రైల్వే బాధితులకు తగు న్యాయం చేయాలని, భూములు కోల్పోయిన వారికి మార్కెట్ ధరకు అనుగుణంగా నష్టపరిహారం ఇప్పించాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ను కలిసి విన్నవించుకున్నట్లు రైల్వే బాధితులు తెలిపారు. శనివారం కలెక్టరేట్ కార్యాలయంలో మంత్రిని కలిసి బాధితులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెద్దకోడూర్, మందపల్లి శివారు ప్రాంతంలో రైల్వే లైన్ లో పోయిన స్థలాలకు బదులుగా వేరొక దగ్గర స్థలాలు ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. సర్వే నంబర్ 301, 68/1/అ, 68/1/ఆ, 303 ఇట్టి సర్వే నంబర్ లో వందల మంది పిల్లల చదువులకు, పెళ్లిల కోసం ప్లాట్లు కొనుక్కున్నట్లు తెలిపారు. నిరుపేదలైన తమ స్థలాలను రైల్వే వారు దౌర్జన్యంగా రైల్వే లైన్ కోసం తీసుకోవడం, మాకు ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడం, వందలాది మంది ప్లాట్లు కోల్పోతున్నామని అన్నారు. లక్షల్లో డబ్బులు పెట్టి మేము కొంటే ప్రభుత్వం వేలలో నష్టపరిహారం ఇవ్వాలని చూస్తున్నారని, మాకు ప్లాట్లకు బదులు ప్లాట్లు ఎక్కడైనా ఇవ్వాలని, లేదా ఈ సమస్యకు పరిష్కారం కొరకు, తమకు న్యాయం జరిగే వరకు ఎక్కడికైనా వెళ్తామని అన్నారు. మంత్రి సానుకూలంగా స్పందించి భూపాధితులకు తగిన న్యాయం చేస్తానని చెప్పినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బాధితులు, నాయకులు శేఖర్, అంజి తదితరులు పాల్గొన్నారు.