అమ్మాయిల అభివృద్దికి బాల్య వివాహాలు అవరోధంగా ఉన్నాయి. నేరమని చట్టాలు వచ్చినా ఆర్థిక పరిస్థితుల రీత్యా తల్లిదండ్రులు తమ పిల్లలకు అత్యంత చిన్న వయసులోనే పెండ్లి చేసి పంపుతున్నారు. చాలా మంది ఎదురు చెప్పలేక మౌనంగా బాధను భరిస్తున్నా రు. కానీ జ్యోత్స్నా అక్తర్ అలా కాదు. ఒకప్పుడు ఆమె ఓ సాధారణ విద్యార్థిని. ఇప్పుడు బాల్య వివాహాలకు వ్యతిరేకంగా వాదించే ఓ ధిక్కార స్వరంగా అవతరించింది. తాను చేస్తున్న కృషికి ఈ ఏడాది జాతీయ బాల పురస్కారాన్ని సైతం అందుకున్న ఆమె ప్రయాణం…
జ్యోత్స్నా అఖ్తర్‌కు దక్షిణ త్రిపుర జిల్లాలోని అమ్జాద్‌నగర్ హైస్కూల్‌లో 9వ తరగతి చదువుతుండగా వివాహం చేయాలనుకున్నారు. ఆ సమయంలో ఆమె బాల్య వివాహాలపై అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన బాలికా మంచా అనే వేదికకు యాక్టివ్ కన్వీనర్‌గా పనిచేస్తోంది. ‘నా తల్లిదండ్రులు పేదరికం కారణంగా నేను 9వ తరగతిలో ఉన్నప్పుడు పెండ్లి చేయాలనుకున్నారు. నా చదువును కొనసాగించడానికి అనుమతించమని నేను వారిని వేడుకున్నాను. కానీ వారు వినలేదు. ఈ విషయం నేను మా అక్కకు చెప్పాను. ఆమె మా ప్రధానోపాధ్యాయుడికి తెలియజేసింది. దాంతో చైల్డ్ లైన్ సభ్యులు మా ఇంటికి వచ్చి బాల్య వివాహాల వల్ల వచ్చే సమస్యల గురించి చెప్పి పెండ్లి ఆపించేశారు’ అని జ్యోత్స్నా గుర్తు చేసుకుంది.
తన పనిని కొనసాగిస్తోంది
అమ్జద్‌నగర్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు జ్యోత్స్న వివాహాన్ని అడ్డుకోవడంలో సహాయం చేయడంతోపాటు ఆమె పాఠశాల విద్యను కొనసాగించేందుకు సైకిల్‌ను కూడా ఏర్పాటు చేశారు. ‘ఆర్థిక సమస్యల కారణంగా జ్యోత్స్న చదువును కొనసాగించలేమని ఆమె తల్లిదండ్రులు నాతో చెప్పారు. నేను ఆమె చదువు ఖర్చులు భరిస్తానని, ఆమె వివాహాన్ని రద్దు చేయమని వారిని అభ్యర్థించాను. ఈ కేసులో చైల్డ్ లైన్ కూడా సహకరించింది’ అని ఆయన చెప్పారు. ప్రస్తుతం బెలోనియాలోని ఆర్య కాలనీ హయ్యర్ సెకండరీ స్కూల్‌లో హ్యుమానిటీస్ స్ట్రీమ్‌లో చదువుతున్న జ్యోత్స్న తన పాఠశాలతో పాటు, స్థానిక సంఘంలో బాలికా మంచా ద్వారా బాల్య వివాహాలకు వ్యతిరేకంగా తన పనిని కొనసాగిస్తుంది. ‘నా తల్లిదండ్రుల ఆర్థిక ఒత్తిడిని తగ్గించడానికి నేను చదువుకుని మంచి ఉద్యోగం చేయాలనుకుంటున్నాను. బాల్య వివాహాల వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలను అర్థం చేసుకుని చదువుపై దృష్టి పెట్టాలనే సందేశాన్ని బాలికలందరికీ తెలియజేయాలనుకుంటున్నాను’ అని ఆమె అంటుంది. ఇలా బాల్య వివాహాల వ్యతిరేక ప్రచారంలో ఆమె చేసిన కృషికి ఈ ఏడాది జాతీయ బాల పురస్కారం అందుకుంది.
