ రోజుతోనే బంధంలో గీటలు మొదలవుతాయి. నిజంగా ఆర్థిక సాయం తప్పనిసరి అయితే నువ్వు చేయగలిగినంత చేసి మర్చి పోవాలి. వాళ్లు స్థిమిత పడ్డాక నీ డబ్బు తిరిగి ఇస్తే మంచిదే. లేకుంటే స్నేహం ముఖ్యమనుకుని దాని ప్రస్తావన తేకుండా ఉండాలి. పండగలు, పుట్టినరోజులు, శుభకార్యాలు ఇటువంటివి స్నేహితులతో కలిసి చేసుకున్నప్పుడు ఆ ఆనందం వేరుగా ఉంటుంది. ఈ రోజున నువ్వు ఉద్యోగం చేస్తూ, నీ స్నేహితులకు అవసరం అయినపుడు చేతనైన సాయంగా ఉంటున్నావు. చిన్నప్పటి నుండి స్నేహితులతో ఎంతో బాధ్యతగా ఉండే దానివి. ఒక నిజమైన ఫ్రెండ్‌ ఎలా ఉండాలో అలా ఉన్నావు. ఈ బంధంలో బాధ్యతలు కూడా ఉంటాయి నాన్న. వాటిని నువ్వు నూటికి నూరుపాళ్లు పాటిస్తున్నావు అనటంలో సందేహం లేదు.
ఒక్కొక్కసారి పరిస్థితుల దృష్ట్యా ఎదుటివారు సాయం చేయలేక పోవచ్చు. అటువంటప్పుడు వారిని తప్పు పట్టకూడదు. పరిస్థితులను అర్ధం చేసుకోవాలి. స్నేహం కల కాలం సాగాలంటే మన పరిధిలో మనం ఉంటూ, అవసరం అయినప్పుడు అండగా ఉంటూ జీవితంలో ముందుకు సాగాలి. డబ్బు పోయినా పర్వాలేదు, కానీ ఒక మంచి స్నేహితుని పోగొట్టుకోకూడదు. నీకు స్నేహం విలువ తెలిసినప్పటికీ ఎందుకు చెబుతున్నానంటే స్నేహితులుగా ఉంటూ నమ్మకం కలిగిస్తూ, అవసరం తీరాక తిరిగిచూడని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇదొక్కటే తెలుసుకుని జాగ్రత్తగా ఉండమని కోరుకుంటూ..

– ప్రేమతో అమ్మ
హొ- పాలపర్తి సంధ్యారాణి