సోమాలిల్యాండ్‌ అధ్యక్షుడుగా ప్రతిపక్ష నేత విజయం

మొగదిషు : సోమాలియా నుండి చీలిపోయిన ప్రాంతం సోమాలిల్యాండ్‌లో గత వారం జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ప్రతిపక్ష నేత విజయం సాధించారని ఎన్నికల కమిషన్‌ మంగళవారం ప్రకటించింది. ప్రధాన ప్రతిపక్షమైన వాదాని పార్టీకి చెందిన అబ్దిరహమాన్‌ మహ్మద్‌ అబ్దుల్లాకు 50శాతానికి పైగా ఓట్లు లభించాయి. పాలక కుల్మియి పార్టీకి చెందిన అధ్యక్షుడు ముసే బిహి అబ్దికి 30శాతానికి పైగా ఓట్లు లభించాయి. 2022లోనే ఎన్నికలు జరగాల్సి వున్నా నిధుల కొరత ఇతరత్రా కారణాలతో ఈ ఎన్నిక వాయిదా పడుతూ వచ్చింది. 1991లో సోమాలియాలో చెలరేగిన అసంతృప్తులు, ఘర్షణలు, నిరసనలు చివరికి సోమాలిల్యాండ్‌ ఏర్పాటుకు దారి తీశాయి. తన స్వంత ప్రభుత్వం, కరెన్సీ, భద్రతా వ్యవస్థ అన్నింటినీ విడిగానే సమకూర్చుకుంది. అయితే అంతర్జాతీయ గుర్తింపు మాత్రం లేదు. భద్రత విషయంలో సోమాలియాలో అనేక పోరాటాలు జరుగుతున్నా సోమాలియా ల్యాండ్‌ మాత్రం సుస్థిరమైన రాజకీయ వాతావరణాన్ని నెలకొల్పింది.