పొరపాటును గుర్తించి
ఆర్య కాలనీ హయ్యర్ సెకండరీ స్కూల్ ఇన్‌చార్జి హెడ్‌మిస్ట్రెస్ రీనా మిత్ర మాట్లాడుతూ ‘ఆమె ఈ జూలైలో మా పాఠశాలలో అడ్మిషన్ తీసుకుంది. ఆమె అమ్మాయిలకు స్ఫూర్తిదాయకం’ అన్నారు. జ్యోత్న్స తన కుటుంబంలో అందరి కంటే చిన్నది. చదువుతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలలో కూడా పాల్గొంటుంది. ఆమె అక్క హోస్నా అఖ్తర్ 10వ తరగతి పరీక్ష పూర్తయిన తర్వాత 18 ఏండ్లకు వివాహం చేసుకుంది. ఆమె సోదరుడు పాఠశాల తర్వాత విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నాడు. అతను ఇటీవలె గ్రామానికి తిరిగి వచ్చాడు. జ్యోత్న్స తల్లి రూమా తాము చేసిన పొరపాటును గుర్తించి కూతురు చదువుకు, సామాజిక కార్యకలాపాలకు మద్దతునిస్తోంది. ‘మేము పేదరికంతో పోరాడుతున్నాం. మా ఇద్దరు పిల్లలను సరిగ్గా చదివించలేక పోయాం. జ్యోత్స్నకు కూడా పెండ్లి చేయాలనుకున్నాం. బాల్య వివాహాల వల్ల వచ్చే సమస్యల గురించి మాకు తెలియదు. ప్రధానోపాధ్యాయుడు, చైల్డ్ లైన్ సభ్యులు వివరించడంతో మా తప్పును గ్రహించాం’ అని ఆమె చెప్పింది.
నెలకు 15-20 బాల్య వివాహాలు
జ్యోత్స్న పెండ్లిని ఆపివేసిన బృందంలో భాగమైన చైల్డ్ లైన్ మాజీ సభ్యుడు ప్రసేన్‌జిత్ సిన్హా మాట్లాడుతూ ‘దక్షిణ త్రిపురలో సగటున నెలకు 15-20 బాల్య వివాహాల కేసుల గుర్తించి ప్రభుత్వ సంస్థకు సమాచారం అందించాము. 2023 నుండి ఆగస్టు 2024 వరకు మొత్తం 199 బాల్య వివాహాల కేసులు గుర్తించాము. వీటిలో 78 కేసులను నమోదు చేసాము. ఈ వివాహాలన్నింటినీ ఆపగలిగాము’ అని అతను చెప్పారు. సిన్హా ప్రస్తుతం సౌత్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్‌లో ప్రొటెక్షన్ ఆఫీసర్ (ఇన్‌స్టిట్యూషనల్ కేర్)గా పనిచేస్తున్నారు.
కొనసాగుతున్న సవాళ్లు
2019 నివేదిక ప్రకారం త్రిపురలోని నాలుగు జిల్లాల్లో బాల్య వివాహాలు అత్యధికంగా జరుగుతున్నాయి. రాష్ట్రంలో అత్యధికంగా ధలైలో 24.7 శాతం కేసులు నమోదయ్యాయని, దక్షిణ త్రిపురలో 24.1 శాతం కేసులు నమోదయ్యాయని నివేదిక పేర్కొంది. పశ్చిమ త్రిపురలో 20.4 శాతం, ఉత్తర త్రిపురలో 19.8 శాతం నమోదయ్యాయి. సర్వేలో పాల్గొన్న బాలికల్లో 52 శాతం మంది కనీసం ఒక్కసారైనా గర్భం దాల్చినట్లు కూడా వెల్లడించింది. 2023లో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 ప్రకారం ఆంధ్రప్రదేశ్, అస్సాం, బీహార్, జార్ఖండ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, త్రిపురలలో బాల్య వివాహాల రేటు జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉంది.
బాల్య వివాహాల ప్రాబల్యం
యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ నివేదిక ప్రకారం ఎనిమిది రాష్ట్రాల్లో జాతీయ సగటు కంటే బాల్య వివాహాల ప్రాబల్యం ఎక్కువగా ఉంది. పశ్చిమ బెంగాల్, బీహార్, త్రిపుర ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాయి. ఈ మూడు రాష్ట్రాల్లో 20-24 ఏండ్ల వయసున్న మహిళల్లో 40 శాతానికి పైగా 18 ఏండ్లలోపు వివాహాలు జరుగుతున్నాయి. అందుకే బాల్య వివాహాలను రూపొందించేందుకు జ్యోత్స్న వంటి యువతులు ముందుకొచ్చి తమ వాదనలను వినిపిస్తున్నారు. తమ లాంటి అమ్మాయిలకు ఆదర్శంగా నిలుస్తున్నారు.